
- జగిత్యాల జిల్లాలో ముసురు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం దంచికొట్టింది. ధర్మపురి తో పాటు మండలంలోని రాయపట్నం గోదారి వద్ద భారీగా నీటిమట్టం పెరగడంతో కలెక్టర్ సత్య ప్రసాద్ శనివారం తీర ప్రాంతాలను పరిశీలించారు. నేరెళ్ల గుట్ట వద్ద వంతెన మునగడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. శనివారం కురిసిన భారీ వర్షంతో పంటలు నీట మునిగాయి. సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో కలెక్టర్ సత్యప్రసాద్ గ్రామంలోని గంగమ్మ చెరువు వరద ఉధృతితో భీమ్ రెడ్డి గూడెం వాసులకు రాకపోకలు నిలిచిపోగా కలెక్టర్ గంగమ్మ చెరువును పరిశీలించారు.
రాయికల్, వెలుగు: రాయికల్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు కురిసిన భారీ వర్షంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు చేరి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. రాయికల్, మైతాపూర్, రాయికల్, ఇటిక్యాల, మూటపెల్లి, కొత్తపేట, వస్తాపూర్, ఆలూర్ తదితర గ్రామాల్లో వర్షాల వల్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తహసీల్దార్ ఉదయ్‌కుమార్, ఆర్ఐలు పద్మయ్య, దేవదాస్‌లు ప్రజలను అప్రమత్తం చేశారు.
గోదావరిఖని, వెలుగు: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో కాలనీలను వరద నీరు ముంచెత్తింది. పోరట్‌పల్లి, జంగాలపల్లి, మార్కండేయ కాలనీలోని వీధుల్లో వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మల్కాపూర్ లోతట్టు ప్రాంతాలలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అధికారులను ఆదేశించారు.