పాలమూరు ఎంపీ సీటు​పై కాంగ్రెస్​ ఫోకస్​ .. సెగ్మెంట్​ ఇన్​చార్జిగా సీఎం రేవంత్​రెడ్డి

పాలమూరు ఎంపీ సీటు​పై కాంగ్రెస్​ ఫోకస్​ .. సెగ్మెంట్​ ఇన్​చార్జిగా సీఎం రేవంత్​రెడ్డి
  • అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్​ క్లీన్​ స్వీప్​
  • సీఎం నేతృత్యం వహిస్తుండడంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన మహబూబ్​నగర్​ స్థానం

మహబూబ్​నగర్, వెలుగు: పార్లమెంట్​ స్థానాలపై కాంగ్రెస్​ పార్టీ హైకమాండ్​ ఫోకస్​ పెట్టింది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్లకు ఇన్​చార్జీలను నియమించింది. మహబూబ్​నగర్​ పార్లమెంట్​కు ఇదే జిల్లాకు చెందిన సీఎం రేవంత్​రెడ్డికి ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించింది. చేవెళ్ల పార్లమెంట్​కు కూడా రేవంత్​కే బాధ్యతలు అప్పగించడంతో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్​ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

పక్కా ప్లాన్ తో..

వచ్చే ఏడాది పార్లమెంట్​ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి లేదా ఏప్రిల్​లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను దక్కించుకొనే ప్రయత్నంలో ఉన్నాయి. అయితే కాంగ్రెస్​ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి అధికారాన్ని దక్కించుకుంది. అదే జోష్​ను పార్లమెంట్​ ఎన్నికల్లోనూ కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా మంత్రులకు పార్లమెంట్​ బాధ్యతలు అప్పగిస్తూ ఆ పార్టీ హైకమాండ్​ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 17 ఎంపీ​స్థానాలుండగా, మంత్రులు ఒక్కో పార్లమెంట్​ బాధ్యతలు అప్పగించింది. సీఎం, డిప్యూటీ సీఎంకు రెండేసి పార్లమెంట్​ స్థానాల చొప్పున బాధ్యతలను స్వీకరించారు. ఇందులో సీఎం రేవంత్​రెడ్డికి సొంత జిల్లా అయిన మహబూబ్​నగర్​తో పాటు చేవెళ్ల పార్లమెంట్​ బాధ్యతలను హైకమాండ్​ అప్పగించింది. దీంతో ఈ రెండు స్థానాలపై జోరుగా చర్చ సాగుతోంది.

ఇందులో మహబూబ్​నగర్​ స్థానంలో 2004 తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్​ పార్టీ గెలవలేదు. చివరి సారిగా కాంగ్రెస్​ నుంచి డి.విఠల్​రావు ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్​ నుంచి కేసీఆర్, 2014లో ఇదే పార్టీ నుంచి ఏపీ జితేందర్​ రెడ్డి, 2019లో ఇదే పార్టీ నుంచి మన్నే శ్రీనివాస్​ రెడ్డి గెలుపొందారు.​ అయితే, ఈ సారి ఈ స్థానాన్ని కాంగ్రెస్​ ఖాతాలో వేసుకునేందుకు ఏకంగా సీఎం రంగంలోకి దిగనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలే..

పాలమూరు పార్లమెంట్​ పరిధిలో మహబూబ్​నగర్, జడ్చర్ల, షాద్​నగర్, మక్తల్, నారాయణపేట, కొడంగల్, దేవరకద్ర అసెంబ్లీ స్థానాలున్నాయి. గత నెల 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లో బీఆర్ఎస్​ సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. అన్ని స్థానాల్లో కాంగ్రెస్​ క్యాండిడేట్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ పార్లమెంట్​ మొత్తాన్ని కాంగ్రెస్​ క్లీన్​ స్వీప్​ చేసింది. దీనికితోడు ఈ ఏడు స్థానాల్లో కాంగ్రెస్​ ఓటింగ్​ శాతం డబుల్​ అయ్యింది.

నారాయణపేట అసెంబ్లీలో కాంగ్రెస్​కు రికార్డు స్థాయిలో 46.31 శాతం ఓట్లు పోల్​ అయ్యాయి. మహబూబ్​నగర్​లో 48.08 శాతం, జడ్చర్లలో 50.03 శాతం, దేవరకద్రలో 45.31 శాతం, మక్తల్​లో 39.88 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఓట్ల పర్సంటేజీ పెరగడంతో పాటు కాంగ్రెస్​ రూలింగ్​లో ఉండడంతో ఈ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. పైగా సీఎం సొంత జిల్లా కావడం, ఆయనే ఈ పార్లమెంట్​కు ఇన్​చార్జి కావడంతో ఇక్కడ కాంగ్రెస్​కు గెలుపోటములు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి.

ఆరు సార్లు కాంగ్రెస్​దే..

ఇప్పటి వరకు మహబూబ్​నగర్​ పార్లమెంట్​ స్థానానికి 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా ఆరు సార్లు కాంగ్రెస్​ పార్టీ, నాలుగు సార్లు బీఆర్ఎస్​ పార్టీలు కైవసం చేసుకున్నాయి. మల్లికార్జున్​ పాలమూరు ఎంపీగా ఎక్కువ సార్లు గెలిచారు. ఈయన 1980లో మొదటి సారిగా ఎంపీగా గెలుపొందారు. 1984లో జరిగిన ఎన్నికలో సూదిని జైపాల్​రెడ్డి గెలిచారు. ఆ తర్వాత 1989, 1991, 1996లో జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో మల్లికార్జున్​ ఎంపీగా హ్యాట్రిక్​ విజయాలు నమోదు చేశారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్​ పార్టీ  పాలమూరు పార్లమెంట్​ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.