హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌లో కాంగ్రెస్ సత్తా

హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌లో కాంగ్రెస్ సత్తా
  • బెంగాల్‌‌‌‌లో టీఎంసీ క్లీన్‌‌‌‌స్వీప్.. దేశవ్యాప్తంగా 29 చోట్ల బైపోల్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌‌‌‌సభ, అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీల హవా కొనసాగింది. మొత్తం 29 అసెంబ్లీ సీట్లకు బైపోల్స్ జరిగితే 21 చోట్ల అధికార పార్టీ అభ్యర్థులే గెలిచారు. అస్సాంలో బీజేపీ కూటమి, వెస్ట్ బెంగాల్‌‌‌‌లో టీఎంసీ క్లీన్‌‌‌‌స్వీప్ చేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు పట్టు నిలుపుకున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌లో మాత్రం కాంగ్రెస్ మెరిసింది. అక్కడ జరిగిన మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. 13 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 3 లోక్‌‌‌‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 30న ఉప ఎన్నికలు జరగ్గా.. మంగళవారం ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మహారాష్ట్రకే పరిమితమైన శివసేన తొలిసారిగా రాష్ట్రం వెలుపల ఓ లోక్​ సభ సీటును గెల్చుకుంది. దాద్రానగర్​ హవేలీ లోక్‌‌‌‌సభ నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి కాలాబెన్ డేల్కర్ విజయం సాధించారు.

బీజేపీ సీటు కాంగ్రెస్​ పరం

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లో ఇప్పుడు మూడు సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం మూడు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇందులో ఫతేపూర్‌‌‌‌‌‌‌‌, అర్కి నియోజకవర్గాలు కాంగ్రెస్ సీట్లు కాగా.. జుబ్బల్ కొట్ఖాయ్ స్థానం గతంలో బీజేపీ గెలిచింది. ఎమ్మెల్యే నరీందర్ సింగ్ బ్రగ్త చనిపోవడంతో జుబ్బల్ కొట్ఖాయ్ సెగ్మెంట్‌‌‌‌కు ఉప ఎన్నిక వచ్చింది. అయితే నరీందర్ సింగ్ కొడుకు చేతన్ సింగ్ బ్రగ్తకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. 2017 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌‌‌‌గా పోటీ చేసిన నీలమ్ సారిక్‌‌‌‌కు అవకాశం ఇచ్చింది. దీంతో చేతన్ సింగ్ ఇండిపెండెంట్‌‌‌‌గా పోటీ చేశారు. బీజేపీ ఓట్లు చీలిపోవడంతో కాంగ్రెస్ లాభపడింది. ఇక మండి లోక్‌‌‌‌సభ సీటులోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ దివంగత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్‌‌‌‌ను కాంగ్రెస్ పోటీకి దింపింది. బీజేపీ నుంచి కార్గిల్ యుద్ధ వీరుడు బ్రిగేడియర్ (రిటైర్డ్) ఖుషాల్ ఠాకూర్‌‌‌‌ బరిలో నిలిచారు. హోరాహోరీ పోరులో ప్రతిభా సింగ్ విజయం సాధించారు. మండి సీటు.. సీఎం జై రామ్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ సొంత జిల్లాలోనిది కావడం గమనార్హం.

బెంగాల్‌‌‌‌లో పట్టునిలుపుకున్న మమత

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చిన టీఎంసీ.. ఉప ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించింది. బైపోల్ జరిగిన 4 సీట్లను కైవసం చేసుకుంది. దిన్హట సీటు నుంచి గెలిచిన నితీశ్ ప్రమాణిక్.. కేంద్ర మంత్రిగా నియమితులు కావడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక ఎంపీ జగన్నాథ్ సర్కార్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సంతిపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి పోటీ చేసి గెలిచారు. ఎంపీ పదవిలోనే కొనసాగేందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ రెండు సీట్లను బీజేపీ కోల్పోయింది. ఇక ఖర్దా సీటును సోవన్‌‌‌‌దేవ్‌‌‌‌ ఛటోపాధ్యాయ్‌‌‌‌ దక్కించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో భవానీపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి గెలిచిన ఆయన.. మమతా బెనర్జీ కోసం రాజీనామా చేశారు. ఇప్పుడు ఖర్దా నుంచి గెలిచారు. గొసాబలో టీఎంసీ లీడర్ సుబ్రతా మండల్ గెలిచారు.