మార్కెట్‌లో భారీగా నకిలీ, నాసిరకం మందులు

మార్కెట్‌లో భారీగా నకిలీ, నాసిరకం మందులు
  • సిటీ చుట్టుపక్కల ఫేక్ మెడిసిన్ తయారీ కంపెనీలు 
  • ఉత్తరాది నుంచీ దిగుమతి చేసుకుని అమ్మకాలు 
  • క్యాన్సర్, గుండెజబ్బుల మందులకూ నకిలీలు  
  • జనాల ప్రాణాలకు ముప్పుగా మారిన ఫేక్ మెడిసిన్ రాకెట్
  • 50 రోజుల్లో రూ.6 కోట్ల నకిలీ మందులు స్వాధీనం 
  • 4 కంపెనీలు సీజ్.. మరికొన్నింటికి నోటీసులిచ్చిన డీసీఏ

హైదరాబాద్, వెలుగు:   రాష్ట్రంలో డ్రగ్స్‌ దందా కంటే, నకిలీ మెడిసిన్ దందా ఎక్కువైంది. ఫార్మా హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌లోనే పెద్ద ఎత్తున ఫేక్ మెడిసిన్ తయారీ జరుగుతోంది. గడిచిన 50 రోజుల్లోనే 4 నకిలీ మందుల తయారీ కంపెనీలను డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులు సీజ్ చేశారు. ఇంకా ఇలాంటివి రాష్ట్రంలో వందకుపైగా యూనిట్లు ఉంటాయని భావిస్తున్నారు. 

సుద్దపొడి, చాక్ పీస్ పౌడర్, ఆలుగడ్డ పిండి రకరకాల కెమికల్స్ కలిపి నకిలీ మందులను తయారు చేసి, వాటిని తక్కువ ధరకు మార్కెట్‌‌లో విక్రయిస్తున్నారు. కొన్ని ఆన్‌‌లైన్‌‌ పోర్టళ్లను ఏర్పాటు చేసుకుని ఒక సప్లై చైన్‌‌ సిస్టమ్‌‌ను వాడుకుంటున్నారు. ఇదేగాకుండా  హిమాచల్ ప్రదేశ్‌‌, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి నకిలీ మందులను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. ఇన్నాళ్లు ఈ దందాను ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో గడిచిన 50 రోజుల్లో రూ.6 కోట్లకు పైగా విలువైన నకిలీ, నాసిరకం మెడిసిన్‌‌ను సీజ్ చేసింది. ఇందులో క్యాన్సర్, గుండె జబ్బుల చికిత్సలో వినియోగించే ఖరీదైన మందులకు కూడా డూప్లికేట్స్ ఉన్నట్టు గుర్తించారు.  

బ్రాండెడ్ పేర్లు.. నకిలీ మందులు

నకిలీ మెడిసిన్‌‌ ప్యాకేజీ కోసం బ్రాండెడ్ మెడిసిన్ లోగోలు, పేర్లను కేటుగాళ్లు వినియోగిస్తున్నారు. దాదాపు ఒరిజినల్ ప్రొడక్ట్ తీరుగానే ప్యాకేజ్ చేస్తున్నారని, మెడిసిన్‌‌ను ల్యాబ్‌‌కు పంపించి టెస్ట్ చేస్తే తప్ప కొన్నిసార్లు నకిలీదని గుర్తించలేమని డీసీఏ అధికారులు చెబుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల లోగోలు, వివరాలతో నకిలీ మెడిసిన్‌‌ను ప్యాక్ చేస్తున్నట్టు తనిఖీల్లో డీసీఏ గుర్తించింది. బీపీ, షుగర్ పేషెంట్లు రెగ్యులర్‌‌‌‌గా వాడే రొసువాస్‌‌, టెల్మా, మోనోసెఫ్‌‌, చిమోరల్ ఫోర్ట్, అమాగ్జిలిన్‌‌ వంటి మెడిసిన్‌‌లకు డూప్లికేట్లను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. గత నెల ఐదో తేదీన మచ్చ బొల్లారంలో ఆస్ట్రికా జనరిక్స్ పేరిట నడుస్తున్న ఓ నకిలీ మందుల తయారీ కంపెనీని డీసీఏ అధికారులు సీజ్ చేశారు. ఇక్కడ ఏకంగా పది కంపెనీల పేర్లతో, 36 రకాల నకిలీ యాంటీ క్యాన్సర్ మందులను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ మందుల విలువ రూ.4.35 కోట్లుగా అంచనా వేశారు. రామ్స్ ఫార్మాస్యూటికల్స్ పేరిట మూసాపేట్‌‌లో నకిలీ యాంటీ అల్సర్ మందులను తయారు చేస్తున్న కంపెనీ గుట్టును గత నెల 30న డీసీఏ బయటపెట్టింది. ఇదే కంపెనీకి చెందిన ఓ గోడౌన్‌‌ను నిజామాబాద్‌‌లో గుర్తించగా, అక్కడ ఏకంగా 30 వేల ట్యాబ్లెట్లు దొరికాయి. ఆస్పెన్ బయోఫార్మా, మేక ల్యాబ్స్‌‌, రక్షిత్ డ్రగ్స్ యూనిట్, షకీల్ ఇండస్ట్రీస్ పేరిట నడుస్తున్న 4 నకిలీ మెడిసిన్ తయారీ కంపెనీలను డీసీఏ సీజ్ చేసింది. 

కఠిన చట్టం తేవాలె 

రాష్ట్రంలో ఏటా రూ.6 వేల కోట్ల మెడిసిన్ అమ్మకాలు జరుగుతాయి. ముడి సరుకు తయారీదారుల దగ్గరి నుంచి పేషెంట్‌‌కు మందు చేరేవరకూ ఎంతో మంది ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ఒక్కో దశలో ఒక రకం మార్జిన్‌‌(లాభం) ఉంటుంది. రిటైలర్‌‌‌‌కు 20 నుంచి 25 శాతం మార్జిన్ ఉంటుంది. కానీ, కొన్ని మెడికల్ షాపుల్లో, ఆన్‌‌లైన్ ప్లాట్ ఫామ్స్‌‌లో 30 శాతం, 50 శాతం, 70 శాతం డిస్కౌంట్‌‌కు మెడిసిన్ ఇస్తామని చెబుతున్నారు. నకిలీ, నాసిరకం మందులను తయారు చేసినా, వాటిని సప్లై చేసినా కఠిన శిక్షలు పడేలా చట్టాలు మన దగ్గర లేవు. మెడిసిన్‌‌ను కల్తీ చేసేటోళ్ల భరతం పట్టేలా ప్రభుత్వం చట్టం తేవాలి.  
- రమేశ్ గుప్తా, ఈసీ మెంబర్‌‌‌‌, నేషనల్ కెమిస్ట్‌‌ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్

ప్రజలు జాగ్రత్తగా ఉండాలె

గతంలో చేసిన  రెయిడ్స్‌‌లో రూ.6 కోట్లకుపైగా విలువైన నకిలీ మెడిసిన్‌‌ను సీజ్ చేశాం. 4 కంపెనీలను మూసేశాం. కొంత మంది పక్కాగా నకిలీ మందులు తయారుచేస్తున్నారు. కొందరు ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ మందులు తెప్పించుకుంటుండగా, మరికొందరు ఇక్కడే తయారు చేసి దందా చేస్తున్నారు. నకిలీ మందులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. 
- వి.బి. కమలాసన్‌‌రెడ్డి, డైరెక్టర్ జనరల్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ.

కిడ్నీ, లివర్ దెబ్బ తింటయి

మనం వేసుకున్న మందులను కరిగించి, అవసరమైన పని చేయించడంలో లివర్, కిడ్నీ వంటి ఆర్గాన్స్‌‌, బ్లడ్ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, నకిలీ మెడిసిన్స్ ను అసలు మందు లేకుండా లేదంటే తక్కువ మోతాదు మందుతో తయారు చేస్తారు. వీటి వల్ల పేషెంట్లకు జబ్బు తగ్గకపోగా, ఎక్కువ రోజులు వీటిని వాడితే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ డోసేజ్ మందుతో లేదా ఇతర కెమికల్స్‌‌తో కలిపి కూడా మెడిసిన్ తయారు చేస్తారు. వీటితో కిడ్నీలు, లివర్, హార్ట్ దెబ్బతింటాయి. వీటి పట్ల పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లు సూచించిన మందులను, నమ్మకమైన మెడికల్ షాపుల్లోనే కొనాలి. రాష్ట్రంలో జనరిక్ పేరిట ఊరు, పేరు లేని కంపెనీల పేర్లతో మెడిసిన్ అమ్మకాలు జరుగుతున్నాయి. దీనిపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ దృష్టి సారించాలి.  
- డాక్టర్ గుండగాని శ్రీనివాస్‌‌, ఎండీ ఫార్మకాలజీ, మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్