
- 978 డేంజర్ స్పాట్స్ గుర్తింపు
- ప్రతిపాదనలు పంపి రెండేళ్లయినా నిధుల కేటాయింపులో జాప్యం
- భయం గుప్పిట్లో జనావాసాలు
నిర్మల్, వెలుగు: జిల్లాల్లో ఇండ్ల మీద నుంచి వెళ్తున్న హై టెన్షన్ వైర్ల కారణంగా స్థానిక ప్రజలు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఈ వైర్లను తొలగించేందుకు సర్వే చేసి ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం 2021లోనే ఎన్పీడీసీఎల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఎన్పీడీసీఎల్ అధికారులు మొత్తం 978 ప్రమాదకరమైన ప్రదేశాలను గుర్తించి.. వాటిని తొలగించేందుకు 10.93 కోట్లు ఖర్చవుతుందని సర్కార్కు ప్రతిపాదనలు పంపారు.సర్వే పూర్తయి రెండేళ్లయినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఆ ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలయ్యాయి.
ప్రజల్లో ఆందోళన
హై టెన్షన్ వైర్లు జనావాసాల పైనుంచే వెళ్తుండటంతో స్థానికంగా ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. వర్షాకాలం ఉరుములు మెరుపులు సంభవిస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వైర్లను తొలగించక కొత్త ఇళ్ల నిర్మాణాలు సైతం సాధ్యం కావడం లేదు. గతంలో ఈ వైర్లన్నీ ఊళ్ళ బయటే ఉండేవి. క్రమంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలు విస్తరించడంతో ప్రస్తుతం ఈ వైర్లు ఊర్ల మధ్యకు వచ్చాయి. స్థానికులు ఇప్పటికే చాలాసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి వైర్లను తొలగించాలని కోరుతున్నా.. ప్రయోజనం లేకుండా పోతుంది. అటు ప్రభుత్వం ఇటు ఎన్పీడీ సీఎల్ సంస్థ హై టెన్షన్ వైర్ల తొలగింపు పై పెద్దగా స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపాదనలు బుట్టదాఖలు...
సర్కారు ఆదేశాలతో ఎన్పీడీసీఎల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన 978 ప్రదేశాల్లో ప్రమాదకర తీగలను తొలగించాలంటూ ప్రతిపాదించారు. 13.5 కిలోమీటర్ల పొడవుతో ఉన్న 33 కేవీ విద్యుత్ వైర్లను తొలగించేందుకు రూ. కోటి 22 లక్షలు, 106 కిలోమీటర్ల పొడవుతో ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లను తొలగించేందుకు రూ. అయిదు కోట్ల 61 లక్షలు, 241 కిలోమీటర్ల పొడవున్న ఎల్ టి లైన్ ల తొలగింపునకు రూ. నాలుగు కోట్ల 10 లక్షలు ఖర్చవుతుందని ఎన్పీడీసీఎల్ అధికారులు అంచనాలు తయారు చేశారు. మొత్తం రూ.10 కోట్ల 93 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయాలని ప్రతిపాదనలో కోరారు. అయితే రెండేళ్లు గడుస్తున్నా ఈ ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు.
మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలే భరించాలి..
హై టెన్షన్ వైర్ల తొలగింపు వ్యవహారాన్ని సంబంధిత మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు చూసుకోవాలని సర్కారు తిరకాసు పెడుతుంది. డెవలప్ మెంట్చార్జీల కింద మొత్తం వ్యయం లో 50 శాతం మున్సిపాలిటీలు మరో 50 శాతం గ్రామపంచాయతీలు భరించాల్సి ఉంటుందంటూ ప్రభుత్వం చెబుతున్నట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే అసలే నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలపై హెచ్ టీ వైర్ల తొలగింపు అదనపు భారమే అవుతుంది.
భయంగా గడుపుతున్నాం...
మా ఇళ్లపై నుంచి హై టెన్షన్ విద్యుత్ తీగలు వెళ్తున్నాయి. దీంతో మేము ఇంటి డాబాలపైకి వెళ్లలేని పరిస్థితి ఉంది. విద్యుత్ తీగల నుంచి వచ్చే శబ్దాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే తాము చాలాసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించాం. అయినా పరిష్కారం చూపలేదు.
- లింగారావు, ఆదర్శనగర్, నిర్మల్
ప్రతిపాదనను రూపొందించాం..
నిర్మల్ జిల్లా లో హై టెన్షన్ తీగల తొలగించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించాం. దీని కోసం రూ.10. 93 కోట్లు ఖర్చవుతుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే పనులు మొదలవుతాయి. ఎన్పీడీసీఎల్ సంస్థ ఇంత పెద్ద మొత్తంలో నిధులు భరించే పరిస్థితి లేదు. - జేఆర్ చౌహన్, ఎస్ ఈ, ఎన్పీడీసీఎల్
ఎప్పుడు ఏమవుతుందోనని భయమేస్తోంది..
ఇళ్లపై హై టెన్షన్ వైర్లు మాకు టెన్షన్ పెడుతున్నాయి. ఎప్పుడు ఏమవుతుందోనని భయంగా ఉంటున్నాం. ప్రభుత్వం త్వరగా నిధులు మంజూరు చేసి పనులు జరిగేలా చూడాలి.
- రాంబాబు, ఆదర్శ్ నగర్, నిర్మల్