
నికోసియా (సైప్రస్): తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. నికోసియాలో జరిగిన విమెన్స్ గ్రాండ్ ప్రి చెస్ టోర్నమెంట్ నాలుగో అంచెలో జాయింట్ సెకండ్ ప్లేస్‌లో నిలవడం ద్వారా ఆమె క్యాండిడేట్స్ బెర్తు దక్కించుకుంది.
ఈ టోర్నీలో పదో రౌండ్ వరకూ జాయింట్ టాప్ ప్లేస్‌లో ఉన్న హారిక శనివారం జరిగిన చివరి గేమ్‌లో రష్యా జీఎం గొరియాచ్కినా అలెక్సాడ్రాతో పాయింట్ పంచుకుంది. దాంతో, 6.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి రెండో స్థానంలో నిలిచింది. జర్మనీకి చెందిన విమెన్స్ గ్రాండ్ మాస్టర్ డినార వాగ్నర్ 7 పాయింట్లతో టాప్ ప్లేస్‌తో టైటిల్ నెగ్గింది.