శాలివాహన గ్రీన్ ఎనర్జీ, బయోమాస్ పవర్​ ప్లాంట్​ మూసిన్రు.. కార్మికులను రోడ్డున పడేసిన్రు

శాలివాహన గ్రీన్ ఎనర్జీ, బయోమాస్ పవర్​ ప్లాంట్​ మూసిన్రు.. కార్మికులను రోడ్డున పడేసిన్రు
  • పెండింగ్​ వేతనాలు, బెనిఫిట్స్​ కోసం 14 నెలలుగా పోరాటం
  • మొండిగా వ్యవహరిస్తున్న శాలివాహన ప్లాంట్​ మేనేజ్​మెంట్ 
  • భూముల ధరలు పెరగడంతో రియల్​ ఎస్టేట్ ​వెంచర్​పై దృష్టి 
  • న్యాయం చేయాలని వేడుకుంటున్న కార్మికులు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని శాలివాహన గ్రీన్ ఎనర్జీ, బయోమాస్ పవర్ ప్లాంట్​ను మూసివేయడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడ్డారు. వారికి రావాల్సిన పెండింగ్ వేతనాలు, బెనిఫిట్స్​కోసం 14 నెలలుగా పోరాడుతున్నా మేనేజ్​మెంట్​మొండిగా వ్యవహరిస్తోంది. నాడు వేలల్లో ఉన్న భూముల ధరలు నేడు కోట్లకు పెరగడంతో ప్లాంట్​ను తొలగించి రియల్​ఎస్టేట్​వెంచర్​ చేసేందుకు సిద్ధమైనట్టు ఆరోపిస్తున్నారు.

ప్లాంట్​యజమాని మల్క కొమురయ్య ఓవైపు తమకు అన్యాయం చేస్తూ మరోవైపు ఓ జాతీయ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, సొంత సంస్థలో పనిచేస్తున్న వారినే పట్టించుకోని ఆయనను ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు ఏం సేవలు చేస్తాడని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే తమకు రావాల్సిన వేతనాలను చెల్లించడంతో పాటు బెనిఫిట్స్​ను అందించాలని డిమాండ్ ​చేస్తున్నారు.

పీపీఏ ముసిగిందనే సాకుతో మూసివేత..

మంచిర్యాలలోని రంగంపేటలో 6 మెగావాట్ల సామర్థ్యంతో 2002లో శాలివాహన గ్రీన్​ ఎనర్జీ, బయోమాస్​పవర్​ప్లాంట్​ను ప్రారంభించారు. ఒక మెగావాట్​కు రూ.4 కోట్ల చొప్పున మొత్తం రూ.24 కోట్ల పెట్టుబడితో ప్లాంట్​ను ఏర్పాటు చేశారు. రైస్​మిల్లుల నుంచి వెలువడే ఊక, సింగరేణి బొగ్గు, కర్రపొట్టు, ఆయిల్​పామ్​పొట్టుతో కరెంట్​ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి సప్లై చేశారు.

ముడి ఇంధనాల రేట్లు పెరగడంతో పాటు కొరత ఏర్పడడం, ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాకపోవడం, 2022 డిసెంబర్​6తో పవర్​ పర్చేజ్ ​అగ్రిమెంట్(పీపీఏ) ముగిసిందనే సాకుతో మేనేజ్​మెంట్​పవర్​ ప్లాంట్​ను శాశ్వతంగా మూసేసింది.  అయితే, పీపీఏ పొడిగించుకుంటే మరో పదేండ్ల పాటు ప్లాంట్​నడపడానికి ఎలాంటి ఇబ్బందులూ లేవని కార్మికులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే ప్లాంట్​ను మూసేసి తమను రోడ్డుపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రియల్​ ఎస్టేట్​ వెంచర్​పై దృష్టి

పవర్ ప్లాంట్​కు దాదాపు 40 ఎకరాల భూములు ఉండగా, యాజమాన్యం ఇప్పటికే 10 ఎకరాలను అమ్ముకున్నట్టు సమాచారం. మిగిలిన 30 ఎకరాల్లో 11 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్​ఉంది. ఈ భూములు మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉండడంతో మంచి డిమాండ్​ఏర్పడింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్​ వెంచర్లలో ప్లాట్లు హాట్​ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

Also Read: కేసీఆర్​..! నల్గొండకు వచ్చే ముందు .. ముక్కు నేలకు రాసి రా : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

రోజురోజుకు కొత్త కాలనీలు విస్తరిస్తున్నాయి. దీంతో ఇక్కడ ఎకరం రూ.5 కోట్లకుపైగా పలుకుతోంది. ఒడిదుడుకుల మధ్య ప్లాంట్​ను నడపడం కంటే భూముల అమ్మకం ద్వారా ఏకకాలంలో భారీగా లబ్ధిపొందవచ్చనే ఆలోచనలో మేనేజ్​మెంట్​ ఉన్నట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. కాగా, గతంలో ప్లాంట్​ కోసం ఎకరం భూమిని రూ.30 వేల నుంచి రూ.40 వేలకే ఇచ్చిన రైతులు.. ఈ పరిస్థితుల నేపథ్యంలో తమ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ ​చేస్తున్నారు.  

ఆందోళన ఉధృతం చేస్తాం  

శాలివాహన పవర్ ప్లాంట్​ను మూసేసి 14 నెలలు కావస్తోంది. కార్మిక చట్టాల ప్రకారం చెల్లించాల్సిన క్లోజింగ్ బెనిఫిట్స్, పెండింగ్​ వేతనాలు చెల్లించడం లేదు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఏర్పాటు చేసిన జాయింట్ మీటింగ్​లో బెనిఫిట్స్ చెల్లించాలని ఆదేశించినా పట్టించుకోవడం లేదు. ప్లాంట్ నిర్మాణం కోసం ఆనాడు రైతుల దగ్గర రూ.30 నుంచి రూ.40 వేలకు ఎకరం చొప్పున తీసుకున్నరు.

ఇప్పుడు ఎకరానికి రూ.5 కోట్ల దాకా పలుకుతోంది కాబట్టి ప్లాంట్​ను మూసేసి రియల్​ఎస్టేట్ వెంచర్​ చేయాలనుకుంటున్నరు. కార్మికులకు నష్టం చేస్తున్న మల్క కొమురయ్య ఓ జాతీయ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ప్రజలను ఏం ఉద్దరిస్తారో చెప్పాలె. ఇప్పటికైనా స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం.      

   - కుంటాల శంకర్, పవర్​ప్లాంట్​కార్మిక సంఘం అధ్యక్షుడు

కార్మికుల బతుకులు ఆగం

శాలివాహన గ్రీన్​ ఎనర్జీ, బయోమాస్​ప్లాంట్​పై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 300 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. రెగ్యులర్​ ఉద్యోగులు, వర్కర్లు సుమారు 100 మంది ఉండగా, వీరికి రూ.20 వేల నుంచి రూ.30 వేల జీతాలు చెల్లించారు. ట్రాక్టర్లు, లారీలు, ఇతర పనుల్లో మరో 200 మంది వర్కర్లు పని చేసేవారు. వీరంతా 20 ఏండ్లుగా చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు.

రెగ్యులర్​గా శాలరీస్​ ఇవ్వకున్నా ప్లాంట్​నే నమ్ముకుని జీవిస్తున్నారు. 2022 డిసెంబర్​ నుంచి పవర్​ ప్లాంట్​ను క్లోజ్​చేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. చాలా మంది రిటైర్మెంట్​కు దగ్గర్లో ఉండడంతో ఈ వయసులో ఎట్ల బతకాలని వాపోతున్నారు. ప్లాంట్​క్లోజింగ్ తోపాటు ఉద్యోగులు, వర్కర్లకు లేబర్​యాక్టుల ప్రకారం సెటిల్​మెంట్ జరగాల్సి​ఉన్నప్పటికీ యాజమాన్యం ఇవేమీ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.