మళ్లీ వరద ముంపేనా .. ఇంకా పెండింగ్ లోనే ఫేజ్ –1 నాలాల పనులు

మళ్లీ వరద ముంపేనా .. ఇంకా పెండింగ్ లోనే  ఫేజ్ –1 నాలాల పనులు

వచ్చే వానాకాలంలోపు కంప్లీట్ చేయడం కష్టమే 
అధికారుల నిర్లక్ష్యంపై కమిషనర్ సీరియస్
ఫేజ్–2 కు అనుమతిస్తేనే వరద ముంపునకు శాశ్వత చెక్

హైదరాబాద్, వెలుగు : వానాకాలం వస్తే.. సిటీలో మళ్లీ వరద ముంపు తప్పేలా లేదు. ఏండ్లుగా ముంపు బాధితుల కష్టాలు ఈసారి కూడా తొలగేలా కనిపించడంలేదు. ఇటీవల జరిగిన ఒక మీటింగ్ లో ముంపు ప్రాంతాల్లో కొనసాగే నాలాల పనులపై జీహెచ్ఎంసీ అధికారులపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వచ్చే వానాకాలంలోపు పెండింగ్ పనులు పూర్తి చేయకపోతే చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. 

స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రాం(ఎస్ఎన్ డీ పీ) ఫేజ్ –-1లో భాగంగా రూ. 737.45 కోట్లతో  37 నాలాల నిర్మాణం చేపట్టారు. ఇందులో 31 చోట్ల పనులు కంప్లీట్ అయ్యాయి. మిగతా 6 చోట్ల ఇంకా కొనసాగుతుండగా.. ఇప్పట్లో పూర్తి అయ్యేలా లేదు.  కుత్బుల్లాపూర్ లోని ఓక్షిత్ కాలనీ, హిమాయత్ నగర్ స్ర్టీట్ నంబర్.14, స్ర్టీట్ నంబర్ .18, బేగంపేట్‌ లోని మయూరీ మార్గ్, మల్కాజిగిరిలోని సఫిల్ కాలనీ, నాగోల్ లోని అయ్యప్ప కాలనీ, టోలిచౌకిలోని నదీంకాలనీ, షేక్ పేట్ లోని ఓయూ కాలనీ తదితర పలు ప్రాంతాల్లో వరద ముంపు పనులు ఇంకా పూర్తి చేయలేదు.  

సెకండ్ ఫేజ్ కు పర్మిషన్ ఇస్తే.. 

మూడేండ్ల కిందట ఎస్ఎన్డీపీ ఫేజ్ –1లో 37 ప్రాంతాల్లో పనులను చేపట్టారు.  వీటి పనులు కొనసాగుతుండగాటనే  ఫేజ్ –2లో భాగంగా మరో రూ.1000  కోట్లతో 70 నాలాల పనులు చేపట్టాలని అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపారు.  దీనిపై గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదు. ఫేజ్ –1తోనే సరిపెట్టింది.  కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే లోపే ఎన్నికల కోడ్ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన మీటింగ్ లోనూ నాలాల పనులపై బల్దియా ఉన్నతాధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఎన్నికలు అయ్యాక ఏదో ఒక నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. మొత్తానికి సెకండ్ ఫేజ్ కు అనుమతి ఇస్తే.. నిధులు మంజూరైతే వరద ముంపు ప్రాంతాల్లో నాలాలు, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం చేపడితే.. ముంపు వాసులకు విముక్తి లభించనుంది. 

వాటర్ లాగింగ్ పాయింట్లపైనా నో ఫోకస్  

సిటీలో వానలు పడ్డప్పుడు రోడ్లపై నీళ్లు నిలిచే వాటర్ లాగింగ్ పాయింట్లపై కూడా జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టడంలేదు. రోడ్లపై వరదనీరు చేరినప్పుడే హడావిడి చేస్తుంటారు. ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. సిటీలో మొత్తం 122 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇందులో 23 పాయింట్లలోనే పనులు చేసి శాశ్వత పరిష్కారం చూపినట్టు చెప్పారు.  

పంజాగుట్టలోని ఎన్‌ఎఫ్‌సీఎల్‌ ఫ్లై ఓవర్, రాజ్‌భవన్‌రోడ్‌,  బేగంపేట్‌లోని యాక్సిస్‌ బ్యాంక్‌, సైఫాబాద్‌లోని షాదన్ కాలేజ్‌, నాంపల్లిలోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్ జంక్షన్‌, సికింద్రాబాద్‌లోని  రైల్  నిలయం జంక్షన్, చాదర్‌‌ఘాట్ రైల్వే ఆర్‌‌ఓబీ, బంజారాహిల్స్‌లోని రోడ్‌నంబర్‌‌.12  పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వంటి తదితర‌ ప్రాంతాలు మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లు కాగా.. వానలు పడ్డ ప్రతిసారి జీహెచ్ఎంసీకి వచ్చే కంప్లయింట్స్ లో సగానికిపైగా ఇలాంటి వాటిపైనే ఉంటాయి.  

 డీఆర్ఎఫ్ పైనే భారమంతా..

సిటీలో వాన పడితే చాలు.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్(డీఆర్ఎఫ్) చూసుకుంటుందని జీహెచ్ఎంసీ అధికారులు వరద పనుల్లో సాయం చేయడంలేదు. బల్దియాలో డీఆర్ఎఫ్ ఒక విభాగమైనా సర్కిల్, జోనల్ స్థాయి అధికారులు ఎలాంటి సహకారం అందించరు. డీఆర్ఎఫ్ వద్ద 450 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఎక్కడైనా ఎమర్జెన్సీ రెస్క్యూ అయినా వీరే వెళ్లి చూసుకోవాల్సి ఉంటుంది. కనీసం సర్కిల్, జోనల్ అధికారులు మాన్ సూన్  టీమ్స్ నైనా సపోర్టు పంపించరు. తమకేమీ పట్టనట్టుగా బల్దియా అధికారులు వ్యవహరిస్తుండడమే కాకుండా మాన్ సూన్ కు ముందైనా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. 

అధికారులపై కమిషనర్ సీరియస్ 

ఇటీవల జరిగిన ఓ సమావేశంలో కుత్బుల్లా పూర్ లో వరద సమస్యలపై చేపట్టిన పనులను పూర్తి చేయకపోవడంతో అధికారులపై కమిషనర్ రోనాల్డ్ రాస్ సీరియస్ అయ్యారు. టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తే ఎందుకు చేయలేదని నిలదీశారు. ఎస్ఈ ల పై తీవ్రంగా మండిపడ్డారు. స్థానికుల నుంచి అడ్డంకులు వస్తున్నాయని కమిషనర్ కు అధికారులు చెప్పారు.  అడ్డుకునే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.  పనులు డిలే అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.