మార్పులతో వ్యూహం ఫలిస్తుందా.. బీజేపీ ఆత్మరక్షణలో పడిందా?

మార్పులతో వ్యూహం ఫలిస్తుందా.. బీజేపీ ఆత్మరక్షణలో పడిందా?

కాన్పూర్​లో 1973 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి11 వరకు జనసంఘ్​మహాసభ జరిగింది. అది దేశ రాజకీయంగా సంక్లిష్టంగా ఉన్న సమయం. ఆ సమయంలో ఓ పరిణామం సంభవించింది. జనసంఘ్​స్థాపన కోసం డా. శ్యామాప్రసాద్​ముఖర్జీ మెరికల్లాంటి కొందరిని ఇవ్వమని గురూజీ గోల్వల్కర్​ను అడిగాడు. ఆయన ఏరికోరి పంచపాండవుల్లాంటి వాళ్లను ఆర్​ఎస్​ఎస్​ నుంచి జన సంఘ్​కు పంపాడు. అందులో దీన్​దయాళ్​ఉపాధ్యాయ, నానాజీ దేశ్​ముఖ్, బలరాజ్​మథోఖ్, సుందర్​సింగ్​ భండారి, భావూసాహెబ్​దేవరస్​.. ఉన్నారు. వీళ్లంతా సామాన్య కార్య కర్తలు. ఇందులో బలరాజ్​మథోఖ్​ గొప్ప దార్శనికుడు. అయితే ఆయన జనసంఘ్​ను ఇందిరపై నేరుగా తలపడాలని ఆశించి, వాదించేవాడు.

సెక్యులర్​ శక్తులపై ఈరోజు నరేంద్ర మోదీ ఎలాగైతే ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నాడో దాన్ని ఆరోజుల్లోనే అమలు చేయాలని మథోఖ్​వాదించాడు. ఈ విషయంలో  తన ఆలోచనలతో 22 పుటల ప్రశ్న పత్రాన్ని తయారు చేసి, కాన్పూర్​ మహాసభలో పంచిపెట్టాడు. అయితే అది వికటించి ఆయన జనసంఘ్​ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అలాగే దేశంలో పెద్ద ‘క్రాంతి’ సృష్టించిన జయప్రకాశ్​ నారాయణను దానికి అంగీకరింపజేసిన గోవిందాచార్య కూడా ఎదురు తిరిగితే తర్వాత కాలంలో కనిపించలేదు. అయితే వాజ్​పాయ్​ లాంటి లౌక్యం ఉన్న రాజకీయవేత్త మాత్రం ‘బాబ్రీ మసీదు విధ్వంసం’ సమయంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, తర్వాత సర్దుకొని ఉన్నత పదవులలంకరించాడు.

ఇలా మౌనంగా మనం కొన్ని వీక్షిస్తేనే కాలం కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్​ను తొలగించాక పెద్ద ఉద్విగ్న వాతావరణం నిర్మాణం అయింది. నేరుగా కారణాలతో తిట్టిపోయలేని వారు అనేక ఉపమానాలను, సోషల్ ​మీడియాలో చర్చించారు. నిన్నటి మొన్నటి వరకు బండి సంజయ్​మతతత్వవాది అని విమర్శించిన వారు కూడా సానుభూతి ప్రకటించారు. అయితే బండి సంజయ్​ మాత్రం చాలా పెద్ద మనసుతో తాను కిషన్​రెడ్డి శిష్యుడిని అని కథను ముగించాడు.

తొలగింపు వెనుక

మొత్తం ఎపిసోడ్​లో బండి సంజయ్​ను తొలగించడం వెనుక ఏం జరిగిందో అని తెలంగాణ సమాజానికి అనుమానం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఏమీలేని చోట పార్టీని నమ్ముకొని ఉన్న కిషన్​రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది. ‘మిమ్మల్ని కేసీఆరే నియమింపజేశారట కదా’ అని నేరుగా అడిగినా కిషన్​రెడ్డి నవ్వుతూ సమాధానం చెప్పడం అతని గౌరవాన్ని పెంచింది. ఈ లోపు ప్రధాని సభ వరంగల్​లో జరిగితే అందులో మోదీ తర్వాత బండి సంజయ్​ స్పీచ్​కు ఆదరణ కనిపించింది. ఇదంతా పార్టీ వాళ్లకు నేర్పిన క్రమశిక్షణ. కానీ ఇతర పార్టీల సంస్కృతికి అలవాటుపడిన వారి చేతుల్లోకి పార్టీ వెళితే ప్రమాదం పొంచి ఉన్నట్లే. అందుకే బండి సంజయ్​ను తొలగించడం కోర్​ఐడియాలజీ ఉన్న అతని వ్యతిరేకులకు కూడా నచ్చలేదు. పాతబస్తీ మా అడ్డా అని అందులోకి ఎవరైనా ప్రవేశించాలంటే మా అనుమతి ఉండాలని ధిక్కరించి చార్మినార్ ముందు సభ పెట్టిన బండి సంజయ్ కి ఏ సెక్యూరిటీ ఇవ్వలేదు.

హిందూత్వ జాతీయ వాదం కోసం మాట్లాడిన రాజాసింగ్ కు ఏ సెక్యూరిటీ ఇవ్వలేదు ఇపుడు అర్జంట్ గా ఈటల, అరవింద్ కు కేంద్ర హోం శాఖ సెక్యూరిటీ ఇచ్చారంటే అధిష్టానం ఏం చేయబోతుందోనన్న ఉత్కంఠ మొదలైంది. అయితే ప్రధాని వరంగల్​సభలో ‘విచారణ ఏజెన్సీలు కేసీఆర్​కుటుంబ అవినీతిపై విచారణ జరుపుతున్నాయి’ అనే మాట హైలైట్​అయింది. అలాగే మరుసటి రోజు పార్టీ ముఖ్యనేతలతో నడ్డా జరిపిన అంతర్గత సమావేశంలో కూడా కేసీఆర్​ప్రభుత్వ అవినీతిపై మాట్లాడటమే తప్ప చర్యలు లేవని ప్రజలు అనుకోవడం వల్ల బీజేపీ–బీఆర్ఎస్​ కలిసిపోయాయనే విమర్శలు ఎదుర్కొంటున్నామని రాష్ట్రనేతలు చెప్పినట్లు సమాచారం. అలాంటిది ఏం లేదని దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేస్తాయని చెప్పినట్లు తెలిసింది. అయితే ఇంకొందరు బయట ఉండే రాజకీయ విమర్శకులు ఇంకో ప్రశ్న సంధిస్తున్నారు.ఏ కమిట్​మెంట్​లేకుంటే బండి సంజయ్​ని తొలగించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

అధిష్టానం మౌన వ్రతం

పార్టీలో అంతర్గత శత్రువుల ప్రభావం తగ్గించేందుకు గత మూడు నెలల నుంచి సంజయ్​తన కార్యక్రమాలు నెమ్మదింపజేశాడు. అదే సమయంలో పరస్పర విమర్శలు పెరిగినా అధిష్టానం ‘మౌన వ్రతం’ పూనడం వెనుక ఆంతర్యం ఎవరికీ అంతుపట్టలేదు. బుజ్జగింపుల ధోరణీ అలవాటులేని అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో ఎదురు తిరిగినవారికి పదవులు కట్టబెట్టింది అన్న అపప్రథను మూటగట్టుకుంది. రాజకీయాలను దగ్గరగా గమనించే వ్యక్తులు మరో ప్రశ్న వేస్తున్నారు. కాశ్మీర్​ను ముట్టుకుంటే దేశం రావణకాష్టం అవుతుందని బీరాలు పలికిన అబ్దుల్లా – ముఫ్తి కుటుంబాలను ఈరోజు వాళ్ల గేటు వాళ్లే తెరుచుకొనేట్టు చేశారు. నాలుగు దశాబ్దాలకుపైగా వెంటనున్న శివసేన.. అకాలీదళ్​పార్టీలను శత్రుపక్షంలోకి నెట్టేసారు. దేశరాజకీయాలను చక్రం తిప్పుతాననే శరద్​ పవార్​ పార్టీని ముక్కలు చేసి అతనికి నిద్రలేకుండా చేశారు. గుజరాత్​అల్లర్లు మొదలుకొని 2018 ఫిబ్రవరి వరకు అనేక సార్లు పిల్లిమొగ్గలు వేసిన చంద్రబాబును నోరు తెరవకుండా చేశారు. అలాగే వ్యక్తులుగా అరుణ్​శౌరి, యశ్వంత్​సిన్హా, ప్రవీణ్​భాయ్​ తొగాడియా లాంటి వాళ్ల ఉనికి లేకుండా చేశారు. మరి కేసీఆర్​తో ఎప్పుడూ అంటకాగలేదు. బీఆర్​ఎస్​పార్టీ ఎప్పుడూ బీజేపీ వెంట గట్టిగా నిలబడలేదు. అలాంటి కేసీఆర్​ పట్ల ఇంత ఉదాసీన వైఖరికి కారణం ఏమై ఉండొచ్చని చాలా మంది ప్రశ్న.

ఆంధ్రాలో చంద్రబాబు

దక్షిణాదిలో ఇప్పుడు బీజేపీకి గ్రౌండ్​ఏర్పడి సిద్ధంగా ఉన్న రాష్ట్రం తెలంగాణలో ఈ ‘భ్రూణ హత్య’ ఎందుకు జరిగిందో అని గొప్ప గొప్ప విశ్లేషకులకు అంతుపట్టడం లేదు. కేంద్రంలో రెండోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక అమిత్​షా నల్గొండ జిల్లాలో గుండగోని మైసయ్య వర్ధంతి సభలో పాల్గొన్న నాటి నుంచి ఇటీవల నడ్డా పర్యటన వరకు అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడుతున్నా చర్యలకు వెనుకాడటం పట్ల కేసీఆర్​వ్యతిరేకులు జీర్ణించుకోకపోగా బీజేపీని తిట్టిపోస్తున్నారు.  2018 ఫిబ్రవరి తర్వాత టీడీపీ–బీజేపీ నుంచి దూరం జరిగాక  కేంద్రంతో యుద్ధానికి దిగింది. మోదీని బాలకృష్ణ వచ్చీరాని హిందీలో బూతులు తిట్టాడు. తిరుమల దర్శనానికి అమిత్​షా కుటుంబంతో వస్తే టీడీపీ శ్రేణులు ఆయన కాన్వాయ్​పై రాళ్లు వేస్తే టీడీపీ సమర్థించింది. మోదీ ఆంధ్రా పర్యటనకు వస్తే నల్లబెలూన్లు ఎగిరేశారు. చంద్రబాబు ఆగర్భ శత్రువు కాంగ్రెస్ తో చెట్టాపట్టాలు వేసుకున్నాడు. ఇంత జరిగినా మోదీ–షా ధ్వయం సమయం కోసం వేచి చూసి చంద్రబాబును దెబ్బతీస్తే, ఇప్పుడు ‘మోదీ అపాయింట్​మెంట్’  కోసం బాబు కండ్లలో వత్తులు వేసుకొనేట్లు చేయగలిగారు. ఎప్పుడో ఓసారి కేసీఆర్​ను అలాంటి స్థితికే తెస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 

కన్ఫ్యూజన్​లోకి నెట్టి..

కేసీఆర్​ కూతురు కవిత అరెస్టుతో అన్నీ జరిగిపోతాయా? అంటే బీజేపీ నేతలు ఎదురు చెప్పలేని స్థితి ఎవరు కల్పించారు? అసలు సెన్సెక్స్​లా ప్రతిపక్ష పార్టీలను లేపడం, దింపడం ఏమిటి? నిజానికి కేసీఆర్​ కుటుంబం అవినీతికి పాల్పడితే దానికి సంబంధించిన సోర్స్​మెటీరియల్​ మీడియాకు ప్రజలకు ఇవ్వలేని స్థితిలో బీజేపీ మెకానిజం ఉందా? మహామహా యోధులనే బట్టలిప్పి ఘోరమైన స్థితికి తెచ్చిన బీజేపీ కేసీఆర్​పట్ల వహిస్తున్న వైఖరి ఇప్పుడు ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎందుకు ? లేక కేసీఆర్​ తెలివిగా కేంద్రంపై, మోదీపై విమర్శల పదును తగ్గించి సెల్ఫ్​డిఫెన్స్​లోకి నెట్టాడా? అని రాజకీయవర్గాల్లో చర్చ. బీజేపీలో అయినా, తెలంగాణలో అయినా రెండు వర్గాలుగా ‘రాజకీయం’ చీలిపోయి ఉంది. కేసీఆర్​ను గట్టిగా వ్యతిరేకించే వర్గం ఒకటి, వాళ్లవాళ్ల సిద్ధాంతాలను అనుసరిస్తూ వాటి ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న కేసీఆర్​ను గద్దెదించాలనుకొనే రెండో వర్గం. బీజేపీలో కూడా బయట నుంచి ఉద్యమకారుల రూపంలో ఉన్నవారు కేవలం కేసీఆర్​ను గద్దె దించాలనే లక్ష్యంతో ఉన్నారు అలా కాకుండా కేసీఆర్ ను గద్దె దించి తమ సిద్ధాంతాల ఆధారంగా పార్టీపాలన కోరుకునేవారు. ఈ రెండు వర్గాలను కేంద్ర పార్టీ ఎందుకో కన్​ఫ్యూజన్​లోకి నెట్టిందని మేధోవర్గం వాదన.

బీజేపీ ఆత్మరక్షణలో పడిందా?

అన్ని పార్టీలను ఇలాంటి గందరగోళంలో పడేసి కేసీఆర్​ తన రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నాడని ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు బీజేపీ తో యుద్ధం చేస్తానని నమ్మించి మునుగోడులో వామపక్షాలను దగ్గర చేర్చుకొని విందు భోజనం పెట్టి వేదిక మీద కూర్చోబెట్టగానే వాళ్లు ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. తర్వాత ‘మాకూ పొత్తు ఉంది అనీ, మేం వెళ్లి పోతాం’ అని పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎన్ని చేసినా కేసీఆర్​ వాళ్లను గేటు ముందటికి కూడా రానివ్వడం లేదు. వామపక్షాలను కన్ఫ్యూజన్​లో పడేసినట్లే.. అన్ని పార్టీలను చదరంగంలోకి దింపి ఆటాడుతున్న కేసీఆర్​ను చూసి మురిసిపోవాలో, వాళ్ల పార్టీల ‘స్వీయ నాశనం’ చూసి మతిచలించిపోవాలో తెలియని స్థితి. అలాగే బీజేపీ కూడా ఇప్పుడు సెల్ఫ్​గోల్​ చేసి ఆత్మరక్షణలో పడిందని కిందిస్థాయి కార్యకర్తలు వాపోతున్నారు. అయితే వాజ్​పా య్, అద్వాణీ లా మోదీ – షాలు సత్వగుణ సంపన్నులు కారని, అదును చూసి విత్తనం వేస్తారని అనుభవజ్ఞులు చెబుతున్నారు. శ్యామా ప్రసాద్​ముఖర్జీ మొదలుకొని బండి సంజయ్​ వరకు ఎందరో సమిధలుగా మారుతున్న ఈ యజ్ఞంలో గెలుపెవరిదో ఓడేది ఎవరో కాలమే తేల్చాలి.

- డా.పి.భాస్కర యోగి, సోషల్ ​ఎనలిస్ట్