రక్తపోటు కంట్రోల్​లో ఉండాలంటే..

రక్తపోటు కంట్రోల్​లో ఉండాలంటే..

తినేతిండి శక్తినివ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని పెంచేలా ఉండాలి. లేదంటే లేనిపోని అనారోగ్యాల బారినపడాల్సి వస్తుంది. లైఫ్​స్టయిల్లో మార్పుల వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది హైపర్​టెన్షన్​ (రక్తపోటు). బీపీ పెరిగితే గుండె, మెదడు, మూత్రపిండాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. ఈ రోజు వరల్డ్​ హైపర్​టెన్షన్ డే సందర్భంగా బీపీని ఎలా అదుపు​లో ఉంచుకోవాలో చెప్తున్నారు డాక్టర్లు. 


ఒకప్పుడు అరవై ఏండ్లు దాటాక కానీ బీపీ వచ్చేది కాదు. కాని, ఇప్పుడు 35 నుంచి 40 ఏండ్ల వయసు వాళ్లలో స్టేజ్​–1, స్టేజ్–2 హైపర్​టెన్షన్​ కనిపిస్తోంది. వయసుతో పాటు తినే తిండి, ఉంటున్న వాతావరణం బీపీకి ముఖ్యకారణం కాగా... బీపీని తగ్గించే కాల్షియం, పొటాషియం ఉండే పాలు, పాలపదార్థాలు, పండ్లు తినకపోవడం కూడా అందుకు కారణాలే. 

 

ప్రెజర్ మారితే... 

రక్తపోటుని సిస్టోలిక్, డయాస్టోలిక్ ప్రెజర్​ అని లెక్కిస్తారు. సిస్టోలిక్ ప్రెజర్​ అనేది గుండె కొట్టుకునేటప్పుడు ధమనుల్లో ఉన్న ప్రెజర్​ని సూచిస్తుంది. డయాస్టోలిక్ ప్రెజర్ అనేది గుండె చప్పుళ్ల మధ్యలో ధమనుల్లో రక్తం ఎంత ప్రెజర్​లో ఉందో చెప్తుంది. మామూలుగా సిస్టోల్, డయాస్టోల్ ప్రెజర్ 120/80 ఉంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు. అలాకాకుండా  సిస్టోల్ ప్రెజర్120 నుంచి 139 వరకు 80 నుంచి 89 వరకు ఉంటే ‘ప్రి–హైపర్​టెన్షన్’ అంటారు. ఈ దశలో మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. లైఫ్​స్టయిల్లో మార్పులు చేసుకుంటే హైపర్​టెన్షన్ బారినపడకుండా జాగ్రత్తపడొచ్చు. బీపీని మిల్లీమీటర్స్ ఆఫ్​ మెర్క్యురీ (ఎంఎం హెచ్​జి)లో కొలుస్తారు. 

రెండు స్టేజ్​లు

హైపర్​టెన్షన్​ స్టేజ్​–1లో సిస్టోలిక్​ ప్రెజర్ 140 నుంచి 159 వరకు, డయాస్టోలిక్ ప్రెజర్ 90‌‌ నుంచి 99  వరకు ఉంటుంది.  అలాకాకుండా.. సిస్టోలిక్ ప్రెజర్160 పైన, డయాస్టోలిక్ ప్రెజర్ 100 పైన ఉంటే దాన్ని స్టేజ్–2 హైపర్​టెన్షన్ అంటారు.కాలుష్యం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్, స్మోకింగ్ వంటివి హైపర్​టెన్షన్ రిస్క్​ని పెంచుతాయి. అలాగే బరువు పెరిగినా హైపర్​టెన్షన్ బారిన పడతారు. 

గట్టిగా అయినప్పుడు

గుండెకు రక్త ప్రసరణ పెరిగినప్పుడు లేదంటే రక్తనాళాల సైజ్ తగ్గి, అవి గట్టిగా అయినప్పుడు బీపీ వస్తుంది. మామూలుగా అయితే వయసు పెరిగే కొద్దీ రక్తనాళాల పనితీరు తగ్గుతుంది. అలాగే స్మోకింగ్ అలవాటు, డయాబెటిక్స్​, ఉప్పు ఎక్కువ తినేవాళ్లలో బీపీ ఎక్కువ ఉంటుంది. బీపీ ఎక్కువైతే.... తలనొప్పి, చెమటలు పడతాయి. గుండె చప్పుడు బయటకి వినిపిస్తుంది. గాబరాగా అనిపిస్తుంది. బీపీ తగ్గితే.. మగతగా ఉంటుంది. సరిగ్గా మాట్లాడలేరు. శరీరం చల్లగా అయిపోతుంది. 

కారణాలివి

హైపర్​టెన్షన్​ ముప్పును పెంచే వాటిల్లో ముఖ్యమైంది ఉప్పు (సోడియం క్లోరైడ్). ఫాస్ట్​ఫుడ్, నిల్వ పచ్చళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్, రెడీ టు ఈట్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ కలిపిన ఫుడ్​లో ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఈ పదార్థాలు ఎక్కువ తినడం వల్ల హైపర్​టెన్షన్ వస్తుంది. ఫ్యామిలీ హిస్టరీలో బీపీ ఉన్నా, వయసు పైబడడం వల్ల కూడా బీపీ వస్తుంది. బీపీ150 పైన ఉంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంది. మూత్రపిండాలు కూడా పాడవ్వొచ్చు.  

డయాగ్నసిస్​

తరచుగా తలనొప్పి వస్తున్నా, కళ్లు చీకట్లు కమ్ముతున్నా. స్పృహ కోల్పోతున్నట్టు అనిపిస్తున్నా    బీపీ చెక్​ చేయించు కోవాలి. కొందరికి డాక్టర్​ దగ్గరకు రాగానే యాంగ్జైటీ వల్ల బీపీ పెరుగుతుంది. దీన్ని ‘వైట్​కోట్ హైపర్​టెన్షన్’ అంటారు. అందుకని ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు బీపీ టెస్ట్ చేసుకోవాలి. ‘అంబ్యులేటరీ బీపీ మానిటరింగ్’ మెషిన్​ ద్వారా 24 గంటలు బీపీని రికార్డ్ చేస్తారు. లేదంటే ఎవరికివాళ్లు ఇంటిదగ్గర  డిజిటల్ స్పిగ్నో మానోమీటర్ ద్వారా వరసగా వారం రోజులు బీపీ రికార్డ్​ చేసుకోవచ్చు. మూడు రికార్డింగ్స్​లో సిస్టోల్ ప్రెజర్ సగటు145 పైన ఉంటే హైపర్​టెన్షన్ ఉన్నట్టు. 

ట్రీట్మెంట్ 

హైపర్​టెన్షన్​ ఏ స్టేజ్​లో ఉన్నా సరే... ట్యాబ్లెట్లు వేసుకోవడంతో పాటు లైఫ్​స్టయిల్​లో మార్పులు తప్పనిసరి. కొందరికీ బీపీ వల్ల గుండె సైజ్ పెరుగుతుంది. అలాంటివాళ్లకు గుండె సైజ్​ని, బీపీని తగ్గించే మందులు ఇస్తారు. వయసుని బట్టి. ఇతర ఆరోగ్యసమస్యల్ని బట్టి  ట్రీట్మెంట్ చేస్తారు. హైపర్​టెన్షన్ తీవత్ర  గురించి తెలుసుకోవడానికి గుండె, మూత్రపిండాల పనితీరు, రక్తనాళాల్లో కొవ్వు శాతం, కాల్షియం, సోడియం మోతాదు కూడా చెక్​ చేస్తారు. దాన్ని బట్టి బీపీని ఎంత కంట్రోల్ చేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తారు.

జీవితాంతం వాడాలా?

బీపీ ట్యాబ్లెట్లు ఎన్ని రోజులు వాడాలి? అనే సందేహం ఉంటుంది కొందరికి. మరికొందరు బీపీ కంట్రోల్లో ఉందని కొన్ని రోజులకు బీపీ ట్యాబ్లెట్లు ఆపేస్తారు. దీనివల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది. దీన్ని ‘రీబౌండ్ హైపర్​టెన్షన్’​ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల గుండెపోటు, మెదడులో రక్తం గడ్డకట్టడం, మూత్ర పిండాలు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. అందుకని బీపీ 120/80 కి వచ్చేంత వరకు ట్యాబ్లెట్స్​ వేసుకోవాలి. అందుకని డాక్టర్లు  చెప్పేంత వరకు ట్యాబ్లెట్లు మానేయొద్దు. 

పాటించాల్సినవి

భోజనంలో ఉప్పు తగ్గించడంతో పాటు ఉప్పు ఎక్కువ ఉండే ఫాస్ట్​ఫుడ్, పచ్చళ్లు, శ్నాక్స్ వంటివి తినొద్దు. సోడియం, క్లోరిన్ ఉండని పింక్​ సాల్ట్​ తినాలి. సోడియం లేని ఉప్పు తింటే మంచిది. బరువు, ఒబెసిటీని కంట్రోల్​లో ఉంచుకోవాలి. కాల్షియం, పొటాషియం ఉండే పాలు, పాల పదార్థాలు, పండ్లు ఎక్కువ తినాలి. ఎనిమిది గంటలు నిద్రపోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి మానేయాలి. ఒత్తిడి తగ్గించుకునేం దుకు యోగా, ధ్యానం వంటివి చేయాలి.  

బీపీ టెస్ట్ 

చిన్నవయసులో బీపీ వస్తే ఆరు నెలలకు ఒకసారి..., బీపీ కంట్రోల్​లో ఉన్న పెద్దవాళ్లు ఏడాదికి ఒకసారి డాక్టర్​ని కలవాలి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు నలభై ఏండ్లు వచ్చాక ఏడాదికి ఒకసారి బీపీ చెక్​ చేసుకోవాలి. 

డాక్టర్. శ్రావణి రెడ్డి కరుమూరు
కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, 
రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్.