
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రద్దీ కారణంగా బస్‌బే, ధర్మ దర్శన, ప్రత్యేక దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. స్వామి వారి దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది.
ఆలయంలో నిర్వహించిన నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం భక్తులు జరిపించిన నిత్య పూజలు, కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.58,05,696 ఆదాయం వచ్చింది. ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ.19,89,310, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6.66 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.11.25 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.5,49,300 ఇన్‌కం వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు.
లక్ష్మీనారసింహుడిని ఆదివారం ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ సురేంద్రమోహన్ ఫ్యామిలీతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ ఉపప్రధానార్చకులు మాధవాచార్యులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ ఏఈవో రమేశ్ బాబు, సూపరింటెండెంట్ రాజన్‌బాబు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.