వాటర్ లెవెల్స్ పెరగలే!.. గ్రేటర్ మూడు జిల్లాల్లో పైకిరాని భూగర్భ జలాలు

వాటర్ లెవెల్స్ పెరగలే!.. గ్రేటర్ మూడు జిల్లాల్లో పైకిరాని భూగర్భ జలాలు
  • గతేడాదితో పోలిస్తే 42 ప్రాంతాల్లో కిందకు గ్రౌండ్ వాటర్ 
  • సమయానికి వానలు పడకపోవడమేనంటున్న అధికారులు
  • శేరిలింగంపల్లిలో 7.12, కూకట్ పల్లిలో 5.94 మీటర్లు లోపలికి

హైదరాబాద్, వెలుగు :  ఈసారి వానాకాలం సీజన్​లో జూన్, జులై చివరి దాకా వానలు పడకపోవడంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భూగర్భ నీటిమట్టాలు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే 3 జిల్లాల్లోని 52 ప్రాంతాలను పరిశీలిస్తే..42 చోట్ల తగ్గిపోయాయి. కేవలం10 చోట్ల మాత్రమే పెరిగాయి. గత నెల చివరలో వర్షాలు పడినా కూడా గతేడాది స్థాయిని మించలేదు. కోర్ సిటీతో పాటు అర్బన్ ప్రాంతాల్లో బోర్లలోని నీటి వాడకం ఎక్కువగా ఉండడంతో  గ్రౌండ్ వాటర్ తగ్గినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.  జులై ఆఖరులో వర్షాలు పడినా కానీ.. అప్పటికే గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోయింది. గతేడాదితో పోలిస్తే చాలా తగ్గింది. 

మేడ్చల్ జిల్లాలో సగటున స్వల్పంగా 1.75 మీటర్లు, రంగారెడ్డి జిల్లాలో సగటున1.14 మీటర్లు, హైదరాబాద్ లో సగటున 0.48 మీటర్ల మేర నీటిమట్టాలు తగ్గాయి. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాలకుగానూ 24, మేడ్చల్ జిల్లాలో 15 మండలాలకు గానూ12 ప్రాంతాల్లో చూస్తే  గ్రౌండ్ వాటర్ ఒక్కో మీటర్, 2 మీటర్లు అంతకు ఎక్కువగా  లోపలికి వెళ్లాయి. అయితే, అత్యధికంగా రంగారెడ్డిలోని తలకొండపల్లిలో 14 మీటర్లు వాటర్ లెవెల్స్ పెరిగాయి. సిటీ శివారు జిల్లాల్లో రైతులు పంటలు వేసినా  వానలు లేకపోగా గ్రౌండ్ వాటర్ వాడకం ఎక్కువగా చేసినట్టు అధికారులు చెప్పారు. వ్యవసాయం చేసే ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ గతేడాదితో పోలిస్తే ఈసారి తగ్గింది. 

రెండు ప్రాంతాల్లో అధికం

3 జిల్లాల్లో గతేడాదితో పోల్చి చూస్తే భూగర్భజలాలు పడిపోయినా.. కొన్ని ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల గతేడాది కంటే చాలా తక్కువగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలో అధికంగా 7.12 మీటర్లు తగ్గాయి. గతేడాది జులైలో ఇక్కడ 4 మీటర్ల ఎత్తులో నీరు ఉండగా, ప్రస్తుతం 11.12 మీటర్ల లోతుకి వెళ్లాయి. కూకట్ పల్లిలో 5.94 మీటర్లు తగ్గిపోయాయి.  ఇక్కడ గతేడాది జులైలో 9.22 మీటర్ల ఎత్తులో ఉండగా, గత నెలలో 16.15 మీటర్లలోతుకు తగ్గిపోయాయి. శంకర్ పల్లి లో 6.29, హయత్ నగర్ లో 5.64, సరూర్ నగర్ 3.42 ఇలా చాలా ప్రాంతాల్లో వాటర్ లెవెల్స్ తగ్గాయి. హిమాయత్ సాగర్ పక్కనే ఉన్నా రాజేంద్రనగర్ పరిధిలో కూడా 3.32 మీటర్ల కిందకు పడిపోయాయి. ప్రాజెక్ట్ కింద ఉన్న హిమాయత్ సాగర్ లో బోర్లు వేస్తే 500 ఫీట్లపైగా వేస్తే గానీ నీరు పడటంలేదు. బండ్లగూడలో 2.37 మీటర్లు పడిపోయాయి. ఇక్కడి ప్రాంతాల్లో భూగర్భంలో బండరాళ్లు ఎక్కువగా ఉండడంతో నే సమస్య ఉంది. గత సమ్మర్ తో పాటు జూన్   ఆఖరులో వర్షాలు భారీగా కురిసినప్పటికీ భూగర్భ జలాలు ఆ మేరకు పెరగలేదు.

 వృథా చేయొద్దు  

భూగర్భ జలాలను కాపాడుకుంటే భవిష్యత్​లో ఇబ్బందులు తలెత్తవు. వానలు పడ్డప్పుడు నీరు వృథాగా పోకుండా భూమిలోకి పంపిస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గతేడాది జులైతో పోలిస్తే ఈసారి ఇదే నెలలో నీటిమట్టాలు తగ్గాయి. వానలు ఆలస్యంగా కురవడంతో అప్పటికే పంటలు వేసిన రైతులు బోర్ల నుంచి నీటి వాడకం ఎక్కువగా చేశారు. అధికంగా వరి పంట కోసమే వాడారు.
 
పి రఘుపతి రెడ్డి, డిప్యూటి డైరెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్, రంగారెడ్డి జిల్లా