ఉపాధి హామీ అమలులో కేంద్రం విఫలం

ఉపాధి హామీ అమలులో  కేంద్రం విఫలం

సిద్దిపేట, వెలుగు : ఉపాధి హామీ పథకం అమలులో కేంద్రం విఫలమైందని, ఎన్నో  ఆంక్షలు పెట్టి 1.12 కోట్ల మంది కూలీలను ఇబ్బంది పెట్టే విధంగా కొత్త జీవో తెచ్చిందని మంత్రి హరీశ్​రావు విమర్శించారు. మంగళవారం సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో ఈజీఎస్  ఫీల్డ్ అసిస్టెంట్ల కృతజ్ఞత సభకు హాజరై మాట్లాడారు.   కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేలా నల్ల చట్టాలు తెస్తుంటే..  రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.  అనంతరం క్యాంపు ఆఫీస్ లో  ఏర్పాటు చేసిన మీటింగ్​లో  218 మందికి బీడీ పింఛన్ల  మంజూరు పేపర్లు మంత్రి పంపిణీ చేశారు. 

ఆటో నగర్ నిర్మాణానికి శంకుస్థాపన

సిద్దిపేట పట్టణ శివార్లలోని ఇండస్ట్రియల్​ పార్క్  వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆటో నగర్  నిర్మాణానికి మంత్రి హరీశ్​ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా 25 ఎకరాల స్థలంలో రూ. 15 కోట్లతో మోడల్ ఆటోనగర్ ను 3 నెలల్లో నిర్మించి అందిస్తామన్నారు.  జడ్పీ చైర్ పర్సన్ వేలేటీ రోజాశర్మ,  ఆర్టీవో దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

 అభివృద్ది పనుల ప్రారంభం

 చిన్నకోడూర్ మండలం రామంచలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును  టీహెచ్ఆర్ పల్లె ప్రకృతి వనాన్ని ,  - మంకీ ఫుడ్ కోర్టును మంత్రి హరీశ్​ రావు  మంగళవారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  సిద్దిపేట నుంచి రామంచ వరకు రూ.25 కోట్లతో  ఫోర్​లైన్​హైవే, రామంచ నుంచి చిన్నకోడూర్ వరకూ బీటీ రోడ్డును నిర్మించనున్నట్లు ప్రకటించారు.  

భూ సమస్యలు పరిష్కరించండి సారూ..

మెదక్ (శివ్వంపేట), వెలుగు:  భూ సమస్యలు పరిష్కరించాలని శివ్వంపేట మండలం బిక్య తండా, తాళ్లపల్లి తండాల రైతులు మంత్రి హరీశ్​రావుకు విన్నవించారు.  మంగళవారం వారు సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ లో మంత్రిని కలసి భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా పార్ట్–- బి లో పెట్టిన సర్వే నంబర్ 315, 316, 310, 267లోని 1, 200 ఎకరాల భూముల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. పట్టా పాస్​బుక్స్​రాకపోవడంతో తమకు రైతుబంధు సాయం, రైతు బీమా అమలు కావడం లేదని, క్రాప్​లోన్లు కూడా ఇస్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు.  

పంట వివరాలను నమోదు చేయాలి
కలెక్టర్ శరత్

సంగారెడ్డి టౌన్ , వెలుగు: ప్రతి రైతు సాగు చేసిన పంటల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ సంబంధిత వ్యవసాయ అధికారులు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లోని   మీటింగ్​హాల్​లో వ్యవసాయ శాఖలోని వివిధ పథకాలపై సమీక్ష నిర్వహించారు. రైతు బీమా పథకం లో భాగంగా రైతు చనిపోయిన వెంటనే బీమా పోర్టల్ లో క్లెయిమ్​ డాక్యుమెంట్ ఎంట్రీ చేయాలని ఆదేశించారు. పీఎం కిసాన్ లో ప్రతి రైతుకు ఈ కేవైసీ చేయించాలని స్పష్టం చేశారు. ప్రతి ఏఈవో, ఎంఏవోలు అలసత్వం లేకుండా లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు.  సమావేశంలో వ్యవసాయ ,ఉద్యాన శాఖ జిల్లా అధికారులు నరసింహారావు, సునీత తోపాటు డివిజనల్, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

గ్రామ సేవకుల భిక్షాటన

దుబ్బాక, వెలుగు:   గ్రామ సేవకుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్​చేస్తూ మంగళవారం దుబ్బాకలో భిక్షాటన కార్యక్రమం చేపట్టారు.  వీరి నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్​  నియోజకవర్గ ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్​రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​రెడ్డి, గ్రామ సేవకుల సంఘం జిల్లా అధ్యక్షుడు నరేశ్ ​మాట్లాడుతూ  మస్కూరి, నీరటి, సుంకరి వతందారుల  పర్మినెంట్​ జీవోను రద్దు చేసి పాత  పద్ధతిలోనే చెక్కులు, నగదు   రూపంలో జీతాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సేవకులు ఆస రవి, భాస్కర్​, నర్సింగ్​రావు, నర్సింలు, మహేశ్ 
తదితరులు పాల్గొన్నారు.

రాజేశ్వర్​రెడ్డికి అత్యుత్తమ పురస్కారం

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేటకు చెందిన  ప్రముఖ జ్యోతిష్యుడు కల్లకుంట్ల రాజేశ్వర్ రెడ్డికి అత్యుత్తమ పురస్కారం దక్కింది. అర్పిత  సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ వారు ఏటా  రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తారు. అందులో భాగంగా ఈ యేడు  రాజేశ్వర్ రెడ్డికి సాహిత్య సేవా రంగంలో  సేవలు అందించినందుకు ‘తెలంగాణ రత్న’ బిరుదుతో సత్కరించారు. హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో రాజేశ్వర్ రెడ్డి కి ఈ అవార్డును అందజేశారు. 

నారాయణరావుపేటపై వివక్ష ఎందుకు?

సిద్దిపేటరూరల్, వెలుగు: నారాయణరావుపేట మండలం ఏర్పాటై మూడేండ్లు గడుస్తున్నా.. నేటికీ ఎలాంటి అభివృద్ధి పనులు  చేయకుండా మంత్రి హరీశ్ రావు ఎందుకు వివక్ష చూపుతున్నారని  బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జిల్లెల్ల రమేశ్ ఆరోపించారు. మంగళవారం నారాయణరావు పేట మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలానికి ఏడేళ్ల కింద మంజూరైన గురుకుల స్కూల్​కేటాయించడానికి లేని స్థలం, క్రీడా ప్రాంగణానికి  ఏవిధంగా వచ్చిందని  ప్రశ్నించారు.   బీజీపీ మండల అధ్యక్షుడు  రాజేశం, జిల్లా నాయకుడు 
బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ ఎగ్జామ్​కు పక్కాగా ఏర్పాట్లు

మెదక్, వెలుగు: ఈ నెల 28న జరుగనున్న కానిస్టేబుల్​ప్రిలిమినరీ ఎగ్జామ్​కు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. బయోమెట్రిక్ సిస్టంతో  పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.  మంగళవారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పోలీస్​రిక్రూట్​మెంట్​బోర్డు ఆదేశాల మేరకు ఎగ్జామ్​సెంటర్ల చీఫ్​సూపరింటెండెంట్లకు, అబ్జర్వర్లకు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు పరీక్ష నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హాజరైన ఎస్పీ మాట్లాడుతూ  జిల్లాలో 8,821 మంది కానిస్టేబుల్  అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు.  

విధినిర్వహణలో అలసత్వం వద్దు

సిద్దిపేట రూరల్, వెలుగు: బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని అడిషనల్ డీసీపీ  మహేందర్ సూచించారు. ఇన్విజిలేటర్ల కు ఇందూర్ ఇంజినీరింగ్​ కాలేజ్ లో  రీజినల్   కాలేజీ ప్రిన్సిపాల్ వీపీ రాజు తో కలసి   శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.  

మట్టి గణపతులనే పూజించాలి

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు:  పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని స్కూల్​ఆఫ్​ సైన్స్ ప్రిన్సిపాల్​ప్రొఫెసర్​నాగేశ్​ దత్తాత్రి అన్నారు.  పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రుద్రారం గవర్నమెంట్​స్కూల్ స్టూడెంట్లకు గణపతి మట్టి విగ్రహాల తయారీ పోటీలను మంగళవారం నిర్వహించారు. గీతం స్కూల్​ఆఫ్​సైన్స్​ఎన్విరాన్​మెంట్​హెచ్​ఆర్​ ఉమాదేవి, కెమిస్ర్టీ  ఇన్​చార్జి డాక్టర్ టీబీ పాత్రుడు పలువురు బీఎస్సీ, ఆర్కిటెక్చర్​ స్టూడెంట్స్  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  అనంతరం పోటీలో పాల్గొన్న ప్రతీ స్టూడెంట్​కు ప్రోత్సాహక బహుమతులు అందించారు.  

‘ఉన్నతి పథకం’ ద్వారా ఉపాధి శిక్షణ

నారాయణ్ ఖేడ్, వెలుగు:  ఉపాధి హామీ పథకంలో వంద రోజులు పనిచేసిన  కూలీల ఫ్యామిలీలకు ‘ఉన్నతి పథకం’ ద్వారా స్వయం ఉపాధి శిక్షణ ఇస్తున్నామని డీఆర్డీఏ ప్రాజెక్ట్​ఆఫీసర్ ​జయశ్రీరాజ్ అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ లో  ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు  టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో 2018-–2019లో వంద రోజుల పాటు పని చేసిన కూలీల కుటుంబాల నుంచి అర్హులైన 50 మందిని ఎంపిక చేశామన్నారు. వీరు శిక్షణ పొందే  టైంలో కూలి డబ్బులు  కోల్పోతున్నందున ఒక్కొక్కరికి  రోజూ రూ. 257 చొప్పున  చెల్లిస్తూ శిక్షణ ఇప్పిస్తామన్నారు.   జడ్పీటీసీ లక్ష్మీ బాయి రవీందర్, ఏపీఎం లు టీక్యానాయక్, వంశీక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.  

అక్రమ అరెస్టులపై భగ్గుమన్నరు
నెట్​వర్క్​, వెలుగు: బీజేపీ స్టేట్ ​చీఫ్​ బండి సంజయ్​అక్రమ అరెస్ట్​, ఎమ్మెల్సీ కవిత ఇంటి ఎదుట ధర్నా చేసిన బీజేపీ లీడర్లపై దాడులు చేసి, కేసులు నమోదు చేసినందుకు నిరసనగా మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు  భగ్గుమన్నారు. సీఎం కేసీఆర్, కవితల దిష్టిబొమ్మలను దహనం  చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా సాగుతున్న  ప్రజా సంగ్రామ​ యాత్రను అడ్డుకోవడం ప్రభుత్వ పిరికపంద చర్య అన్నారు.  లిక్కర్​లింకులపై ప్రశ్నిస్తే  బీజేపీ లీడర్లపై అటెంప్ట్​ మర్డర్​కేసులు పెట్టించడం దుర్మార్గమన్నారు.  నిరసన కార్యక్రమాల్లో  బీజేపీ  మెదక్, సిద్దిపేట​ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, దూది శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్​​గౌడ్​, బీజేవైయం అధ్యక్షుడు  సురేశ్​గౌడ్, బీజేవైఎం జిల్లా మాజీ అధ్యక్షుడు విభీషణ్​రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 

ట్రాఫిక్​ రూల్స్​పై 
అవగాహన కల్పించాలి
సిద్దిపేట రూరల్, వెలుగు: టాక్సీ, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్​రూల్స్​పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీ. ఎన్. శ్వేత అధికారులకు సూచించారు. మంగళవారం ఆర్టీసీ, ఆర్టీవో, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని పలు రద్దీ ప్రాంతాల్లో టాక్సీ, ఆటో డ్రైవర్లు  రూల్స్​ఉల్లంఘిస్తున్నారని, ఆ ప్రాంతాల్లో దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు.  అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి ఇల్లిసిటీ ఆపరేషన్, ఎన్​ఫోర్స్​మెంట్​వర్క్ చేయాలని సూచించారు. ఆర్టీసీ విజిలెన్స్  సెక్యూరిటీ ఆఫీసర్ మహంకాళి రామ్మూర్తి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ 
తదితరులు పాల్గొన్నారు.

 వెహికల్ ​ఢీకొని ఇద్దరు మృతి
కొండాపూర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మండల పరిధిలోని కిష్టయ్య గూడెం వద్ద.. నేషనల్​ హైవే పై మంగళవారం గుర్తు తెలియని వెహికల్​ ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్​లోనే చనిపోయారు. ఎస్సై వెంకటేశం వివరాల ప్రకారం.. కొండాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం దొబ్బకుంట  చెందిన సంగీత బాయి (25) తన ఏడాది వయస్సు గల పాపని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు  వరుసకు అల్లుడైన టోప్యా చౌహాన్‌‌‌‌‌‌‌‌ (18)తో కలిసి బైక్ పై సంగారెడ్డికి బయలు దేరారు. సంగారెడ్డికి  దగ్గరలోని కిష్టయ్య గూడెం వద్ద గుర్తుతెలియని వెహికల్​వేగంగా ఢీకొట్టడంతో సంగీత బాయి, టోప్యా  స్పాట్​లోనే చనిపోయారు. చిన్నారికి మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయని ఎస్సై  తెలిపారు. టోప్యా చౌహాన్‌‌‌‌‌‌‌‌  సోదరుడు సుభాష్‌‌‌‌‌‌‌‌  కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

అప్పుల బాధతో యూట్యూబర్ ఆత్మహత్య
మెదక్​ (కౌడిపల్లి), వెలుగు: కౌడిపల్లిలో అప్పుల బాధతో ఓ యూట్యూబ్ ఛానల్​ నడిపే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శివప్రసాద్​రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నవీన్ గౌడ్ (23) అనే యువకుడు తానే సొంతంగా పాటలు రాస్తూ, వాటిని చిత్రీకరించి ఓఎన్జీ పేరుతో యూట్యూబ్  చానల్​  రన్​ చేసేవాడు. సబ్​స్రైబర్ల ను పెంచుకునేందుకు , సాంగ్స్​ చిత్రీకరణ కోసం దాదాపు  రూ. 5 లక్షల  వరకు అప్పులు చేశాడు.  అప్పులు ఎలా తీర్చాలనే బాధతో ఈ నెల 17న తన సొంత పొలంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నవీన్​ను  సికింద్రాబాద్ లోని​ గాంధీ  ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి  చనిపోయాడు.   తండ్రి యాదగౌడ్ కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  తెలిపారు.

చెరువులో పడి..
మెదక్​ (టేక్మాల్), వెలుగు: టేక్మాల్ మండలం షాబాద్ తండా గ్రామ పంచాయతీ పరిధి కేవ్లా తండాలో మంగళవారం చెరువులో పడి ఓ రైతు చనిపోయాడు.  ఎస్సై లింగం వివరాల ప్రకారం.. తండాకు చెందిన ముడావత్​రంజ్యా (62) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం బర్రెలను మేపేందుకు సమీపంలోని పొలానికి వెళ్లిన అతను రాత్రి అయిన ఇంటికి రాలేదు. దీంతో కొడుకు అశోక్ పొలం వద్దకు వెళ్లి వెతకగా సమీపంలోని చెరువు వద్ద చెప్పులు, బట్టలు ఉండడంతో తండా వాసులకు తెలిపాడు. రాత్రి చెరువులో వెతికినా ఆచూకీ లభించలేదు. తిరిగి మంగళవారం చెరువులో గాలించగా రంజ్యా  డెడ్​బాడీ బయటపడింది. బర్రెలను కడిగేందుకు వెళ్లి కాలుజారి చెరువులో పడి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కరెంట్‌‌‌‌‌‌‌‌ షాక్ తో రైతు మృతి

జోగిపేట, వెలుగు : అందోలు మండల పరిధిలోని అక్సాన్​పల్లిలో మంగళవారం కరెంట్​షాక్​తో ఓ రైతు చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాబూమియా(55), అతని కొడుకు పాషతో కలిసి తనకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. వరిచేనుకు పై మందు పిచికారి చేసేందుకు పొలానికి వెళ్లి  పొలంలో వేలాడుతున్న  కరెంట్​వైర్​ను కట్ చేయబోగా.. అది తెగి అతనిపై పడింది. దీంతో బాబూమియా స్పాట్​లోనే చనిపోయాడు. గమనించిన కొడుకు పాష  జోగిపేట పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య షరీఫా  కంప్లైంట్​ మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.