
- పలు పంటలు నీటిపాలు..
- ఆయా గ్రామాలకు ఆగిన రాకపోకలు
నెట్వర్క్, వెలుగు : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా ముసురు కురుస్తూనే ఉంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం దంచికొట్టింది. మణుగూరుతో పాటు కరకగూడెం, గుండాల, దుమ్ముగూడెం, కరకగూడెం, గుండాల, టేకులపల్లి, పినపాక, అశ్వాపురం, ఆళ్లపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. మణుగూరు టౌన్ జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. కోడిపుంజుల వాగు, మొట్ల వాగు, ఎదుళ్ళ వాగు పొంగిపొర్లి అశోక్ నగర్, ఆదర్శనగర్, శ్రీశ్రీ నగర్, భగత్ సింగ్ నగర్, సుందరయ్య నగర్, వినాయక నగర్ ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం రాత్రి నుంచి తహసీల్దార్ నరేశ్, సీఐ నాగబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
బుధవారంవరద పరిస్థితిని ఆర్డీవో దామోదర్ మణుగూరుకు చేరుకొని పరిశీలించారు. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మారుమూల గ్రామాలకు రాకపోకలు ఆగాయి. కొత్తగూడెం నుంచి హేమచంద్రాపురం బైపాస్ రోడ్డులో గుంతలతో ఏర్పడిన రహదారిపై గ్రామస్తులు నిరసన తెలిపారు. గుంతల పూడ్చాలని డిమాండ్ చేశారు. ఎగువన ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు తాలిపేరు రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతోంది. బుధవారం15 గేట్లను ఎత్తి 28వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.తాలిపేరుతో పాటు చింతవాగు, పగిడివాగు, రోటెంత వాగు, రాళ్ల వాగు, ఈతవాగులు పొంగిపొర్లుతున్నాయి. తేగడ వద్ద తాలిపేరు వరదతో లోలెవల్ చప్టా నీటమునిగింది.
వెంకటాపురం మండలం ఏకన్నగూడెం వాగు పొంగడంతో భద్రాచలం--వెంకటాపురం మధ్య రాకపోకలు నిలిపేశారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద సీతవాగు పొంగి నారచీరలు, సీతమ్మవారి విగ్రహం మునిగాయి. దుమ్ముగూడెం కాటన్ ఆనకట్ట వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి స్వల్పంగా పెరుగుతోంది. 19 అడుగుల వద్ద 1.60లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. మరో మూడు రోజుల పాటు వానలు విస్తారంగా కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మన్యంలోని గిరిజన గ్రామాలు బెంబేలెత్తుతున్నాయి.
ఆళ్లపల్లి, కొత్తగూడెం మధ్య పుణ్యపువాగు ఉధృతంగా పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోతుండగా ప్రయాణికులు కాపాడి కొత్తగూడెం బస్సు ఎక్కించారు. ఖమ్మం సిటీలోని మున్నేరు ఎగువన కురిసే వర్షాలకు వరద ఉధృతి క్రమక్రమేన పెరుగుతోంది. రంగనాయకుల గుట్ట, ప్రకాశ్ నగర్ , దానవాయిగూడెం ఏరియాలలో ఉన్న మున్నేరు చాప్ట ల పైనుంచి వరద పరవళ్లు తొక్కుతోంది. కారేపల్లి మండలం చర్లపల్లి సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జిలో చేరిన వరద నీటిలో ఓ కారు మునిగిపోగా స్థానికులు తాళ్ల సహాయంతో బయటికి తీశారు. పాలేరు రిజర్వాయర్ వరద నీటితో క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది.
మంగళ, బుధవారాల్లో వర్షపాతం వివరాలు..
మండలం మంగళవారం బుధవారం
(మి.మీటర్లలో) (మి.మీటర్లలో)
మణుగూరు 128.8 70.0
కరకగూడెం 101.8 65.3
పినపాక 81.5 33.8
టేకులపల్లి 79.5 6.0
గుండాల 79.3 32.8
ఇల్లెందు 42.3 6.8
అశ్వాపురం 40.8 36.5
దుమ్ముగూడెం 25.3 49.0
ఆళ్లపల్లి 52.5 25.5