ఓసీడీకీ ఓ యాప్

ఓసీడీకీ ఓ యాప్

హీరో శర్వానంద్​ నటించిన ‘మహానుభావుడు’ సినిమా చూశారా? అందులో హీరో అతిశుభ్రత పాటించే సీన్లు అందర్నీ నవ్విస్తాయి. అయితే అలాంటివాళ్లు ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. అతిశుభ్రతను పాటించడం జాగ్రత్త అనుకుంటారు కొందరు. కానీ అది ఒక మానసిక సమస్య. దాని పేరు ‘ఆబ్​సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’. దీన్నే షార్ట్​గా ఓసీడీ అని పిలుస్తారు. అదే సమస్యతో బాధపడుతున్న బెంగళూరుకు చెందిన పదహారేళ్ల అమ్మాయి… తనకు,  తనలాంటి బాధితులకు ఉపయోగపడేలా ఒక మొబైల్​ యాప్​ రూపొందించింది. దాంతో సమస్యను తగ్గించుకోవచ్చు అంటున్న అమ్మాయి పేరు ‘కాజల్​ గుప్తా’.

అతిగా చేతులు కడుక్కోవడం, కాలుష్యం బారిన పడతామన్న భయం వెంటాడుతుండటం… లాంటి లక్షణాలు ఓసీడీతో బాధపడే వాళ్లలో కనిపిస్తుంటాయి. అతిగా చేతులు కడుక్కోవడం వల్ల, ఎక్కువగా కెమికల్స్, సోప్స్, హ్యాండ్ వాష్, బ్లీచ్ లాంటివి వాడటం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. అంతేకాదు… మానసిక ఆరోగ్యంపైనా ఇది ప్రభావం చూపిస్తుంది.

తాళం వేశాక అది సరిగ్గా పడిందా లేదా అని మళ్లీ మళ్లీ చూడటం… గ్యాస్‌ స్టవ్‌ కట్టేశామా లేదా అని పదేపదే చెక్​ చేయడం… రాసినదాంట్లో ఏదైనా తప్పు వచ్చిందేమో అని కొట్టేస్తూ రాయడం.. లెక్కపెట్టిన డబ్బులను తిరిగి లెక్కపెట్టడం లాంటివి కూడా ఓసీడీ లక్షణాలే. వీటన్నింటికీ చెక్​ పెట్టాలనుకుంది కాజల్​ గుప్తా. తన యాప్​ ద్వారా బాధితుల్లో మార్పు తేవాలనుకుంది. డాక్టర్​ పలోమీ సాయంతో ఒక మొబైల్​ యాప్​ని తయారు చేసింది. ఆ యాప్​ పేరు ‘Liberate: My OCD Fighter’. ఇది​ ‘గూగుల్​ ప్లేస్టోర్​’లో అందుబాటులో ఉంది.

పరిష్కారం కావాలి….

యాప్​ తయారు చేయాలని ఎందుకు అనిపించిందని అడిగితే… ‘‘ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే నాకు ఓసీడీ ఉంది. నాకు ఉన్న ఒత్తిళ్ల నుంచి బయట పడటానికి థెరపిస్ట్​లు ‘డైరీ’ ఉపయోగించమని చెప్పారు. అప్పట్నించీ నాకు అనిపించిన ప్రతి నెగెటివ్​ ఆలోచన గురించి అందులో రాసేదాన్ని. అలా రాసినవి ఎవరైనా చదువుతారేమో అని ఇంకో రకం ఒత్తిడికి లోనయ్యేదాన్ని. దానివల్ల రాయడం మానేశా. పేపర్ల మీద రాయడం వల్ల సమస్య తీరదని అర్థమైంది. నాకు మొదట్నించీ కోడింగ్​, ఆండ్రాయిడ్​ డెవలప్​మెంట్​పై ఆసక్తి ఉండేది. అందుకే డైరీకి ప్రత్యామ్నాయంగా యాప్​ తేవాలనుకున్నా” అని చెప్పింది కాజల్ గుప్తా.​.

మొబైల్ యాప్లో

తనలా ఓసీడీతో బాధపడుతున్న వాళ్లు ప్రపంచవ్యాప్తంగా చాలామందే ఉన్నట్లు డాక్టర్ల ద్వారా తెలుసుకుంది కాజల్​. అయితే డైరీ రాయడం వల్ల ఈ సమస్యకు కొంత పరిష్కారం కచ్చితంగా దొరుకుతుందని అర్థమైంది ఆమెకి. కానీ ఈ రోజుల్లో డైరీ రాసే అలవాటు చాలా తక్కువమందికి ఉంది. అయితే దాన్ని వాళ్లతో పాటు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లలేరు కదా అనుకుంది. అందుకే ఇరవై నాలుగు గంటలూ ఫోన్లు పట్టుకుని తిరిగే జనాలకు, మొబైల్​ యాప్​ అయితే కరెక్ట్​ అనుకుంది. ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

యాప్అన్నింటికీ సేఫ్

‘లిబరేట్​ – మై ఓసీడీ ఫైటర్​ (Liberate: My OCD Fighter)’ యాప్​ని ఓసీడీ బాధితులు చాలా సులువుగా వాడుకోవచ్చు. ఇదొక సెల్ఫ్​ హెల్ప్​ యాప్​. అంటే ఎవరికి వాళ్లు తమ సమస్యను అర్థం చేసుకోవడంతో పాటు పరిష్కారాన్ని కూడా వెతుక్కోవచ్చు. అలాగే వేరేవాళ్లు చూస్తారేమో, తమ సమస్య గురించి అవతలి వాళ్లకు తెలిసిపోతుందేమో అనే భయం ఉండదు. ఈ యాప్​​ గతేడాది నవంబర్​ నెల నుంచి ‘గూగుల్​ ప్లేస్టోర్’​లో అందుబాటులోకి వచ్చింది. ఇండియా, అమెరికాలో కలిపి మొత్తం ఇప్పటివరకు వెయ్యికి పైగా డౌన్​లోడ్​లు అయ్యాయి. త్వరలో ‘ఐఓఎస్​’లో కూడా అందుబాటులోకి రానుంది.

ప్యానిక్బటన్ చాలా స్పెషల్

ఇందులో ‘ప్యానిక్​’ బటన్​ అని ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరికైనా బాగా కంగారు, భయం వేసినప్పుడు ఆ బటన్​ నొక్కాలి. అది వెంటనే బాధితుల తల్లిదండ్రులకో, స్నేహితులకో ఫోన్​ చేయదు. ఎవరో తెలియని సైకాలజిస్ట్​కి ఆ కాల్​ వెళ్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్లకు తెలియకుండానే, వాళ్ల ద్వారా సలహాలు తీసుకోవచ్చు. అప్పుడు భయాందోళనలు దూరమై మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ యాప్​ తనకు ఎంతగానో ఉపయోగపడుతోందని ‘దుర్గా నిత్తూర్​’ అనే బెంగళూరుకు చెందిన గోల్ఫ్​ ప్లేయర్​ చాలా సంతోషంగా చెప్తోంది. ఇలాంటి వాళ్లు ఎంతోమంది ఆ యాప్​లో రివ్యూలు పెడుతున్నారు.

క్లినికల్ ట్రయల్లో ఉంది

కాజల్​ తన యాప్​కి సంబంధించి బెంగళూరులోని ‘నేషనల్​ ఇని​స్టిట్యూట్​ ఆఫ్​ మెంటల్​ హెల్త్​ అండ్​ న్యూరో సైన్సెస్​’కు ప్రపోజల్​ పంపింది. అక్కడున్న ఓసీడీ క్లినిక్​లో ట్రయల్స్​ నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది. వాళ్ల ప్రపోజల్​కి రివ్యూ వస్తే, వ్యాధికి సంబంధించి అనేక కొత్త విషయాలు, నివారణా మార్గాలు, సమస్యకు పరిష్కారాలు యాప్​ యూజర్లకు అందుతాయి.