
- ధర్మదర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట టైం
- ఆదివారం ఆలయానికి రూ.57.28 లక్షల ఆదాయం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తుల కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. బస్‌బే, ధర్మదర్శన, ప్రత్యేక దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపాలు సందడిగా కనిపించాయి. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట టైం పట్టింది.
ఆలయంలో నిర్వహించిన నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే భక్తులు జరిపించిన నిత్య పూజలు, కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.57,28,842 ఆదాయం వచ్చింది.
ప్రసాద విక్రయం ద్వారా రూ.16,20,640, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.5.86 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.9 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.5,27,400 ఇన్‌కం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరో వైపు తొలి ఏకాదశి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపం స్వామి అమ్మవార్లను అధిష్ఠింపజేసి లక్ష పుష్పార్చన జరిపారు.