యావరేజ్ స్టూడెంట్ టు సినిమా హీరో

యావరేజ్ స్టూడెంట్ టు సినిమా హీరో

డార్క్ క్యారెక్టర్స్ చేయడం అంత ఈజీ కాదు. సెట్ నుంచి బయటకొచ్చాక ఆ క్యారెక్టర్ల ప్రభావం నుంచి బయటపడటం అంతకంటే ఈజీ కాదు. కానీ, యాక్టర్ కావాలని ముంబైలో అడుగుపెట్టిన గుల్షన్ దేవయ్య... డార్క్ కథల్లో సైతం తన నటన తాలూకా స్పార్క్ ని చూపించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ విషయాల గురించి ఆయన చెప్పిన విశేషాలే ఇవి...

‘‘నేను నటించిన ‘దురంగా’ ఈ మధ్యనే జీ5లో విడుదలైంది. సూపర్ హిట్ కొరియన్ థ్రిల్లర్ షో ‘ఫ్లవర్ ఆఫ్ ఈవిల్’కి అఫీషియల్ అడాప్షన్ ఇది. అయితే, ఇందులో నేను చేసిన క్యారెక్టర్ మీద ఒరిజినల్ షో ప్రభావం ఉండకూడదని, ఆ సిరీస్ చూడలేదు. నాకు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి, నా ఊహల్లో ఆ క్యారెక్టర్ ఎలా కనపడిందో, అలాగే చేశా. ‘దురంగా’ సక్సెస్ గురించి అందరూ మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. 90ల రొమాన్స్, క్రైమ్ ఆధారంగా నెట్​ఫ్లిక్స్​లో రాబోతున్న ‘గన్స్ అండ్ గులాబ్స్’లో ఇప్పుడు నటిస్తున్నా.    

పెరిగింది నటుల మధ్యనే

కర్నాటకలోని బెంగళూరులో1978లో పుట్టా. నాన్న దేవయ్య, అమ్మ పుష్పలత. ఇద్దరూ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్​ ఉద్యోగులు. అమ్మ థియేటర్ ఆర్టిస్ట్​గా చేస్తుండేది. నాన్న హిందీ పాటలు పాడతాడు. మా ఇంట్లో ఎప్పుడూ హిందీ పాటలు ప్లే అయ్యేవి. అలా చిన్నప్పటి నుంచే యాక్టింగ్ ఎన్విరాన్​మెంట్​లో పెరిగా. స్కూల్లో చదువుకునే రోజుల్లో కూడా స్టేజిపై యాక్టింగ్ చేసేవాడిని. మా అమ్మ థియేటర్ ఆర్టిస్ట్​గా చేస్తున్నప్పుడు చూడడం వల్ల కాబోలు తెలియకుండానే నా మనసు యాక్టింగ్ వైపు మళ్లింది.  ఫ్రెండ్స్ తో సినిమాలకు వెళ్లినప్పుడు, హీరో  గురించి గొప్పలు మాట్లాడుతుంటే, నేను కూడా హీరో అవుతానని చెప్పేవాడిని. ‘నీ ఫేస్ చూసుకున్నావా?’ అని వాళ్లు నవ్వేవాళ్లు.

ఊహా ప్రపంచంలో...

నేను చదువుకుంది సెయింట్ జోసెఫ్ ఇండియన్ హై స్కూల్. అది బాయ్స్ స్కూల్. అందుకని స్కూల్లో వేసే నాటకాల్లో లేడీ క్యారెక్టర్స్ నేనే వేసేవాడిని. చీర కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తానని, మా సీనియర్స్ ఎప్పుడూ నాకు లేడీ రోల్సే ఇచ్చేవారు. మా తాత రామాయణం, మహాభారతం చెప్తుంటే అందులో క్యారెక్టర్స్​ ఊహించుకునే వాడిని. ఆ ఊహా ప్రపంచం నా యాక్టింగ్​కి ఎలా బాటలు వేసిందో తర్వాత తెలిసింది.

యావరేజ్ స్టూడెంట్

నేనొక యావరేజ్ స్టూడెంట్​ని. కానీ, కాలేజీలో నాటకాల్లో నటించడం వల్ల పాపులర్ అయ్యా. ఇంజనీర్ కావాలా? డిగ్రీ చదవాలా? అని చాలా ఆలోచించా. నేను డ్రాయింగ్ బాగా వేసేవాడిని. కాబట్టి, ‘నీ ప్యాషన్​ని ఎందుకు ట్రై చేయకూడదు?’ అని అంతా అనడంతో ఫ్యాషన్ స్కూల్లో చేరా. ఆ రోజుల్లోనే కేబుల్ టీవీ వచ్చింది. దాంతో సినిమాలు బాగా చూసేవాడిని. అప్పుడే ఫ్రెంచ్ యాక్టర్ జీన్ మూవీస్ చూశా. ఆయన డిఫరెంట్​గా ఎందుకు ఉన్నాడు. అతను సినిమా హీరోనే. కానీ, మన హీరోల్లా కాకుండా డిఫరెంట్​గా ఎందుకున్నాడు అనుకునేవాడ్ని. నేను కూడా షారుక్​ఖాన్ లాగా హీరో కావాలనుకునేవాడిని. కానీ, అద్దంలో చూసుకుంటే ఆ లుక్​ నాకు లేదనిపించేది.1998లో రాంగోపాల్ వర్మ తీసిన ‘సత్య’ మూవీ విడుదలైంది. అందులో మనోజ్ బాజ్​పాయ్ యాక్టింగ్ చూశాక మనవాళ్లు కూడా ఇలాంటి క్యారెక్టర్స్​లో నటిస్తారా? అని నమ్మలేకపోయా. అంటే, నాలాంటి వాళ్లకు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక ప్లేస్ ఉంటుందని రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా వల్లే తెలిసొచ్చింది. అప్పటి నుంచి నాకు సంబంధించిన కార్యెక్టర్స్ ఊహించుకోవడం మొదలుపెట్టా.

ఇంగ్లీష్ థియేటర్ ఆర్ట్స్​చేశా

ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తయ్యాక బెంగళూరులో ఫ్యాషన్ డిజైనర్​గా పనిచేస్తూనే, ఇంగ్లీష్ థియేటర్ ఆర్ట్స్​ చేయడం మొదలుపెట్టా. యాక్టింగ్​కి సంబంధించిన పుస్తకాలు చదవడంతో పాటు థియేటర్​లో ప్రయోగాలు చేసేవాడ్ని. చాలామంది గొప్ప యాక్టర్స్ పర్ఫార్మెన్స్​ని పరిశీలిస్తుండేవాడ్ని. ఇవన్నీ నేను మెరుగైన యాక్టర్​గా తయారయ్యేందుకు ఉపయోగపడ్డాయి. కన్నడ రైటర్ కువెంపు రాసిన ‘స్మశాన కురుక్షేత్రం’ నాటకంలో దుర్యోధనుడి పాత్రలో నటించా. నటుడిగా నేను పనికొస్తాననే కాన్ఫిడెన్స్ అప్పుడే వచ్చింది.

అన్నీ వదిలేసి ముంబైకి ...

అన్నీ వదిలేసి, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్​తో 2008లో ముంబైకి షిఫ్ట్ అయ్యా. రెండేండ్లు ఏ అవకాశం రాక చాలా స్ట్రగుల్ అయ్యా. ఆడిషన్స్ ఇస్తూనే  ఫ్రీలాన్సర్​, ఫ్యాషన్ డిజైనింగ్ టీచర్​గా పనిచేశా. ముంబైలో థియేటర్ ఆర్ట్ చేస్తూనే ఫ్యాషన్ పాఠాలు చెప్తుండేవాడిని. ఆడిషన్స్ ఎన్ని వచ్చినా... నాకు ఏ రోల్​కి ఆడిషన్ ఇవ్వాలనిపిస్తే అదే రోల్​కి ఆడిషన్ ఇచ్చేవాడ్ని. అలా 2009లో అనురాగ్ కశ్యప్ పరిచయమయ్యారు. నా కెరీర్​లో ఆయనదే ముఖ్యపాత్ర. అనురాగ్ కశ్యప్ తీసిన ‘దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్​’ అనే షార్ట్ ఫిల్మ్ తో నా సినిమా జర్నీ మొదలైంది. 2010లో వచ్చిన ఆ షార్ట్ ఫిల్మ్​లో కల్కి, నసీరుద్దీన్ షాతో కలిసి నటించా. ఆ మూవీ  ‘టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’, ‘వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శించారు. ఆ మూవీలో నా యాక్టింగ్​ను చాలామంది మెచ్చుకున్నారు. దాంతో 2011లో వరుసగా మూడు సినిమాలకు సంతకం చేశా. అందులో క్రైమ్ థ్రిల్లర్స్ ‘దమ్ మారో దమ్’, ‘సైతాన్’  నాకు మంచి పేరు తెచ్చాయి.

ఇలా బయటపడతా...

నేను డార్క్ క్యారెక్టర్స్ చేస్తానని తెలుసు. కానీ, వాటిని ఇంటికి తీసుకురావాలనుకోను. ఎమోషనల్, సైకలాజికల్​గా ఆ క్యారెక్టర్స్ ప్రభావం నాపై ఉండకూడదనుకుంటా. ప్రతి దానికి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటకుండా చూసుకోవాలి. లేదంటే పిచ్చి పట్టినట్టు ఉంటుందని నేను థియేటర్​లో  చేస్తున్నప్పుడే నేర్చుకున్నా. అందుకే, సెట్ నుంచి బయట అడుగుపెట్టాక క్యారెక్టర్ నుంచి డిటాక్స్ కావాలి. దీనికోసం నేనొక ట్రిక్ ఫాలో అవుతా.  నాకు రోజులో ఒక్కసారి మాత్రమే తినే అలవాటు ఉంది. అది కూడా సాయంత్రం. కాబట్టి, ప్యాకప్ చెప్పగానే, నాకు ఒక్కటే ఆలోచన... త్వరగా ఇంటికెళ్లాలి. తినాలి. పడుకోవాలి. ఇది నా ఆటోమెటిక్ స్విచాఫ్ అనుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ నుంచి ఈజీగా డిటాక్స్ అవుతుంటా.  చాలాసార్లు రెండు ప్రాజెక్టులు ఒకేసారి చేస్తుంటా. ఒక ప్రాజెక్టులో డార్క్ క్యారెక్టర్ ఉంటే, ఇంకో దాంట్లో పక్కింటి కుర్రాడి క్యారెక్టర్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్​కి మారడానికి నా అనుభవమే ఉపయోగపడుతుంది.

ఆమెతో కలిసి నటించాలి

స్క్రిప్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చేయబోయే క్యారెక్టర్ బలహీనతలు ఏంటో, అది చేసే తప్పులు ఏంటో లోతుగా తెలుసుకుంటా. ఈ జాగ్రత్తలు క్యారెక్టర్​ని రిలేటబుల్​గా మారుస్తాయి. అప్పుడే ప్రేక్షకులు ఆ క్యారెక్టర్​లో తమను తాము చూసుకుంటారు. కాబట్టి, రిలేటబుల్ క్యారెక్టర్స్​ని సృష్టించాలనుకుంటా. నేను హిందీ బాగా మాట్లాడతా. అలాగే తెలుగు, తమిళం కూడా మేనేజ్ చేయగలుగుతా. నాకు దక్షిణాది సినిమాలంటే చాలా ఇష్టం. నటి సాయిపల్లవికి పెద్ద ఫ్యాన్. మంచి స్క్రిప్ట్ వస్తే, ఆమెతో కలిసి తెలుగు లేదా తమిళ మూవీ చేయాలని ఉంది.

వెనక్కి తిరగలేదు

2011లో వివేక్ అగ్నిహోత్రి తీసిన ఎరోటిక్ థ్రిల్లర్ ‘హేట్ స్టోరీ’లో మొదటిసారి లీడ్ రోల్ చేశా. ఆ రోల్​కి మంచి ప్రశంసలు వచ్చాయి. తర్వాత ‘పెడ్లర్స్’ అనే థ్రిల్లర్ మూవీలో నటించా. డ్రగ్స్ వ్యాపారంలో ట్రాప్ అయిన ఒక ఇరవై ఏండ్ల యువకుడి కథ అది. 2013లో సంజయ్ లీలా భన్సాలీ తీసిన రొమాంటిక్ ట్రాజెడీ బ్లాక్ బస్టర్ ‘రామ్ లీలా’లో చేశా. అందులో నేను చేసిన భవానీ క్యారెక్టర్​కి కూడా మంచి పేరొచ్చింది. 2015లో రాధికా ఆప్టేతో కలిసి  అడల్ట్ కామెడీ ఫిల్మ్ ‘హంటర్’ లో నటించా. సెక్స్​కి బానిస అయిన ఒక యువకుడి జర్నీని చూపించే పాత్రలో నటించా. వివేక్ అగ్నిహోత్రి ‘జునోనియత్’ మూవీలో ఎన్.ఆర్.ఐ. రోల్ చేశా. 2017లో ‘కాబరెట్’ , ‘ఎ డెత్ ఇన్ ది గంజ్’, ‘క్యాండీఫ్లిప్’  సినిమాలు చేశా. ‘కమాండో-3’లో  బుర్ఖా అన్సారీ రోల్ చేశా. 2020 లో అమెజాన్ ప్రైమ్​లో వచ్చిన ‘అఫ్సోస్’ సిరీస్​, నెట్​ఫ్లిక్స్​లో వచ్చిన ‘ఘోస్ట్ స్టోరీస్’ బాలీవుడ్​లో నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.

ఒంటరిగా ఉన్నా ఓకే

గ్రీస్ అమ్మాయి కల్లిరోయ్ జియాఫెటాను ప్రేమించి పెండ్లి చేసుకున్నా. ఎనిమిదేండ్ల తర్వాత 2020లో విడిపోయాం. ఇద్దరం కలసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాకే  పాజిటివ్​గా విడిపోయాం. పెండ్లి ప్రైవేట్ విషయం. అందుకే దీని గురించి మేం సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. నేను ఒంటరిగా ఉండటాన్ని బోర్ ఫీలవ్వను. నాతో నేనే గడపడటం, నాకు కంఫర్టబుల్​గా ఉంటుంది.