PMC కేసులో HDIL ప్రమోటర్ల అరెస్ట్‌‌

PMC కేసులో HDIL ప్రమోటర్ల అరెస్ట్‌‌

న్యూఢిల్లీపంజాబ్‌‌ మహారాష్ట్ర కో–ఆపరేటివ్‌‌ బ్యాంక్‌‌ (పీఎంసీ) స్కామ్‌‌ కొత్త మలుపు తీసుకుంది. ఈ బ్యాంకు నష్టాలకు కారకులైన హౌజింగ్‌‌ డెవెలప్‌‌మెంట్‌‌ అండ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ లిమిటెడ్‌‌ (హెచ్‌‌డీఐఎల్‌‌) ప్రమోటర్లు రాకేశ్‌‌ కుమార్‌‌ వాధ్వాన్‌‌, సారంగ్‌‌ వాధ్వాన్‌‌లను ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరికి చెందిన రూ.3,500 కోట్ల విలువైన ఆస్తులనూ అటాచ్‌‌ చేశారు. పీఎంసీ మొండిబాకీలు, నష్టాలు పెరగడానికి కారణమయ్యారంటూ పోలీసులు ఇది వరకే బ్యాంకు మేనేజ్‌‌మెంట్‌‌ మాజీ సభ్యులపై, హెచ్‌‌డీఐఎల్‌‌ ప్రమోటర్లపై ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేశారు. హెచ్‌‌డీఐఎల్‌‌కు రాకేశ్‌‌ ఈడీగా, సారంగ్ ఎండీగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ దేశం విడిచిపారిపోకుండా ప్రభుత్వం ఇది వరకే అన్ని ఎయిర్​పోర్టులను అలెర్ట్​ చేసింది. పీఎంసీ బ్యాంక్‌‌ మాజీ చైర్మన్‌‌ వయమ్‌‌ సింగ్‌‌, మాజీ ఎండీ జాయ్‌‌ థామస్‌‌ల పేర్లు కూడా ఎఫ్‌‌ఐఆర్‌‌లో ఉన్నాయి.   వీరిని శుక్రవారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. వీరికి గురువారం సమన్లు జారీ చేశారు. అయితే ఇన్వెస్టిగేటర్లకు నిందితులు సహకరించకపోవడంతో అరెస్ట్ చేశారు. వాధ్వాన్​లు, వీరి కంపెనీలు పీఎంసీ బ్యాంక్ నుంచి వేల కోట్లలో రుణం తీసుకున్నాయి. అయితే వాటిని తిరిగి చెల్లించలేదు.

73 శాతం అప్పులు హెచ్‌‌డీఐఎల్‌‌కే

పీఎంసీ దగ్గర రూ.8,800 కోట్లు ఉండగా, ఇందులో 73 శాతం డబ్బును పూర్తిగా హెచ్‌‌డీఐఎల్‌‌లకే ఇచ్చేయడంతో పరిస్థితి దివాలా తీసింది.  ముంబైకే చెందిన రియల్‌‌ఎస్టేట్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ హెచ్‌‌డీఐఎల్‌‌  దివాలా  చర్యలు ఎదుర్కొంటోంది.  హెచ్‌‌డీఐఎల్‌‌కు ఇచ్చిన అప్పులు రెండో వంతా లేక మూడో వంతా అనేది పక్కన పెడితే, అసలు ఇచ్చిన అప్పుల మొత్తానికి బ్యాంకు మూలధనానికి పొంతన లేదు. ఇలా అప్పు ఇవ్వడం కేవలం పొరపాటుగా పరిగణించలేము. టాప్‌‌ పొజిషన్స్‌‌లో ఉన్న వ్యక్తుల నిర్లక్ష్యవైఖరే దీనికి కారణమని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. హెచ్‌‌డీఐఎల్‌‌ అప్పులను దాచిపెట్టడానికి పీఎంసీ మేనేజ్‌‌మెంట్‌‌ 21 నకిలీ ఖాతాలను కూడా తెరిచింది. నకిలీ రిపోర్టులూ తయారు చేయించింది.  ఇంత జరుగుతున్నా, పీఎంసీ బోర్డు, ఆడిటర్లు, ఆర్‌‌బీఐలకు ఇంత కాలం తెలియకపోవడం విచిత్రం. ఇండియా రియల్టీ కంపెనీ మార్కెట్‌‌ పరిస్థితి ఏమీ బాగా లేదు. ప్రాపర్టీ డెవలపర్లు దొరికిన చోటల్లా, తలకు మించిన అప్పులు తీసుకున్నారు. ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసి అపార్ట్‌‌మెంట్లు డెలివరీ ఇవ్వలేని స్థితిలో పడిపోయారు. రియల్‌‌ ఎస్టేట్‌‌ డెవలపర్ల ఇబ్బందుల ప్రభావం షాడో బ్యాంకులు (నాన్‌‌ బ్యాంకింగ్‌‌ ఫైనాన్స్‌‌ కంపెనీలు)పై పడింది. దాంతో బిల్డర్లకు ఇచ్చిన అప్పులపై రీఫైనాన్స్‌‌ దొరక్క ఆ షాడో బ్యాంకులు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఐఎల్​ఎఫ్​ఎస్​ దివాలా వల్ల ఇది వరకే ఇవి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాయి.