తిరుమలలో భారీ వర్షం..చలిగాలులతో భక్తుల ఇబ్బందులు..

తిరుమలలో భారీ వర్షం..చలిగాలులతో భక్తుల ఇబ్బందులు..

తిరుమలలో భారీ వర్షం కురిసింది. సోమవారం ( నవంబర్ 17 ) రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి భక్తులు తీవ్ర ఇబబందులు పడుతున్నారు. దర్శనానికి వెళ్లే భక్తులు, దర్శనం అయ్యాక బయటికి వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు. భారీ వర్షానికి తోడు చలిగాలుల తీవ్రత పెరగడంతో అద్దె గదులు దొరకని భక్తులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వృద్దులు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు.

చలిగాలుల తీవ్రత పెరగడంతో చాలామంది భక్తులు గదుల నుంచి బయటికి కూడా రావడం లేదు. దీంతో అద్దె గదులు ఖాళీ అవ్వక పెద్ద ఎత్తున భక్తులు గదుల కోసం వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా... వర్షం కురిసే సమయంలో తిరుమల కొండలు మరింత అందంగా కనిపించాయి. ఈ దృశ్యాలు చూసి పరవశించిపోయారు భక్తులు. వర్షంలో తిరుమల కొండల అందాలను తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు భక్తులు.

ఇదిలా ఉండగా..  కలియుగ వైకుంఠం తిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల కలకలం రేగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ లెటర్లు చలామణి కావడం కలకలం రేపింది. ఈ క్రమంలో విజయవాడ పోలీసులను ఆశ్రయించారు మంత్రి పీఏ. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల పలువురు భక్తులు దళారుల నుంచి మంత్రి సత్యకుమార్ పేరుతో ఉన్న టీటీడీ లెటర్లు కొన్నారు. అనంతరం తిరుమల దర్శనానికి వెళ్లగా.. ఆ లెటర్లు నకిలీవి అని టీటీడీ అధికారులు తెలిపారు.