పిల్లలు గోర్లు కొరకకుండా చూడాలంటే...

పిల్లలు గోర్లు కొరకకుండా చూడాలంటే...

కొందరు పిల్లలు ఎప్పుడు చూసినా నోట్లో వేళ్లు పెట్టుకుని గోర్లు కొరుకుతుంటారు. ‘గోర్లు కొరకడం మంచి అలవాటు కాద’ని ఎన్నిసార్లు చెప్పినా వినరు. దాంతో  వాళ్లని కోప్పడతారు తల్లిదండ్రులు. పిల్లలు గోర్లు కొరకకుండా చూడాలంటే... ముందుగా వాళ్ల సమస్య ఏంటో తెలుసుకోవాలి. బోర్​ కొట్టినప్పుడు  చాలామంది పిల్లలు గోర్లు కొరుకుతారని చెప్తున్నారు పిడియాట్రిషియన్లు డాక్టర్ సామి, డాక్టర్ అనా.

టీవీ చూస్తూ లేదంటే హోం వర్క్ చేస్తూ కొందరు పిల్లలు గోర్లు కొరుకుతుంటారు. ఎవరైనా చూసి ‘ఎందుకు గోర్లు కొరుకుతున్నావు?’ అని అడిగే వరకు వాళ్లకు గోర్లు కొరుకుతున్నామనే విషయమే తెలియదు. దీన్ని ‘అన్​కంట్రోల్డ్​ బైటింగ్’ అంటారు. కొందరైతే గోర్లని లోతుకంటా కొరుకుతారు. దాంతో గోర్ల దగ్గరి చర్మం తెగి, రక్తం వస్తుంది. అంతేకాదు గోర్లు సమానంగా పెరగవు. కాబట్టి ఈ అలవాటును వీలైంనంత తొందరగా మాన్పించాలి. అందుకు తల్లి దండ్రులు ఏం చేయాలంటే.. 

  •  గోర్లు కొరికే అలవాటు ఉన్న పిల్లల్ని కొట్టడం, తిట్టడం,  పనిష్​మెంట్ ఇవ్వడం  వంటివి చేయొద్దు. అలాచేస్తే వాళ్లు మరింత మొండిగా తయారవుతారు.  గోర్లు కొరకడాన్ని  ఆపరు. అందుకని వాళ్లను దగ్గరకు తీసుకొని ‘గోర్లు కొరకడం వల్ల మట్టి, క్రిములు వంటివి నోటిలోకి వెళ్తాయి. గోర్ల దగ్గరి చర్మం దెబ్బతింటుంది. దాంతో రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి’ అని వివరంగా చెప్పాలి.  
  • వాళ్ల చేతి, కాలి వేళ్ల గోర్లను వారానికొకసారి చిన్నగా కత్తిరించాలి. దాంతో  గోర్లు కొరకడానికి ట్రై చేసినప్పుడు నోటికి గోర్లు అందవు. 
  • చేతిలో ఏదైనా వస్తువు ఉంటే పిల్లలు గోర్లు కొరకడం మానేస్తారు. అందుకని వాళ్లు బోర్​గా ఫీలయినప్పుడు చేతిలో పట్టుకుని ఆడుకునే ఫిడ్జెట్ ఆట బొమ్మలు ఇవ్వాలి. వాళ్లతో క్రెయాన్​ బొమ్మలు తయారుచేయించాలి. అంతేకాదు వాళ్లకు శ్నాక్ ఇచ్చినా కూడా ఇష్టంగా  తింటారు. కాబట్టి ధ్యాస మళ్లుతుంది. 
  •  గోర్లు కొరకుతున్నప్పుడు పిల్లల బిహేవియర్​ని గమనించాలి. నెర్వస్​గా, టెన్షన్​గా ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ‘ఎందుకలా ఉన్నావు?’ అని అడగాలి.  
  • ‘ఈ రోజు స్కూల్లో ఏం జరిగింది? ఏం ఆటలు ఆడారు?’ వంటి ప్రశ్నలు అడిగితే వాళ్లు ఉత్సాహంగా సమాధానం చెప్తారు. దాంతో వాళ్ల మూడ్ మారుతుంది.