జుట్టు రాలుతోందా..? అయితే ఇలా చేయండి

జుట్టు రాలుతోందా..? అయితే ఇలా చేయండి

జుట్టు రాలడం ఈ మధ్య చాలామందిని బాధ పెడుతున్న సమస్య. పాతికేండ్లలోపు పిల్లల్లో దాదాపు ఇరవై ఐదు శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తోంది. దాంతో పాతికేండ్లకే బట్టతల వచ్చేస్తోంది. ఈ సమస్య అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో లోపం వల్ల జుట్టు ఊడుతూ ఉంటుంది. 

వంశ పారంపర్యంగా లేదా వయసు వల్ల వచ్చేదాన్ని ఆండ్రోజెనెటిక్‌‌ అలొపేషియా అంటారు. ఆహార లోపం, ఒత్తిడి వల్ల వచ్చే దాన్ని టెలిజెన్‌‌ ఎఫ్లువియం, తల పైనే కాకుండా ఇతర అవయవాలలో కూడా జుట్టు రాలితే అలొపేషియా ఏరియేటా అని అంటారు. ఈ సమస్యలకు ట్రీట్మెంట్‌‌ ఉంది. కానీ కాలిన, చర్మ వ్యాధుల వల్ల ఊడిపోయిన జుట్టుకు ట్రీట్మెంట్‌‌ లేదు అంటున్నారు డాక్టర్‌‌‌‌ సెజల్‌‌ సహేత.

మామూలుగా అయితే జుట్టు కొంత కాలానికి ఊడి కొత్త జుట్టు వస్తుంది. జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్లకు రోజులో చాలా జుట్టు ఊడిపోతుంది. కొందరికి తల వెంట్రుకలతో పాటు మీసం, గడ్డం కూడా ఊడుతుంటాయి. ఈ సమస్యనే ఆండ్రోజెనిక్‌‌ అలోపేషియా అంటారు. ఈ సమస్యను ముందే గుర్తిస్తే డెర్మటాలజిస్ట్‌‌ను కలిసి  ట్రీట్‌‌మెంట్‌‌ చేయించుకోవచ్చు.

  •   లైఫ్ స్టైల్‌‌ మార్చుకోవాలి. మంచి డైట్‌‌ ఫాలో కావాలి. రోజూ వ్యాయామం చేయాలి. పొగతాగడం మానేయాలి. 
  •  ట్రీట్‌‌మెంట్‌‌లో బాగంగా డెర్మటాలజిస్ట్‌‌ రాసిన మందులను రోజూ వాడాలి. దాని వల్ల హార్మోనల్‌‌ ఇంబాలెన్స్ ఆగిపోయి జుట్టు రాలడం తగ్గుతుంది.
  •  మెసో, పిఆర్‌‌‌‌పి (ప్లేట్‌‌లెట్‌‌ రిచ్‌‌ ప్లాస్మా) అనే నాన్– ఇన్‌‌వేసివ్‌‌ థెరపీలు ఉన్నాయి. వీటిలో ఇంజెక్షన్‌‌ ద్వారా స్కాల్ప్‌‌లోకి మెడిసిన్ పంపుతారు. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది.
  •  హెయిర్ ట్రాన్స్‌‌ప్లాంటేషన్ ద్వారా కూడా జుట్టు పెరిగేలా చేయొచ్చు. కానీ, దీనికి  కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది.