నెహ్రూ హిమాలయాలంత పెద్ద తప్పు చేశారు

నెహ్రూ హిమాలయాలంత పెద్ద తప్పు చేశారు
  • నాటి సీజ్ ఫైర్ ఒప్పందం వల్లే పీవోకే ఏర్పడింది
  • 1948లో యూఎన్ కు వెళ్లడం ఘోర తప్పిదం: అమిత్ షా

న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో భారత తొలి ప్రధాని నెహ్రూ నిర్ణయాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో షా మాట్లాడారు. స్వాతంత్ర్యం తర్వాత కశ్మీర్ ను ఆక్రమించుకునేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని మన ఆర్మీ తిప్పికొట్టినా కూడా నెహ్రూ సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నారని, దాని వల్లే పీవోకే ఏర్పడిందని అన్నారు. ఆ విషయంపై 1948లో ఆయన ఐక్యరాజ్య సమితికి వెళ్లి హిమాలయాలంత పెద్ద తప్పు చేశారన్నారు. పాక్ పై ఫిర్యాదుకు యూఎన్ లో సరైన చార్టర్ ను ఎంచుకోకపోవడం ఆయన చేసిన మరో పెద్ద తప్పు అని అమిత్ షా అన్నారు.

తప్పులు చేసినోళ్లే చరిత్ర రాశారు

కశ్మీర్, ఆర్టికల్ 370 విషయంలో నేటికీ అనేక పుకార్లు జనాల మధ్య ఉన్నాయని, వాటిని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉందని అమిత్ షా అన్నారు. 1947 నుంచీ కశ్మీర్ వివాదాస్పద అంశంగా ఉందని, అయితే దాని చరిత్రను అప్పట్లోనే వక్రీకరించి ప్రజల్లోకి తెచ్చారని ఆరోపించారు. దీనికి కారణం తప్పులు చేసినోళ్లే చరిత్రను రాయడమని, వాళ్లు కావాలనే వాస్తవాలను దాచేశారని షా అన్నారు. చరిత్రను సరి చేసి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు.

ఈ హ్యూమన్ రైట్స్ చాంపియన్స్ ఏమయ్యారు?

కశ్మీర్లో హక్కులను కాలరాస్తున్నారంటూ ఆందోళన చేస్తున్న మేధావులపైనా కేంద్ర మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్లో సూఫీ ముస్లిం సంస్కృతిని నాశనం చేసిన నాడు ఈ హ్యూమన్ రైట్స్ చాంపియన్స్ ఏమయ్యారని ప్రశ్నించారు. కశ్మీరీ పండిట్లను లోయ నుంచి వెళ్లగొట్టినప్పుడు వీరంతా ఎక్కడ ఉన్నారని నిలదీశారు. ఇన్నాళ్లు ఆర్టికల్ 370 వల్లే కశ్మీర్ ఎన్నో ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొందని షా అన్నారు.

కశ్మీర్ అభివృద్ధికి కృషి

కశ్మీర్ అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. జమ్ము కశ్మీర్లో పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామన్నారు. 40 వేల మంది గ్రామ ప్రధాన్ లు క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నారని చెప్పారాయన. మరో నాలుగైదు రోజుల్లోనే తెహ్సీల్, జిల్లా పంచాయత్ ఎన్నికలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మూడంచెల పంచాయతీ వ్యవస్థ పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.