హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ అడిషనల్ కలెక్టర్ రవి ఆఫీసర్లకు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం వివిధ శాఖల అధికారులు, యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లాస్థాయి మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో మత్తు పదార్థాల వల్ల ఎదురయ్యే సమస్యలపై అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలన్నారు. హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు.
గంజాయి విక్రయించే వారి వివరాలు సేకరించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పరకాల ఆర్డీవో డా.కన్నం నారాయణ, డీఈవో ఎల్వీ.గిరిరాజ్ గౌడ్, డీఎంహెచ్వో అప్పయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఏసీపీలు నరసింహరావు, ప్రశాంత్ రెడ్డి, సతీశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
