ఐవీఎఫ్ సెంటర్లకు పెరుగుతున్న టెకీలు

ఐవీఎఫ్ సెంటర్లకు పెరుగుతున్న టెకీలు
  • గైనకాలజిస్టులను సంప్రదిస్తున్న వారిలో వీరే అధికం

హైదరాబాద్, వెలుగు: సంతాన లేమి సమస్యలతో ఐవీఎఫ్(ఇన్ ​విట్రో ఫెర్టిలైజేషన్) సెంటర్లను సంప్రదిస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీరిలో అత్యధికంగా సాఫ్ట్​వేర్​ఉద్యోగులే ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. మోడ్రన్ లైఫ్ లో వచ్చిన మార్పులే సంతానలేమి సమస్యకు ప్రధాన కారణమని అంటున్నారు. గతంలో ఎక్కువగా ఆడవాళ్లు మాత్రమే తమను కన్సల్ట్​అయ్యేవారని, కొంత కాలంగా మగవారు కూడా వస్తున్నారని చెబుతున్నారు. ఎవరిలో సమస్య ఉందో తెలుసుకునేందుకు భార్యాభర్తలు ఇద్దరూ సంప్రదిస్తున్నారంటున్నారు. దాదాపుగా సిటీలోని అన్ని ఫెర్టిలిటీ సెంటర్లలో ఇద్దరికీ ట్రీట్​మెంట్ అందుబాటులో ఉంది. మగవారి కోసం స్పెషల్​సెంటర్లు కూడా ఉన్నాయి. వీకెండ్​లో హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్‌, ఖైరతాబాద్​తదితర ప్రాంతాల్లోని ఫెర్టిలిటీ సెంటర్లలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓపీల్లో సగానికి పైగా వారే ఉంటున్నారు. గతంలో సంతాన లేమి సమస్యతో డాక్టర్లను కలిసే వారిలో 70 శాతం ఆడవారు, 30 శాతం మగవారు ఉంటే ప్రస్తుతం సమానంగా వస్తున్నారని చెబుతున్నారు. మగవారిలో 10 నుంచి 30 శాతం సమస్య ఉంటే, ఆడవాళ్లలో 50 నుంచి 70 శాతం ఉంటుందని డాక్టర్లు 
వివరిస్తున్నారు. 

లిక్కర్​ తీస్కోవడం.. స్మోక్ చేయడం

రెండేళ్లుగా ఐటీ ఉద్యోగులకు వర్కింగ్​అవర్స్​పెరిగాయి. కనీసం10 నుంచి12 గంటలు ల్యాప్‌టాప్‌లు, సిస్టమ్స్​ముందే కూర్చుంటారు. దీంతో రేడియేషన్, స్ట్రెస్ లెవల్స్ పెరుగుతున్నాయి. పైగా లేట్ మ్యారేజ్‌లతో సంతాన సమస్యలు వస్తున్నాయని ఫెర్టిలిటీ సెంటర్ల డాక్టర్లు చెబుతున్నారు. ఒక్కో సెంటర్‌‌ కు శనివారం ఓపీలో 30 నుంచి 40 కేసులొస్తే అందులో 25 మందికి పైగా ఐటీ ఎంప్లాయిస్ ఉంటున్నారు. లైఫ్ స్టైల్ మార్పులు, ఒత్తిడి, మానసిక ఆందోళన, ఆల్కహాల్ తీసుకోవడం, స్మోక్ చేయడం, కొవిడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తో మగవారిలో ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయని గైనకాలజిస్ట్ కావ్య తెలిపారు. ఈ తరహా సమస్యలతో గతంలో10 శాతం మంది మగవాళ్లు వస్తే ప్రస్తుతం 30 శాతానికి పెరిగారని అంటున్నారు. ఇక ఆడవారిలో యాంగ్జైటీ, పీసీఓడీ, లేట్ మ్యారేజ్‌, ఏజ్ కారణంగా ఎగ్స్ కౌంట్ తగ్గిపోతుందని చెబుతున్నారు. జంక్ ఫుడ్, ఫ్రొజెన్ ఫుడ్ కి అలవాటు పడటం, నిద్రలేమి కూడా ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా మగవారిలో ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్, లో స్ప్రెమ్ కౌంట్, స్ప్రెమ్ కౌంట్ లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

45 నుంచి 50 శాతం సక్సెస్ ​రేట్

ఐవీఎఫ్ ప్రాసెస్​తో 45 నుంచి 50 శాతం వరకు సక్సెస్ రేట్ ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. సహజంగా సంతానం కలగకపోతే ముందుగా డాక్టర్లు ఇంట్రా యుటెరైన్‌ ఇన్‌సెమినేషన్‌(ఐయూఐ)ని సూచిస్తారు. అందులోనూ విఫలమైతే లాస్ట్ కి  ఐవీఎఫ్ సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ దశల వారీగా జరుగుతుంది. వంద శాతం దంపతుల్లో 30 శాతం మంది ఐవీఎఫ్ ని కోరుకుంటున్నారని అంటున్నారు. ఇందులో మహిళలకు ట్రీట్మెంట్ ఎక్కువగా ఉంటుందని, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయి డెలివరీ అయ్యే వరకు ఏడాది సమయం పడుతుందని చెప్తున్నారు. 

30 ఓపీల్లో 20 వారివే

ఇటీవల కాలంలో ఫెర్టిలిటీ సమస్యలు అధికమయ్యాయి. గతంలో ఆడవాళ్లలో మాత్రమే సమస్య ఉందని భావించేవారు. అవగాహన పెరగడంతో మగవారు కూడా చెక్ చేయించుకుంటున్నారు. డైలీ ఓపీల్లో సగం కేసులు సంతాన లేమికి సంబంధించినవే ఉంటున్నాయి. శనివారం ఐటీ ఉద్యోగులు ఎక్కువగా వస్తున్నారు. 30 ఓపీల్లో 20కి పైగా వాళ్లే ఉంటున్నారు. లేడీస్‌లో పీసీఓడీ సమస్యలు, ఎగ్ కౌంట్ పడిపోవడం జరుగుతోంది. 

– డా.కావ్య, గైనకాలజిస్ట్, 
    యశోద హాస్పిటల్స్

మొదట 2 నెలలు మెడిసిన్స్

ఐటీ ఉద్యోగులు10 నుంచి 12 గంటలు పనిచేయడం, 30 ఏండ్ల తర్వాత పెండ్లిళ్లు చేసుకోవడంతో సంతాన లేమి సమస్యలు పెరుగుతున్నాయి. మా దగ్గరికి వస్తున్నవారికి మొదట రెండు నెలలు యాంటీ ఆక్సిడెంట్ మెడిసిన్స్ ఇచ్చి చూస్తున్నాం. ఇంప్రూమెంట్ వస్తే న్యాచురల్​గా ప్రెగ్నెన్సీ వచ్చే చాన్స్ ఉంటుంది. గతంలో డైలీ పది మంది మాత్రమే మమ్మల్ని సంప్రదించేవారు. ఇప్పుడు 30 మంది దాకా వస్తున్నారు. 

– డా.సాయి మానస, గైనకాలజిస్ట్, ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్