మహిళా పోలీసుపై లైంగిక వేధింపులు..మద్దూరు ఎస్ఐపై కేసు నమోదు 

మహిళా పోలీసుపై లైంగిక వేధింపులు..మద్దూరు ఎస్ఐపై కేసు నమోదు 
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఎఫ్ఐఆర్ 

మద్దూరు, వెలుగు:  నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్‌‌లో పని చేస్తున్న ఎస్ఐ విజయ్‌‌కుమార్‌‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. సొంత శాఖలో పని చేస్తున్న ఓ మహిళా పోలీసు గత ఫిబ్రవరి 21న చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కావడంతో, ఆయనను జిల్లా ఎస్పీ వినీత్ వెంటనే వీఆర్‌‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్దూరు పోలీస్ స్టేషన్ ఇన్‌‌చార్జ్ బాధ్యతలను కోస్గి ఎస్సై శ్రీనివాసులుకు అప్పగించారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం, వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళా పోలీసుకు ఎస్ఐ ట్రైనింగ్ సమయంలో విజయ్‌‌కుమార్ పరిచయం అయ్యాడు.

అనంతరం వ్యక్తిగత సంబంధం కోసం పలుమార్లు ఒత్తిడి తెచ్చాడని, తన వద్ద నుంచి రూ.1.20 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని, అలాగే తన వివాహ సమయంలో ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడని, 2025లో ఇంటికి వచ్చి అనుచితంగా ప్రవర్తించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపిన బాధితురాలు, పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఎస్ఐ విజయ్‌‌కుమార్‌‌పై బీఎన్ఎస్ సెక్షన్లు 78, 329(4), 351(2) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఎస్ఐ విజయ్‌‌కుమార్‌‌పై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి.

అప్పిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ భర్త శ్రీనివాస్ ఒక కేసు విషయమై పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లిన సమయంలో ‘సర్పంచ్ నీ భార్య కదా.. ఆమెనే రమ్మను’ అంటూ అసభ్యకరంగా మాట్లాడాడని మహిళా సర్పంచ్ పీఎస్ ముందు ధర్నాకు దిగింది. దీంతో ఉల్టా వారిపైనే ఎస్ఐ కేసు పెట్టాడని, పాత కేసును బయటకు తీసి, శ్రీనివాస్ ను జైలుకు పంపాడనీ అప్పట్లో చర్చించుకున్నారు. ఆయన జర్నలిస్టులను సైతం బెదిరించడంతోపాటు అక్రమ కేసులు పెట్టాడనే ఆరోపణలు వచ్చాయి. ఎస్ఐపై ఈ లైంగిక వేధింపులతోపాటు గతంలో వచ్చిన ఆరోపణలపైనా విచారణ జరిపించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.