గెస్ట్ ​లెక్చరర్స్​ గోడు పట్టదా?.. 6 నెలలుగా వేతనాలు లేవు

గెస్ట్ ​లెక్చరర్స్​ గోడు పట్టదా?..  6 నెలలుగా వేతనాలు లేవు

తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్టు వ్యవస్థ, ఔట్ సోర్సింగ్ విధానం ఉండదని, అదొక దిక్కుమాలిన వ్యవస్థ అని ఘంటాపథంగా చెప్పినవారే ఆ వ్యవస్థ ను అవసరాలకు వాడుకుంటూ అధికారంలో కొనసాగుతున్నారు. జీవితానికి భద్రత లేని తాత్కాలిక వ్యవస్థలు అంతమై శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు దొరుకుతాయేమో, నిజమే కావొచ్చేమోనని నిరుద్యోగ యువత ఆశించింది. రాష్ట్రంలో ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తారని, నూతన ఉద్యోగాల భర్తీ ఒరవడి కొనసాగుతుందని తెలంగాణ యువత ఎదురుచూసింది. కానీ భంగపాటు తప్పలేదు. ఉద్యమ ట్యాగ్ లైన్ అయిన ఉద్యోగాల భర్తీ ఆకాంక్ష నెరవేరలేదు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం దశలవారీగా అనేక  కొత్త జిల్లాలు, నూతన రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, నూతన మండలాలతో పాలన కొనసాగుతున్నది. కొన్ని నూతన ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఏర్పాటు కూడా జరిగింది. కానీ ఇదే స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగాల్సి ఉండే. ప్రభుత్వ బడులు, కాలేజీల సంఖ్య పెరగాల్సి ఉండే. పెంచకపోగా ఉన్న కాలేజీలో కూడా అధ్యాపకుల భర్తీ లేదు. ఆ లోటును పూడ్చడానికి తెలంగాణలో పాఠశాల స్థాయి నుంచి మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు తాత్కాలిక/అతిథి అధ్యాపకులతో నడుపుతున్నారు. నాణ్యమైన విద్య అందడం లేదు. మొన్నటి వరకు కాంట్రాక్టు అధ్యాపకుల వ్యవస్థ కొనసాగింది. కొంత మేరకు రెగ్యులర్ ఐనా మరికొంతమంది కాంట్రాక్టు ప్రాతిపదికనే కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ విద్యలో అన్ని స్థాయిలలో ఉన్నత విద్య వరకు గెస్ట్(అతిథి)/తాత్కాలిక అధ్యాపకులతో కాలం వెళ్లదీస్తున్నారు. 2008లో ఉమ్మడి ఏపీలోనే రిటైర్​ అయిన అధ్యాపకులను గెస్ట్ ప్రాతిపదికన ప్రభుత్వం తీసుకుంది. అది కూడా ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో అరకొరగా మాత్రమే ఉండేది. కొంతకాలం(2013) తర్వాత రిటైర్​అయిన వారి స్థానంలో కొత్త అభ్యర్థులను, నైపుణ్యం కలిగినవారిని అవసరం ఉన్న చోట పేపర్ నోటిఫికేషన్ వేసి తాత్కాలిక ప్రాతిపదికన అతిథి అధ్యాపకులను తీసుకొని విద్యా వ్యవస్థను నడిపించారు.

6 నెలలుగా వేతనాలు లేవు

ఏర్పడుతున్న ఖాళీలకు అనుగుణంగా ప్రభుత్వం అధ్యాపక పోస్టులను భర్తీ చేయడం లేదు. రోజురోజుకూ ప్రభుత్వ విద్యాలయాలలో ఖాళీల సంఖ్య పెరుగుతూ పోతుంది. కొంతకాలం ప్రాఠశాల విద్యలో విద్యా వాలంటీర్లను నియమించి  నెట్టుకొచ్చారు. కరోనా సమయంలో వారిని తీసివేశారు. ఇప్పుడు ఉన్న అధ్యాపకులను సర్దుబాటు చేసి సంబంధిత సబ్జెక్టుతో సంబంధం లేని వారితో సబ్జెక్టు చెప్పిస్తున్నారు. ఇంటర్మీడియట్ విషయానికొస్తే రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత 9 ఏండ్లుగా1658 మంది గెస్ట్​ లెక్చరర్లు విద్యను బోధిస్తున్నారు.132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సుమారు1400 మంది గెస్ట్ ఫ్యాకల్టీ విద్యను బోధిస్తున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో సుమారు1200కి పైబడి గెస్ట్​ లెక్చరర్లు పని చేస్తున్నారు. రెగ్యులర్ అధ్యాపకులతో పాటు సమాన పనిగంటలు పనిచేస్తున్న గెస్ట్​ లెక్చరర్ల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కానీ పని గంటల ఆధారంగా 390 రూపాయల చొప్పున ఎక్కువ గంటలు విద్య బోధించినా నెలకు 72 గంటలకే వేతనాలను నిర్ణయిస్తారు. తక్కువ గంటలు పనిచేస్తే తగ్గించి జీతాలు ఇస్తారు. దసరా, సంక్రాంతి మరే ఏ ఇతర సందర్భాల్లో సెలవులు వచ్చినా వారి కుటుంబాలు ఆ నెల పస్తులు ఉండాల్సిందే. సగటున రూ. 20 వేల నుంచి 25 వేల వేతనాలను రీలీజ్ చేస్తారు.12 నెలలు జీతాలు ఇవ్వరు.2022–23 అకడమిక్ కు సంబంధించి 
6 నెలల వేతనాలను ఇంతవరకు ఇవ్వలేదు. 

గెస్ట్​ లెక్చరర్లు ఏం పాపం చేశారు.? రెన్యువల్ అయ్యేదెన్నడు..?

కొన్ని సందర్భాల్లో బదిలీపై రెగ్యులర్ లెక్చరర్లు ఎవరొచ్చినా అక్కడ బలి అయ్యేది గెస్ట్​లెక్చరరే. అర్ధంతరంగా వెళ్లిపోవాల్సిందే. అంతకాలం సర్వీస్ చేయించుకొని కనీసం సర్దుబాటు కూడా చేయరు. 2022-23 అకడమిక్ ఇయర్ ముగిసినా 6 నెలల జీతం రాలేదు. 2023 -24 అకడమిక్ ఇయర్ ప్రారంభమై నెల రోజులవుతున్నా‘ఆటో రెన్యూవల్’ ఇంకా కాలేదు. జీతాలు రాక, రెన్యువల్ గాక ‘గెస్టు లెక్చరర్ ల జీవితాలు’ దుర్భరమౌతున్నాయి. ఈ అధ్యాపకులను ప్రభుత్వం రోజువారీ కూలీలుగా మాత్రమే చూస్తున్నది. కనీసం విద్యను బోధిస్తున్న లెక్చరర్లుగా కూడా గుర్తించడం లేదు. గతిలేని వారిగా మాత్రమే ట్రీట్ చేస్తున్న దుస్థితి. ప్రైవేట్ కార్పొరేట్​ కాలేజీలకు ధీటుగా అనేక ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ డ్రైవ్ గెస్ట్ లెక్చరర్స్ గ్రామీణ ప్రాంతాల్లో కి వెళ్లి చేసేవారు. ఇప్పుడు గెస్ట్ లెక్చరర్స్ లేక అడ్మిషన్లు తగ్గిన పరిస్థితి. గతంలో ఈ పాటికి లక్ష దాటితే ఇప్పుడు అందులో సగం అడ్మిషన్లు కాలేదనే వాదన తలెత్తుతుంది. ఇంటర్ బోర్డు అధికారులు పేద విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఆ నష్టం జరగకుండా ఉండాలంటే శాశ్వత ప్రాతిపదికనైనా ఉద్యోగాలను భర్తీ చేయాలి లేదా రాష్ట్ర వ్యాప్తంగా గెస్టు లెక్చరర్స్ పెండింగ్ వేతనాలు విడుదల చేసి, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

విద్యా ప్రమాణాలపై ప్రభావం

రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలను పరిశీలిస్తే 2023 వరకు పనిచేసిన1658 మంది గెస్ట్ లెక్చరర్లలో సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గ లోని ‘గజ్వేల్ మహిళా జూనియర్ కాలేజీ’లో పని చేస్తున్న 15 మంది లెక్చరర్లలో11 మంది గెస్ట్​ లెక్చరర్లే. ఆదివాసీ గిరిజన ప్రాంత జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో మారుమూల అచ్చంపేట, కోడేరు, కొల్లాపూర్, కొండనాగుల, అమ్రాబాద్ జూనియర్ కాలేజీలు గెస్టు లెక్చరర్స్ తోనే నడుస్తున్నాయి. రాష్ట్రంలో సగటున ప్రతి ప్రభుత్వ కళాశాలలో అయిదుగురికి మించి గెస్ట్​లెక్చరర్లు పనిచేస్తున్నారు. కొన్ని కాలేజీల్లో  కేవలం గెస్ట్​లెక్చరర్లతో మాత్రమే విద్యాబోధన జరుగుతున్నది. అయితే ఇంటర్ విద్యాశాఖ గెస్ట్ ప్యాకల్టీని రెన్యువల్ చేయకుండా భౌతిక తరగతులను ఏలా నిర్వహిస్తున్నదనేదే ప్రశ్నార్థకం? ఇలా అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఎలా పెరుగుతాయని తెలంగాణ పౌర సమాజం ప్రశ్నలు లేవనెత్తుతుంది.

- పందుల సైదులు.. తెలంగాణ విద్యావంతుల వేదిక