మంచి హెల్త్​ పాలసీ తీసుకోవడం ఇలా..

మంచి హెల్త్​ పాలసీ తీసుకోవడం ఇలా..

బిజినెస్​ డెస్క్​, వెలుగు : కరోనా తరువాత జనం ఆస్పత్రులకు క్యూ కట్టడం మరింత పెరిగింది. రోగాలు ఎక్కువయ్యాయి. అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడితే జేబుపై భారం భారీగా ఉంటోంది. ఇలాంటి ఖర్చులు వచ్చినప్పుడు కొన్నిసార్లు అప్పులూ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అందుకే..  వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆరోగ్య బీమాలో పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. మార్కెట్లో ఆరోగ్య బీమా పాలసీలకు,  ప్లాన్‌‌‌‌లకు కొరత లేదు. ఇన్ని రకాల పాలసీల్లో ఏదో ఒక దానిని ఎంచుకోవడం కాస్త కష్టమే! మీ ఆరోగ్య బీమా ప్లాన్ నుంచి ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి, సంబంధిత పాలసీలను  పోల్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలి. హెల్త్ ప్లాన్‌‌లో పెట్టుబడి పెట్టే ముందు చూడాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

ఎవరి కోసం లేదా దేని కోసం ?

మీరు ఎవరి కోసం హెల్త్​ కవరేజీని కోరుకుంటున్నారనేది అన్నింటికంటే ముఖ్యమైన విషయం. దీని ఆధారంగా ‘పర్సనల్​’, ‘ఫ్యామిలీ ఫ్లోటర్’, ‘సీనియర్ సిటిజన్’ హెల్త్ ప్లాన్‌‌లలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. అంతేగాక బీమా కింద ఏయే వ్యాధులు కవర్ కావాలో కూడా ముందే చూసుకోవాలి. నిర్దిష్ట ఆరోగ్య పరిస్థితులు.. అంటే బీపీ, షుగర్​, కేన్సర్​ వంటి వాటి కోసం ప్రత్యేక పాలసీలను ఎంచుకోవచ్చు. దీనివల్ల జేబుపై ఎక్కువ భారం ఉండదు. పాలసీ తీసుకోవడానికి ముందే ఉన్న రోగాల ట్రీట్​మెంట్ ఖర్చులను భరించడానికి కొన్ని కంపెనీలు తిరస్కరిస్తాయి. మరికొన్ని కంపెనీలు రెండుమూడేళ్ల వరకు సమయం అడిగే అవకాశాలు ఉంటాయి. 

డబ్బు సంగతీ చూడండి

మీ ప్రాంతంలో  సగటు వైద్య ఖర్చులు  మీ ఆదాయంలో ఎంత ఉంటాయో లెక్కేయండి.  మీరు భరించలేని లేదా అధిక మొత్తం గల ప్రీమియం  ప్లాన్‌‌ను కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది తప్ప అదనంగా లాభాలు ఏమీ ఉండవు.  మీ ఆర్థిక పరిస్థితిని బట్టే ప్లాన్,  బీమా మొత్తాన్ని, టాప్-అప్‌‌లను,  సూపర్ టాప్-అప్‌‌లను ఎంచుకోవాలని బీమారంగ ఎక్స్​పర్టులు చెబుతున్నారు. 

సరైన బీమా మొత్తాన్ని ఎంచుకోండి

ఆసుపత్రిలో చేరిన సందర్భంలో ఒక ఏడాదిలో గరిష్టంగా చెల్లించగల మొత్తం  విలువను బీమా పాలసీ ఇచ్చేటప్పుడే   కంపెనీలు చెబుతాయి.  బీమా చేసిన మొత్తానికి మించిన ఖర్చులను బీమా కంపెనీ భరించదు. పాలసీ ఉన్న ప్రతి ఒక్కరికీ ఆశించిన వైద్య ఖర్చులను  కవర్ చేసే బీమా పాలసీ ఉండటం తప్పనిసరి. అయితే, అధిక బీమా మొత్తం అధిక ప్రీమియంతోనే వస్తుంది. ఆర్థిక స్థోమత సమస్య అయితే, కవరేజ్ పరిమితిని పెంచడానికి టాప్-అప్ లేదా సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌‌లకు వెళ్లడం మంచి నిర్ణయం.

రైడర్లను తీసుకోవచ్చు

తక్కువ మొత్తంలో ప్రీమియంతో మీ పాలసీ తీసుకున్నప్పటికీ, దాని  కవరేజ్ పరిధిని పెంచేందుకు రైడర్లను ఉపయోగించుకోవచ్చు. బాగా జనాదరణ పొందిన రైడర్‌‌లలో వ్యక్తిగత ప్రమాద కవర్, క్రిటికల్​ కేర్​ రైడర్‌‌ వంటివి ఉన్నాయి. ఇందుకు అదనంగా డబ్బు కట్టాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. 

మరింత ఈజీగా ఇన్సూరెన్స్​ బిజినెస్

బీమా వ్యాపారం కోసం కంపెనీలకు ఎంట్రీ నిబంధనలను ఈజీ చేసినట్టు  ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్​డీఏఐ ప్రకటించింది. సాల్వెన్సీ మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించింది. దేశంలో బీమా వ్యాప్తిని పెంచడంతోపాటు '2047 నాటికి అందరికీ బీమా' టార్గెట్​ను చేరుకోవడానికి ఈ నిర్ణయాలు తీసుకుంది.  బీమా కంపెనీలకు రూ. 3,500 కోట్ల విలువైన మూలధనం ఉండాలన్న రూల్​ను రద్దు చేసింది. ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) నిధులను నేరుగా బీమా కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ప్రతిపాదనను ఆమోదించింది.  బీమా కంపెనీల ప్రమోటర్లుగా అనుబంధ కంపెనీలు ఉండటాన్ని అనుమతించింది. ఈక్విటీ డైల్యూషన్​కు కూడా గ్రీన్ సిగ్నల్​ ఇచ్చింది.  అంటే సింగిల్​ ఎంటిటీ పెయిడప్​ క్యాపిటల్​లో 25 శాతం పెట్టినా ఇన్వెస్టర్​గా గుర్తిస్తారు. అంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే ప్రమోటర్​గా పరిగణిస్తారు.  ప్రమోటర్లు కంపెనీలో తమ వాటాను 26 శాతం వరకు తగ్గించుకోవచ్చు. బీమా సంస్థ 5 సంవత్సరాలకు ముందు సంతృప్తికరమైన సాల్వెన్సీ రికార్డును కలిగి ఉండాలి.  లిస్టెడ్ ఎంటిటీ అయి కూడా ఉండాలి.  పాలసీదారులకు అన్ని రకాల పాలసీల సమాచారం అందుబాటులో ఉంచేలా చేయడానికి  బీమా, కార్పొరేట్ ఏజెంట్లు ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సంస్థల కోసం మరిన్ని టై-అప్‌‌‌‌లు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.

నెట్‌వర్క్​ ఆసుపత్రులను తనిఖీ చేయండి

మీ పాలసీ మీకు అవసరమైన వైద్య ఖర్చులను తప్పనిసరిగా కవర్ చేయాలి. ఉదాహరణకు, పాలసీహోల్డర్​ బిడ్డను కనాలని అనుకుంటే, మీ ప్లాన్ ప్రసూతి ప్రయోజనాలను అందిస్తుందని నిర్ధారించుకోవాలి. లిమిట్స్​, సబ్​–లిమిట్స్​ కవరేజీపై ప్రభావం చూపుతాయి. పాలసీ ఫైన్ ప్రింట్ (రూల్స్​) చదవడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. ఆస్పత్రి రూమ్​ అద్దెపై లిమిట్స్ లేని  ప్లాన్‌‌‌‌లను ఎంచుకోవాలి.  మీ ఏరియాతో పాటు దేశమంతటి ఆస్పత్రుల్లో మీ పాలసీ చెల్లుతుందో లేదో చూసుకోండి. అత్యవసర సమయంలో నాన్​‌‌‌‌–నెట్​వర్క్​ ఆస్పత్రిలో  చేరితే రీయింబర్స్​మెంట్​ కూడా ఇస్తారు. కానీ ఇందుకు కొన్ని షరతులు ఉంటాయి.