
- కొన్ని జిల్లాల్లో చేతిపంపులకు కూడా అందని నీరు
- 3 నెలల్లో 3 మీటర్లకు పడిపోయిన జలాలు
- నిరుడితో పోలిస్తే ఈసారి అధిక వర్షపాతం నమోదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఏటేటా నీటి మట్టాలు తగ్గుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరిలో 7.46 మీటర్ల లోతున ఉండగా.. మార్చి నాటికి 9.91 మీటర్ల కిందకు పోయాయి. మూడు నెలల్లో దాదాపు 3 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఇప్పటికే చాలా జిల్లాల్లో బోరింగ్పంపులకు కూడా నీరు అందడం లేదు. సాధారణంగా భూగర్భ జలాలు 50 నుంచి 80 ఫీట్ల లోతులో ఉంటేనే బోరింగ్ ల్లో నీళ్లు వస్తాయి.
పలు జిల్లాల్లో తాగునీటి సింగిల్ ఫేజ్ మోటార్లు, త్రీ ఫేజ్ మోటార్లలో పూర్తిస్థాయిలో రావడంలేదు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. మే నాటికి పరిస్థితి మరింత తీవ్రం కానుందని తెలంగాణ భూగర్భ జల శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో 2014- –15 నుంచి 2023 –-24 వరకు గ్రౌండ్ వాటర్ 30 శాతం మేరకు మెరుగైంది. దీంతో 3.29 మీటర్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది.
0.22 మీటర్లు పడిపోయిన నీటిమట్టం
గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి 0.22 మీటర్ల నీటిమట్టం తగ్గింది. 5-.10 మీటర్లలోపు 18 జిల్లాలు, 10.15 మీటర్లలోపు12 జిల్లాలు, మరో 3 జిల్లాల్లో 15 మీటర్ల కంటే ఎక్కువగా నీటిమట్టం ఉంది. అదేవిధంగా 14 జిల్లాల్లో నీటి మట్టాలు 0.05 మీటర్ల నుంచి 3.18 మీటర్ల వరకు పెరిగాయి. మరో 19 జిల్లాల్లో 0.01 మీటర్ల నుంచి 6.24 మీటర్ల కిందకు నీటి మట్టాలు పడిపోయాయి. 15 నుంచి 20 మీటర్ల కంటే ఎక్కువగా భూగర్భ జలాలు పడిపోయిన ప్రాంతాలు రాష్ట్రవ్యాప్తంగా 10 శాతం వరకు ఉండగా.. ఇందులో రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో వికారాబాద్, యాదాద్రి, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాల్లో కూడా గ్రౌంట్‌వాటర్ దారుణంగా పడిపోయినట్టు భూగర్భ జల శాఖ అధికారులు తెలిపారు.
జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 5.24 మీటర్లు
రాష్ట్రంలోని 33 జిల్లాలోని అన్ని మండలాల్లో భూగర్భ జల విభాగం మార్చిలో 1,771 పైజో మీటర్ల ద్వారా నీటి మట్టాలను సేకరించింది. 2024-– 25 లో మార్చి 31 వరకు సగటు వర్షపాతం 876 మిల్లీ మీటర్లు. అయితే, 1,056 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోల్చితే ఇది 21శాతం అధికం. జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి జిల్లాలో కనిష్ఠంగా 785 మి.మీ, ములుగు జిల్లాలో గరిష్టంగా 1,656 మి.మీ. వర్షపాతం నమోదైంది. 13 జిల్లాల్లో అధిక వర్షపాతం (20 శాతం –-69 శాతం), 20 జిల్లాల్లో సాధారణ వర్షపాతం (0 శాతం- –19 శాతం) రికార్డ్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో సగటు భూగర్భ జల మట్టం 9.91 మీటర్లుగా ఉంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 5.24 మీటర్లు, అత్యధికంగా మెదక్ జిల్లాలో 15.72 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నాయి.