
యథేచ్ఛగా మైనింగ్ నిబంధనల ఉల్లంఘన
పర్యావరణ అనుమతులు నిల్
ఇసుక రైజింగ్ కాంట్రాక్టర్ల హల్చల్..
భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలో అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. మైనింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. పర్యావరణ అనుమతుల కూడా తీసుకోవడం లేదు. గోదావరికి ఇరువైపులా మొదలైన ఇసుక ర్యాంపుల్లో రోడ్ల నిర్మాణాలకు ఇసుక రైజింగ్కాంట్రాక్టర్లు హల్చల్ చేస్తున్నారు. వీరికి కొందరి ఆఫీసర్ల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఎక్కువగా చర్ల, మణుగూరు ప్రాంతాల్లో ఉంది. ప్రస్తుతం 30కు పైగా ఇసుక ర్యాంపులు గోదావరి తీర ప్రాంతంలో ప్రారంభమవుతున్నాయి. ఒడ్డు పైన, నదిలో కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ర్యాంపులో గరిష్ఠంగా 6, కనిష్ఠంగా 4 కిలోమీటర్ల మేర నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటికి అవసరమైన టన్నుల కొద్దీ గ్రావెల్నిబంధనలకు వ్యతిరేకంగా అడవులు, ప్రభుత్వ భూములు, పట్టా ల్యాండ్ల నుంచి తీసుకొస్తున్నారు.
రూల్స్ ఇలా...
గ్రావెల్, చిన్న తరహా ఖనిజాలు తవ్వుకోవడానికి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. మన్యం ప్రాంతంలో లీజులు చెల్లవు. అభివృద్ధి పనులకు తాత్కాలికంగా అనుమతులు తీసుకోవచ్చు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా జరుపుతున్న ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతుల పేరిట రైజింగ్కాంట్రాక్టర్లకు పర్మిషన్లు ఇస్తున్నారు. అటవీ, ప్రభుత్వ, పట్టా ల్యాండుల్లో తవ్వకాలు జరపాలంటే పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. ఐదు హెక్టార్లలో తవ్వకాలు జరపాలంటే ఈ నిబంధన ఉండేది. కానీ రేలా వంటి కొన్ని ఎన్జీవో సంస్థలు పర్యావరణ విధ్వంసంపై కోర్టులను ఆశ్రయించడంతో కనీసం ఎకరం భూమిలో తవ్వకాలు జరపాలన్నా కచ్చితంగా పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిందేనని కొత్త నిబంధనలు వచ్చాయి.
మైనింగ్ ఆర్డీడీ ద్వారా పర్మిషన్లు తీసుకుని అభివృద్ధి పనులకు గ్రావెల్ తవ్వకాలు జరుపుకోవచ్చు. కానీ ఎక్కడా ఈ పర్మిషన్లు ఉండటం లేదు. దీనివల్ల ప్రభుత్వానికి సీనరేజీ కూడా రావడం లేదు. పర్యావరణ విధ్వంసం, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వాల్టా చట్టం ప్రకారం నదిలో రోడ్డు నిర్మాణాలే జరగకూడదు. కానీ కొందరు స్థానిక ఆఫీసర్లు అభివృద్ధి పేరిట పర్మిషన్లు ఇస్తుండడం గమనార్హం.
ఆదాయానికి గండి..
ఒక్కో ఇసుక ర్యాంపులో కనీసం 5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తున్నారు. ఒక క్యూబిక్ మీటర్ గ్రావెల్‌కు 52 పైసల చొప్పున సీనరేజీ ఉంటుంది. ఒక యూనిట్ అంటే 3 క్యూబిక్ మీటర్లు. లారీలో ఆరు యూనిట్లు అంటే 18 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ పడుతుంది. వందల సంఖ్యలో గ్రావెల్‌ను జిల్లాలో ఇసుక ర్యాంపులకు వినియోగిస్తున్నారు. 30కి పైగా ఉన్న ఇసుక ర్యాంపుల్లో యావరేజీగా 150 కిలోమీటర్ల వరకు రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటికి వినియోగించే గ్రావెల్‌పై సుమారు రూ.12లక్షల మేర సీనరేజీ ఆదాయానికి గండి పడుతుంది.
ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ..
చర్ల మండలంలో గొల్లగూడెం చెరువు నుంచి గ్రావెల్ తోలుతున్నారు. ఇదే మండలంలో సత్యనారాయణపురం-దానవాయిపేట మధ్య ఉన్న శివలింగాపురంలో అటవీ భూమిని వదలడం లేదు. రాత్రింబవళ్లు జేసీబీలు పెట్టి తవ్వుకుపోతున్నారు. ఇటీవల అటవీ అధికారులు రెండు టిప్పర్లను పట్టుకుని కేసు నమోదు చేశారు. తేగడ పంచాయతీలోని రాజీవ్‌నగర్ వద్ద ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ తవ్వుతున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్లను ధ్వంసం చేసి తీసుకెళ్తుంటే ఆఫీసర్లు చోద్యం చూస్తున్నారు.
మణుగూరు ప్రాంతంలో సింగరేణి ఓబీ గుట్టల నుంచి తోలుతున్నారు. రామానుజారం ప్రాంతంలో గుట్టలను కొల్లగొడుతున్నారు. చినరావి గూడెం వద్ద పట్టా భూముల్లో తవ్వుతున్నారు. కనీసం సీనరేజీ వసూలు చేసినా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టి, రైజింగ్ కాంట్రాక్టర్లకు మేలు చేసేలా అధికారులు వ్యవహార శైలి ఉండటం విడ్డూరంగా ఉంది.