రైతుబంధు పేరుతో నానమ్మ భూమి కాజేసిన మనవడు

రైతుబంధు పేరుతో  నానమ్మ భూమి కాజేసిన మనవడు

రైతు బంధు పేరుతో నానమ్మ భూమినే కాజేశాడో మనువడు. మాయమాటలు చెప్పి వృద్ధురాలిని మోసం చేసి  ఎకరం భూమిని తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.  

 జగిత్యాల జిల్లా కొడిమ్మాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నీలగిరి అమ్మాయి అనే వృద్ధురాలుకి రెండు ఎకరాల పొలం ఉంది. అయితే గతంలో ఒక ఎకరం భూమిని వృద్ధురాలి కొడుకు పేరు పట్టా చేసింది. తన పేరుమీద ఓ ఎకరం భూమిని రిజిస్టేషన్ చేయించుకుంది. అయితే నానమ్మ భూమిపై కన్నేసిన మనుమడు రామేశ్వర్ భూమిని ఎలాగైనా కాజేయాలని పథకం వేశాడు. 

ఐదు నెలల క్రితం రైతుబంధు డబ్బులు ఇప్పిస్తానని నానమ్మకు మాయ మాటలు చెప్పాడు రామేశ్వర్. అది నమ్మిన నీలగిరి అమ్మాయి మనుమడితో ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లింది. అయితే ఆమె పేరు మీద ఉన్న ఎకరం భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మనవడు చెప్పిన చోటల్లా వృద్ధురాలు సంతకం పెట్టింది. దీంతో ఆమె పేరు మీద ఉన్న భూమి రామేశ్వర్ పేరు మీద రిజిస్ట్రర్ అయింది. 

అయితే నెలలు గడుస్తున్నా.. మనవడు ఇప్పిస్తానన్న రైతుబంధు డబ్బులు ఇంకా రావడం లేదనే విషయాన్ని గ్రహించిన వృద్ధురాలు.. ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లి విచారించింది. విషయం వెలుగులోకి వచ్చింది. తన భూమి మనవడే లాగేసుకున్నాడని ఆర్డీవో మాధురి దగ్గరకు వెళ్లి మోరపెట్టుకుంది. భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని గ్రహించిన ఆర్డీవో.. కొడిమ్యాల తహసీల్దార్ కు ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. నీలగిరి అమ్మాయి పేరు తరపున ఉన్న భూమి రిజిస్ట్రేషన్ ను హోల్డ్ లో పెట్టమని ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన నీలగిరి రామేశ్వర్ పై  పోలీసులు కేసు నమోదు చేశారు.