ఓ వంద రన్స్ కొట్టి టెస్ట్ మ్యాచ్‌ను కాపాడటం అతనికి చాలా ఈజీ..! కానీ ఓ రెండు రోజుల పాటు హాస్పిటల్ బెడ్ మీద ఉండాలంటే మాత్రం అతను చాలా ఇబ్బందిపడతాడు..! అలాంటిది ఇప్పుడు దేశమే కష్టకాలంలో ఉన్న సమయంలో.. తెలుగు క్రికెటర్ హనుమ విహారి పేదల పాలిట ఆపద్బాంధవుడు అయ్యాడు..! ఓవైపు బ్రిటిష్ గడ్డపై క్రికెట్ ఆడుతూనే.. మరోవైపు స్వదేశంలో కరోనాతో అల్లాడుతున్న పేషెంట్లకు తనవంతు సాయం అందిస్తున్నాడు..! వాళ్లు అడిగిందే తడవుగా.. ఏది అవసరమైతే దానిని అందిస్తూ.. కొంత మంది కష్టాలైనా తీరుస్తున్నాడు..! ఇందుకోసం టీమిండియాలాగా శక్తి వంచన లేకుండా కష్టపడే ఓ టీమ్‌నే సృష్టించుకుని సేవలందిస్తున్నాడు..!
హైదరాబాద్: ఆక్సిజన్ కొరత.. హాస్పిటల్లో ఓ బెడ్.. ప్లాస్మా దాత.. ఫలానా మందులు కావాలి.. ఈ ట్రీట్‌మెంట్ అవసరం... కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు అల్లాడుతున్న ఇండియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాటలివి. కరోనాను ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వాలు ఎంత చేస్తున్నా.. సరైన టైమ్‌లో సాయం అందక చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎవర్ని సాయం అడగాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ కష్టకాలంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర ప్లేయర్లు.. గవర్నమెంట్స్‌కు, ఎన్‌జీవోలకు విరాళాలు అందిస్తే.. తెలుగు క్రికెటర్ హనుమ విహారి మరో దారి ఎంచుకున్నాడు.
లక్షా 10 వేల మంది ఫాలోవర్స్..
కరోనా బాధితులను ఆదుకునేందుకు విహారి.. ట్విటర్‌లో ఓ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. ఇందులో తన భార్య, సోదరి, స్నేహితులు, సహచర క్రికెటర్ యర్రా పృథ్వీ రాజ్‌తో పాటు తన ఫాలోవర్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన వెయ్యి మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్లందర్ని గ్రూప్‌లుగా విభజించి పేషెంట్లకు అవసరమైన వాటిని అందజేస్తున్నాడు. ప్రస్తుతానికి విహారి.. కౌంటీ క్రికెట్ కోసం లండన్‌లో ఉన్నాడు. అక్కడి నుంచే నిత్యం వీళ్లతో ట్విటర్‌లో సంప్రదింపులు జరుపుతున్నాడు. ప్లాస్మా, ఆక్సిజన్ సిలిండర్, హాస్పిటల్ బెడ్.. ఇలా ఏది కోరినా తన టీమ్ ద్వారా బాధితులకు అందజేస్తున్నాడు. గాయంతో బాధపడుతూ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియాను గెలిపించిన దానికంటే.. ఇలా ప్రాణాలు కాపాడటం చాలా గొప్పగా ఉందని విహారి అన్నాడు. ‘ఏదో పేరు ప్రతిష్టల కోసం నేను ఇదంతా చేయడం లేదు. ఈ కష్ట కాలంలో నిజంగా సాయం అవసరమైన ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నా. ఇది ప్రారంభం మాత్రమే. కరోనా వల్ల హాస్పిటల్లో ఓ బెడ్ దొరకడం కూడా కష్టమవుతుందని నేనైతే కలలో కూడా ఊహించలేదు. ఈ పరిస్థితిని చూసి చాలా బాధపడ్డా. అందుకే నా ఫాలోవర్స్‌ను వాలంటీర్లుగా మార్చుకున్నా. వారితో కలిసి అవసరమైన వారికి సాయం అందజేస్తున్నా. ప్లాస్మా, బెడ్స్, మెడిసిన్స్ సమకూర్చుకోలేని వారికి సాయం చేయాలనేది నా ప్రధాన లక్ష్యం. నిజానికి ఇప్పటిదాకా నేను చేసింది పెద్ద లెక్కలోకి రాదు. భవిష్యత్తులో చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. ఓ మంచి ఉద్దేశంతో ఓ టీమ్‌ను తయారు చేశా. ఇతరులకు సాయం చేయాలనే మంచి ఆలోచనతో ఉన్నవాళ్లంతా అందులో ఉన్నారు. అలా నా వాట్సాప్ గ్రూప్‌లో వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. ఎవరైనా కొద్దిమందికి సరైన సమయంలో సాయం అందించగలిగాను అంటే అది వాళ్ల కృషే. ఓ క్రికెటర్‌గా అందరికీ నేను తెలుసు. కానీ నా టీమ్ మెంబర్స్ చూపిస్తున్న చొరవ వల్లే కష్టంలో ఉన్నవారికి అండగా నిలవగలుగుతున్నాం. నేను ఒక్కడిగా ఈ జర్నీ స్టార్ట్ చేశా. ఇప్పుడు వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ మాకు ఫ్రెండ్స్ దొరికారు. నాకు వచ్చిన రిక్వెస్ట్‌లను వారికి షేర్ చేస్తా. వారు వాటిని పరిశీలించి సాయం అందజేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన అవసరాలను నేను కూడా పోస్ట్ చేస్తున్నా. నా భార్య, సిస్టర్తోపాటు కొందరు ఆంధ్ర టీమ్మేట్స్ కూడా నా వాలంటీర్ టీమ్‌లో ఉన్నారు. వాళ్లు ఇచ్చే సపోర్ట్ చూస్తుంటే చెప్పలేనంత సంతోషం కలుగుతోంది’ అని హనుమ చెప్పుకొచ్చాడు. విహారి ద్వారా సాయం అందుకున్న వాళ్లు ట్విటర్ ద్వారా అతనికి థ్యాంక్స్ చెబుతుండటం గొప్ప విశేషం.
టీమ్ కోరుకున్నట్టు ఆడతా..
జట్టు కోరుకుంటే ఇన్నింగ్స్ ఓపెన్చేసేందుకు తాను రెడీ అని విహారి వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఏది కోరుకుంటే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ‘జట్టు కోరుకున్నది చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధం. నా కెరీర్లో ఎక్కువ భాగం నేను టాపార్డర్‌లోనే ఆడా. ఒకవేళ ఇంగ్లండ్ సిరీస్‌లో టాపార్డర్‌లో ఆడమంటే అది నాకు పెద్ద సవాల్ కాదు. నేను ఇంజ్యూర్ అవ్వడం వల్ల దక్కిన చాన్స్‌ను సుందర్ బాగా సద్వినియోగం చేసుకున్నాడు. టీమ్‌లో పోటీ ఎలా ఉన్నా.. నేను నా గేమ్‌పైనే దృష్టి పెట్టా. ఎందుకంటే నా చేతుల్లో ఉన్నవాటిని మాత్రమే నేను కంట్రోల్ చేయగలను. బౌలింగ్‌ను కూడా మెరుగుపర్చుకుంటున్నా. వార్విక్‌షైర్ తరఫున సీజన్ ప్రారంభంలో ఆడటం చాలెంజింగ్‌గా అనిపించింది. మంచి ఎక్స్‌పీరియన్స్ లభించింది. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్‌లో ఈ అనుభవం పనికొస్తుంది’ అని విహారి చెప్పుకొచ్చాడు.
