పేమెంట్​ మోసాలను ఎదుర్కొందాం ఇలా…

పేమెంట్​ మోసాలను ఎదుర్కొందాం ఇలా…

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగునెఫ్ట్‌‌, ఐఎంపీఎస్‌‌, ఆర్టీజీఎస్‌‌ వంటి సాధారణ డిజిటల్‌‌ పేమెంట్స్‌‌తో పోలిస్తే యూనిఫైడ్‌‌ పేమెంట్స్‌‌ ఇంటర్‌‌ఫేస్‌‌ (యూపీఐ) గేట్‌‌వేతో డబ్బు పంపడం చాలా సులువు. దాదాపు ఉచితం కూడా. అందుకే దేశంలోని అన్ని ప్రాంతాల్లో యూపీఐ పేమెంట్స్‌‌కు ఆదరణ పెరుగుతోంది. మనదేశంలోకి యూపీఐ విధానం కొత్తగా వచ్చినప్పటికీ, దీనికే అత్యధికులు మొగ్గుచూపుతున్నారు. గత నెల అన్ని రాష్ట్రాల్లో జరిగిన యూపీఐ లావాదేవీల సంఖ్య వంద కోట్లు దాటడమే ఇందుకు నిదర్శనం. యూపీఐ యూజర్ల సంఖ్య కూడా ఇటీవల పది కోట్లు దాటింది. మొబైల్‌‌, వెబ్‌‌సైట్‌‌, ట్యాబ్‌‌.. ఇలా దేనిద్వారా అయినా యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చు. అయితే ఈ విధానంలో  కూడా మోసాలకు అవకాశాలు లేకపోలేదు.

ఇలా మోసం చేస్తారు..

యూపీఐ మోసాలు ఎలా జరుగుతాయి.. వాటిని ఎదుర్కోవడం ఎలా తదితర విషయాలపై బ్యాంకులు తరచూ వారి కస్టమర్లకు ఎస్‌‌ఎంఎస్‌‌లు, ఈ–మెయిల్స్‌‌ ద్వారా సమాచారం పంపిస్తున్నాయి. బ్యాంకు వర్గాలు, ఆర్థికరంగ నిపుణులు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్‌‌ నేరగాళ్లు బ్యాంకు కస్టమర్లకు ఫోన్ చేసి తాము బ్యాంకు అధికారులమని చెప్పుకుంటారు. డెబిట్‌‌కార్డులు, ఎస్‌‌ఎంఎస్‌‌లు, యూపీఐ వన్‌‌ టైం పాస్‌‌వర్డ్‌‌ (ఓటీపీ) వంటి వివరాలు అడుగుతారు. మోసం జరగకుండా ఆపడానికే ఈ వివరాలు తీసుకుంటున్నామని నమ్మిస్తారు. డెబిట్‌‌కార్డు, ఓటీపీ వంటి వివరాలతో నేరగాళ్లు కొత్త వర్చువల్‌‌ పేమెంట్‌‌ అడ్రస్‌‌ (వీపీఏ)ను తయారు చేస్తారు. ఎంపిన్‌‌ను కూడా క్రియేట్‌‌ చేసుకొని డబ్బును లాగేస్తారు. కొన్నిసార్లు కస్టమర్లకు ఎస్‌‌ఎంఎస్‌‌ ద్వారా లింక్స్‌‌ను పంపి, వాటిపై క్లిక్‌‌ చేయాలని అడుగుతారు.

ఇలాంటి యాప్స్‌‌కు దూరం ఉండండి..

అయితే బ్యాంకులు, ఆర్‌‌బీఐ ప్రచారం వల్ల పైన పేర్కొన్న మోసాల గురించి చాలా మందికి తెలిసిపోయింది. దీంతో సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో మోసాలకు తెగబడుతున్నారు. కస్టమర్లకు ఫోన్‌‌ చేసి ‘ఎనీ డెస్క్‌‌’, ‘టీ వ్యూయర్‌‌’ వంటి యాప్స్‌‌ను డౌన్‌‌లోడ్‌‌ చేసుకొని, 9 అంకెల కోడ్‌‌ను ఇవ్వాలని కోరతారు. ఇవి రిమోట్‌‌ కంట్రోలింగ్‌‌ యాప్స్‌‌. అంటే వీటి ద్వారా వాళ్లున్న చోటు నుంచే మన ఫోన్‌‌ను వాడుకోవచ్చు. కాబట్టి ఖాతాల నుంచి డబ్బులు దొంగిలించడం సులువు. మరో విధానం ఏమంటే.. కొందరు మోసగాళ్లు కస్టమర్లకు కాల్‌‌ చేసి ‘మీ ఖాతాలో డబ్బును ఎవరో దొంగిలించారు. గూగుల్‌‌ పే/ఫోన్​ పే ద్వారా రీఫండ్‌‌ పంపిస్తాం. మేం పంపించే లింక్‌‌పై క్లిక్‌‌ చేస్తే డబ్బు వెనక్కి వస్తుంది’ అని నమ్మిస్తారు. నిజానికి వేరే గూగుల్‌‌ పే యాప్‌‌ ద్వారా పేమెంట్‌‌ చేయడానికి బదులు, పేమెంట్‌‌ రిక్వెస్ట్‌‌ పంపిస్తారు. దానిని నొక్కి, పిన్‌‌ను ఎంటర్‌‌ చేయగానే, మోసగాడి ఖాతాలోకి డబ్బు వెళ్లిపోతుంది.

ఈ జాగ్రత్తలు చాలా ముఖ్యం

  •  యూపీఐ ఎంపిన్‌‌‌‌ను ఎవరికీ చెప్పకూడదు. టీమ్‌‌‌‌వ్యూయర్‌‌‌‌ యాప్స్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకోకూడదు.  అపరిచితుల నుంచి వచ్చే యూపీఐ పేమెంట్‌‌‌‌ రిక్వెస్టులను రిజెక్ట్ చేయాలి.
  • ఇబ్బంది వస్తే అఫీషియల్‌‌‌‌ సైట్లలో ఉండే కాల్‌‌‌‌ సెంటర్ల నెంబర్లకు మాత్రమే ఫోన్‌‌‌‌ చేయాలి. కొందరు ఇంటర్నెట్‌‌‌‌లో తమ నంబర్లతో నకిలీ కాల్‌‌‌‌సెంటర్లు నడుపుతున్నారు. ఈ నంబర్లకు కాల్‌‌‌‌ చేస్తే మోసాలబారినపడక తప్పదు.
  • ఆఫర్లు, క్యాష్‌‌‌‌బ్యాక్‌‌‌‌ల పేర్లతో వచ్చే వెబ్‌‌‌‌లింక్‌‌‌‌లపై క్లిక్‌‌‌‌ చేయకూడదు. ఇలాంటి ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌లను ఫార్వర్డ్‌‌‌‌ కూడా చేయకూడదు
  • ఈపీఎఫ్‌‌‌‌ఓ, బీమా పాలసీల వివరాలనూ ఎవ్వరికీ ఇవ్వకపోవడమే మంచిది. ఎలాంటి లావాదేవీలకైనా బ్యాంకు అఫీషియల్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను, యాప్‌‌‌‌ను, యూపీఐ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను మాత్రమే వాడాలి.