
కథలు, సినిమాల్లో మాత్రమే కనిపించే రక్తపిశాచి(వాంపైర్) పోలాండ్‌లో నిజంగానే కనిపించింది. ఆగండాగండి.. కంగారు పడాల్సిన పనేమీ లేదు. అదొక అస్థిపంజరం. నాలుగొందల ఏండ్ల కిందటిది. పోలాండ్లోని నికొలస్ కొపర్నికస్ యూనివర్సిటీ సైంటిస్ట్‌లు ఇటీవలే దీన్ని కనుక్కున్నారు. ఒక పురాతన సమాధి తవ్వుతుండగా ఈ అస్థిపంజరం బయటపడింది. దాన్ని పరిశీలించిన సైంటిస్ట్‌లు అదొక ఆడ మనిషి అస్థిపంజరమని గుర్తించారు. ఆ అస్థిపంజరం గొంతు పైభాగంలో ఒక పెద్ద ఇనుప కత్తి ఉంది. అలాగే ఒక కాలి పాదానికి బలమైన ఇనుప సంకెళ్లు ఉన్నాయి. ఒక దంతం చాలా పెద్దదిగా ఉంది.
దాన్ని బట్టి అదొక రక్తపిశాచి అనుకొని అప్పటివాళ్లు చంపి పాతిపెట్టి ఉంటారని సైంటిస్ట్‌లు చెప్తున్నారు. రక్తపిశాచి మళ్లీ బతికి రాకుండా ఉండడానికే దాని గొంతుపై కత్తి, కాలికి సంకెళ్లు కట్టారని అనుమానిస్తున్నారు. అలాగే వాంపైర్ను పూడ్చిన ఆ సమాధి కూడా ప్రత్యేకంగా ఉన్నట్లు గుర్తించారు. దీని గురించి పేపర్లు, టీవీల్లో వచ్చిన న్యూస్ వైరల్‌గా మారింది. టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లోనే ఇంకా దెయ్యాలు, భూతాలు ఉన్నాయని నమ్మేవాళ్లున్న రోజులివి. అలాంటిది నాలుగు వందల ఏండ్ల కిందటి జనం నమ్మడంలో ఆశ్చర్యం ఏముంది?