- నాగర్కర్నూల్లో రెండు గంటలు కుండపోత
- జలమయమైన లోతట్టు ప్రాంతాలు
నాగర్కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లు, పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బైక్లు, స్కూటర్లు కొట్టుకుపోయాయి. దాదాపు 3 గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఏకధాటిగా రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది.
టీచర్స్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, రాంనగర్, నేషనల్ హైస్కూల్ బ్యాక్ స్ట్రీట్తో పాటు పట్టణంలోని అనేక కాలనీల్లో ఇళ్లలోకి వరద నీళ్లు చేరాయి. ఉయ్యాలవాడ నుంచి ఎన్జీవో కాలనీ మీదుగా పట్టణంలోకి వచ్చే మెయిన్ రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి.ఎలక్ట్రిక్ బస్సులకు వరద నీటితో నష్టం కలుగుతుందని రోడ్డు మీద నిలిపేశారు. నేషనల్ హైస్కూల్, ఐటీఐ, జూనియర్ కాలేజీ, జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లు వరద నీటితో నిండిపోయాయి.
కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో వరద నీరు చేరి ఇబ్బందిపడ్డారు. ఎల్లికల్ రోడ్డులో పాత కాజ్వే మీదుగా వర్షపు ప్రవహించడంతో బైక్లు,ఆటోలు నిలిచిపోయాయి. వెల్డంద మండలం తిమ్మినోనిపల్లెలో రైతు లింగమయ్యకు చెందిన మూడు జెర్సీ ఆవులు పిడుగుపాటుకు మృత్యవాత పడ్డాయి. వంగూరు, చారకొండ మండలాల్లోని తురకలపల్లి తదితర గ్రామాల్లో కాలనీలు జలమయమయ్యాయి. అచ్చంపేట, బల్మూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అచ్చంపేట పట్టణంలోని ఆదర్శనగర్, సాయి నగర్ కాలనీలు జలమయమయ్యాయి.
