జీఎస్​టీ వసూళ్లు అదరగొట్టాయి

జీఎస్​టీ వసూళ్లు అదరగొట్టాయి

న్యూఢిల్లీ వరసగా ఏడో నెలలోనూ జీఎస్​టీ వసూళ్లు అదరగొట్టాయి. సెప్టెంబరు నెలలోనూ జీఎస్​టీ వసూళ్లు రూ. 1.40 లక్షల కోట్ల మార్కుకు పైనే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్​ నెలలో జీఎస్​టీ వసూళ్లు అంతకు ముందు ఏడాది ఇదే నెలతో పోలిస్తే 26 శాతం పెరిగి రూ. 1.47 లక్షల కోట్లకు చేరినట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ డేటా వెల్లడించింది. పండగల సీజన్​ కావడంతో రాబోయే నెలల్లో ఈ వసూళ్లు మరింతగా పెరుగుతాయని ఎక్స్​పర్టులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్​ 2022 నెల వసూళ్లు రూ. 1,47,686 కోట్లయితే, ఇందులో సెంట్రల్​ జీఎస్​టీ రూ. 25,271 కోట్లు, స్టేట్​ జీఎస్​టీ రూ. 31,813 కోట్లు, ఇంటిగ్రేటెడ్​ జీఎస్​టీ రూ. 80,464 కోట్లు, సెస్​ రూ. 10,137 కోట్లని ఫైనాన్స్​ మినిస్ట్రీ తెలిపింది. దిగుమతులపై వచ్చిన జీఎస్​టీ రూ. 41,215 కోట్లని పేర్కొంది.

ఏప్రిల్​ 2022లో జీఎస్​టీ వసూళ్లు రికార్డు లెవెల్​లో  రూ. 1.67 లక్షల కోట్లకు చేరిన విషయం తెలిసిందే. ఇక ఆగస్టు 2022లో ఈ వసూళ్లు రూ. 1.43 లక్షల కోట్లు. సెప్టెంబర్​ నెల జీఎస్​టీ వసూళ్లు అంతకు ముందు ఏడాది సెప్టెంబర్​తో పోలిస్తే 26 శాతం అధికమయ్యాయి. దిగుమతులపై జీఎస్​టీ వసూళ్లు ఈ ఏడాది సెప్టెంబర్​ నెలలో 39 శాతం పెరగ్గా, దేశీయ ట్రాన్సాక్షన్లపై జీఎస్​టీ   వసూళ్లు 22 శాతం పెరిగినట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ విడుదల చేసిన డేటా చెబుతోంది. సెప్టెంబర్​ నెలదాకా ఆరు నెలలకు కలిపి చూస్తే జీఎస్​టీ వసూళ్లు 27 శాతం పెరిగాయి. ఎకానమి జోరు కొనసాగడం వల్లే జీఎస్​టీ వసూళ్లు పెరుగుతున్నాయనేది దీంతో స్పష్టమవుతుందని ఎక్స్​పర్టులు పేర్కొంటున్నారు. ఆగస్టు 2022లో 7.7 కోట్ల వే బిల్లులు జనరేట్​ అయ్యాయి. అంతకు ముందు నెల అంటే జులై 2022లో 7.5 కోట్ల వే బిల్లులు జనరేట్​ అయ్యాయని డేటా పేర్కొంటోంది.

సెప్టెంబర్​ 20 నాడు (ఒకే రోజు) జీఎస్​టీ కలెక్షన్లు రూ. 49,453 కోట్లు. అదే రోజున ఏకంగా 8.77 లక్షల చలాన్లు ఫైలయ్యాయని, ఇది జులై నెలలోని ఒకే రోజు వసూళ్ల కంటే కొద్దిగానే తక్కువని ఫైనాన్స్​ మినిస్ట్రీ తెలిపింది. ఈ ఏడాది జులై నెలలో ఒకే రోజున 9.58 లక్షల చలాన్లు ఫైలవగా, ఆ రోజు జీఎస్​టీ కలెక్షన్లు ఏకంగా రూ. 57,846 కోట్లు. జీఎస్​టీఎన్​ మెయింటెయిన్​ చేస్తున్న జీఎస్​టీ పోర్టల్​ పనితీరు కూడా బాగా మెరుగుపడిందనడానికి ఈ అంకెలు నిదర్శనంగా నిలుస్తాయని ఫైనాన్స్​ మినిస్ట్రీ పేర్కొంది.