
- నా గెలుపు కోసం అల్లుడు ప్రచారం చేస్తాడు
- బన్నీ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి
- నల్గొండలో కంచర్ల కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించిన హీరో అల్లు అర్జున్
నల్గొండ : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నాగార్జునసాగర్ నుంచి పోటీ చేస్తానని, తన గెలుపు కోసం బన్నీ ప్రచారం చేస్తాడని హీరో అల్లు అర్జున్ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్ధమవుతున్న వేళ చంద్రశేఖర్ వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయంగా మారాయి. మామయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నల్గొండలో నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఊరికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న తన మామయ్యకు బన్నీ ధన్యవాదాలు చెప్పారు. తాను అభిమానులను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానన్నారు. అల్లు అర్జున్ తమ ప్రాంతానికి రావడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. గజమాలతో స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి నల్గొండ కు చెందిన బీఆర్ఎస్ నాయకులెవరూ రాకపోవడం గమనార్హం.