ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాల ఇవ్వొచ్చు : సుప్రీంకోర్టు

ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాల ఇవ్వొచ్చు : సుప్రీంకోర్టు

అమరావతిలోని ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.   ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ మొత్తం వ్యవహారం హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం చేస్తున్న పట్టాల పంపిణీ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

అమరావతి పరిధిలో పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50 వేల మందికి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని పైన ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అక్కడ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో, మే18న ముఖ్యమంత్రి జగన్ అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి ముహూర్తంగా నిర్ణయించారు.

అయితే  హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్ -5 జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని రైతులు తమ పిటిషన్ లో  కోరారు.అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందని రైతులు సుప్రీం కోర్టుకు తెలిపారు. దీని పైన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇంటి స్థలాలు ఇవ్వచ్చని చెబుతూనే హైకోర్టు తుది తీర్పుకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.