Special Story : కారణజన్ముడు..కారుణ్యముని.. గౌతమ బుద్దుడు

Special Story  : కారణజన్ముడు..కారుణ్యముని.. గౌతమ బుద్దుడు

బౌద్ధం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు అత్యున్నత విలువనిచ్చింది. కుల, మత రహిత సమ సమాజ స్థాపనకు పూనుకొని దాన్ని ఆచరణలో పెట్టి భారతదేశ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలబడింది. బౌద్ధంలో స్త్రీకి అత్యున్నతమైన విలువ, గౌరవం, స్వేచ్ఛను కల్పించింది. ఇలాంటి బౌద్ధం భారతదేశ సమాజానికే కాదు యావత్‌ ప్రపంచ వర్తమాన, భవిష్యత్తుకు ఒక గొప్ప దార్శనికంగా ఆదర్శప్రాయంగా ఉంటుంది.

క్రీ.పూ.623వ సంవత్సరంలో ఇప్పటి నేపాల్‌లోని లుంబినిలో ఒక రాజ కుటుంబంలో గౌతమ బుద్ధుడు జన్మించారు. కానీ ఆయన రాజు గానీ, చక్రవర్తి గానీ కాలేదు. ఒక గొప్ప తథాగత బుద్ధుడుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.  బుద్ధుడు తన పూర్తి తాత్విక బోధనలన్నింటిలోనూ దైవ ప్రసక్తి లేకుండా దైవాన్ని నిరాకరించి ఆ చోట సత్యానికి ప్రాధాన్యాన్నిచ్చారు. దుఃఖానికి కారణం కోరిక అని, మనిషికి కోరిక ఉండకూడదనే భావరాహిత్య ఆవశ్యకతను వివరించారు.

గౌతమ శాక్యమౌని తన బోధనల్లో ప్రజ్ఞ, కరుణ, శీలం అనే మూడు గుణాలు మానవున్ని ఉదాత్త స్థాయికి తీసుకువెళ్తాయని పేర్కొంటారు. కరుణ లేని ప్రజ్ఞ వ్యర్థం...ప్రజ్ఞ లేని శీలం దుర్బలం... ఈ మూడు ఉన్నప్పుడే మానవుడు బుద్ధత్వాన్ని చేరుకుంటాడు. కరుణార్ద్ర హృదయం లేని ప్రజ్ఞ నిస్సారమైనదని బౌద్ధం చెప్తుంది. అసలు బుద్ధత్వం అంటే రెండు రకాల జ్ఞానాల పతనం జరుగుతుంది. అందులో ఒకటి బయటి వస్తువు. రెండవది లోపలి వస్తువు. ఈ రెండూ ఉండని స్థితియే బుద్ధత్వం.

బౌద్ధం జ్ఞానం కన్నా ప్రజ్ఞకు ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తుంది. జ్ఞానం విశ్వవిద్యాలయాల్లో విస్తారంగా దొరకవచ్చు..  కానీ ప్రజ్ఞను నీలో నీవే తెలుసుకోవాలి. ప్రజ్ఞ నీ స్మృతిలో నిలిచినప్పుడు ఆనందం. అంటే నీ స్మృతిలో నువ్వే ప్రశాంతంగా ఉండటం. అదే బుద్ధత్వం. జ్ఞానం గతానికి సంబంధించింది, ప్రజ్ఞ వర్తమానానికి సంబంధించింది. ఈ తేడాను తెలుసుకుంటే బుద్ధుని మార్గంలో ఉన్నట్టు. ఇది గురుశిష్యుల మధ్య మహా మౌనంగా ప్రసరిస్తూ ఉంటుంది. అది గురువు ఇచ్చేది కాదు. కానీ, శిష్యుడు స్వీకరించేది.

సిద్ధార్థునికి జ్ఞానోదయం అయిన తర్వాత ఈ ప్రపంచపు లీల ఆయనకు పూర్తిగా తెలిసివచ్చి ఇదంతా ఎక్కడ మొదలౌతున్నదో, ఎలా పని చేస్తున్నదో, దీనికి తాళంచెవి ఎక్కడున్నదో నాకు తెలిసిపోయింది. నేను ఇక తలుపులు తెరచి, స్వతంత్రంగా, స్వేచ్ఛగా విహరిస్తాను"అని. ప్రేమ, కరుణలతో నిండిన ప్రశాంత చిత్తంతో ఆయన 50 సంవత్సరాలపాటు గ్రామగ్రామాలా కాలినడకన తిరిగి, తన అనుభవాన్ని ఎదురైన ప్రతి ఒక్కరితోటీ పంచుకున్నాడు. లక్షలాదిమంది ఆయన శిష్యులై మేలుగాంచారు. 

 బుద్ధుడు బోధ మొదలుపెట్టిన తొలిదినాలలో, ఒకసారి ఆయన ఒంటరిగా ఒక అడవిదారిన పోతున్నాడు. అంతలో తన వెనుకనుండి ఎవరో తనపై దాడిచేస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగాడు. రెండు చేతులు ఆయన్ని బలంగా బంధిస్తున్నాయి. బుద్ధుడు వెంటనే ఆ వ్యక్తి నుండి విదిలించుకొని నిర్భయంగా నిలబడ్డాడు. చూస్తే..   ఒక బందిపోటు దొంగ...  కండలు తిరిగిన ఆ దొంగ నడుముకు ఒక చురకత్తి వేలాడుతున్నది. ముఖంలో క్రూరత్వం ....  మెలితిరిగిన మీసం ఉన్నది.  నిన్ను చూస్తే ధైర్యసాహసాలున్న యువకుడిలాగే ఉన్నావు. కానీ ఇలా పిరికివానిలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు... అని అడిగాడు బుద్ధుడు. 

 నువ్వు వినలేదా నా గురించి.. నేనే చంగాను... ఈ ప్రాంతంలో పసిపిల్లలుకూడా ...చంగా..  అన్న పేరు వినగానే నోరుమూసుకుంటారు. ఊ, నీదగ్గర ఉన్న సంపదనంతా తీసి ఇచ్చెయ్. లేదా... నీ తల.. నీ మెడపై ఉండదు. జాగ్రత్త,,,  త్వరగా ఇచ్చెయ్... అన్నాడు బందిపోటు..  కత్తిని తళతళలాడిస్తున్న    బుద్ధుని ప్రవర్తనలో భీతి లేదు. ఆయన శరీరం ప్రశాంతతను, తేజస్సును వెలువరిస్తున్నది. ఇది గమనించిన బందిపోటులో ఆశ్చర్యం మొదలైంది. ఇలాంటి వ్యక్తిని ఇంతకు ముందు ఎన్నడూ తాను చూసి ఉండలేదు. అయినా తన ఆలోచనల్ని ముఖంలోకి రానివ్వకుండా కరుకుగా అన్నాడు ఈ చంగాను మించిన వీరుడు ఈ ప్రాంతంలోనే లేడు. ...పిరికితనం గురించి నాతో మాట్లాడకు.... దమ్ముంటే నా ధైర్యానికి ఏదైనా పరీక్షపెట్టు చూద్దాం... అని అన్నాడు 

 తలలు నరికెయ్యటం అనేది ధైర్యవంతులు చేసే పనికాదు. అదిగో, ఆ రావి చెట్టు ఆకు ఒకటి కోసుకొనిరా.. అని  బుద్ధుడు నిర్భయంగా... ప్రశాంత కరుణతో  బందిపోటుతో అన్నాడు - . ...  అప్పుడు అతను  వెళ్లి కోసుకొచ్చాడు.  ఆ తరువాత  సరే ... ఇప్పుడు వెళ్లి, ఈ ఆకును దాని స్థానంలోనే తిరిగి చెట్టుకు అతికించు అన్నాడు బుద్ధుడు. అది వీలవదు అన్న చంగా అనే బందిపోటు కలవరపడుతూ ఇదంతా ఎటు పోతున్నదో అతనికి అర్థం కాలేదు.

అప్పుడు బుద్దుడు   దేన్నైనా, కలపటం కంటే.  విరగగొట్టడం సులభం అని చెప్పారు. అందుకనే పిరికివాళ్లు చంపుతారు...  బాధపెడతారు.. వైరుధ్యాలను ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో వారికి తెలీకుండానే వారు తమలో బాధను, దు:ఖాన్ని నింపుకుంటారు. శౌర్యవంతులు, దీనికి భిన్నంగా ఉంటారు. వారు సరిచేస్తారు, నయం చేస్తారు, సమస్యల్ని పరిష్కరిస్తారు, సుఖశాంతులందిస్తారు. ప్రతిఫలంగా వాళ్లకూ సుఖశాంతులు లభిస్తాయి. వాళ్లు గనక సత్యాన్ని నిజంగా గ్రహిస్తే, తమ మనస్సును, శరీరాన్ని నిజాయితీతో గమనిస్తే, జన్మ, మృత్యు, జరా, రోగ చక్రం నుండి విముక్తులవ్వగలరు.   ఒకసారి ఇదంతా చెప్పేశాక, బుద్ధుడు యధాప్రకారం నిర్మలంగా నడుచుకొని ముందుకు వెళ్లిపోయాడు.చంగాలో సంచలనం రేగింది. వదులైన నడుమునుండి ఆ కత్తి జారికింద పడింది. ఒక్క క్షణం సంకోచంగా ఆగిన పిమ్మట, అతను బుద్ధుని వెనక, అదే మార్గంలో నడక సాగించాడు. బుద్ధ జయంతి సందర్భంగా ఈ కథనం..