ఓ హనుమా..మా బాధలు కనుమా..కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని ర్యాలీ

ఓ హనుమా..మా బాధలు కనుమా..కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని ర్యాలీ
  • మంచిర్యాల జిల్లా దండేపల్లిలో పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం

దండేపల్లి, వెలుగు :మంచిర్యాల జిల్లా దండేపల్లిలో కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు ‘ఓ హనుమా.. మా బాధలు కనుమా’ అంటూ బస్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకు మంగళహారతులతో వినూత్న ర్యాలీ నిర్వహించి, స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోతులను తక్షణమే అడవులకు, సంరక్షణ కేంద్రాలకు తరలించాలని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు గోళ్ళ రాజమల్లు మాట్లాడుతూ అడవుల్లో పండ్ల మొక్కలు లేకపోవడం వల్లే కోతులు జనవాసాలపై పడుతున్నాయని, అటవీ, ఉపాధి హామీ శాఖలు అడవిలో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. 

గతంలో ప్రజావాణిలో అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేదని, సర్పంచ్​ ఎన్నికల్లోనూ  ఇదే డిమాండ్​ఉన్నా సమస్య మాత్రం తీరలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను కోతుల బెడద నుంచి రక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమితి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు చెన్నవేని భాను ప్రసాద్, గరిగే మురళి తదితరులు పాల్గొన్నారు.