పాక్​కు భారీ షాక్ : నిజాం నిధి మనదే

పాక్​కు భారీ షాక్ : నిజాం నిధి మనదే

పాక్​కు భారీ షాక్​.. బ్రిటన్​ కోర్టు సంచలన తీర్పు
70 ఏండ్లుగా సాగుతున్న వివాదానికి తెర
1948లో పాక్​ హైకమిషనర్​ ఖాతాలో 10 లక్షల పౌండ్లు వేసిన ఏడో నిజాం
వడ్డీతో కలిపి ఇప్పుడు రూ. 306 కోట్లకు చేరిన సొమ్ము
సొమ్ము తమదేనంటూ పాకిస్తాన్​ వాదన
ఆయుధాల సరఫరా కోసమే చెల్లించారని బుకాయింపు
ఆధారాలు లేవంటూ కొట్టేసిన బ్రిటన్​ కోర్టు
డబ్బును ఇండియాకు, నిజాం వారసులకు ఇవ్వాలని ఆదేశం
పాక్​ బుద్ధి బయటపడిందన్న ప్రముఖ లాయర్​ హరీశ్​ సాల్వే
ఆయుధాల సప్లయ్​ని ఒప్పుకోవడమే నిదర్శనమని వ్యాఖ్య

లండన్:నిజాం నిధి కోసం అంతర్జాతీయ వేదికగా ఇండియా, నిజాం వారసులు కలిసి దశాబ్దాలుగా చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది. పాకిస్తాన్​కు గట్టి షాక్​ తగిలింది. ఈ మేరకు బ్రిటన్​ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. లండన్​ బ్యాంకులో ఉన్న సుమారు రూ. 306 కోట్ల నిజాం సొమ్ముతో పాకిస్తాన్​కు ఎలాంటి సంబంధం లేదని.. ఇండియాకు, నిజాం వారసులకే అది చెందుతుందని స్పష్టం చేసింది. నగదు బదిలీకి ఏర్పాట్లు చేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించింది. పాక్​ వాదనల్లో పసలేదని, ఎలాంటి ఆధారాలను కూడా ఆ దేశం చూపలేకపోయిందని తీవ్రంగా తప్పుబట్టింది.

ఏమిటీ కేసు?

1948లో హైదరాబాద్​ సంస్థాన్ని ఇండియన్​ యూని యన్​లో విలీనం కోసం ప్రభుత్వం ‘ఆపరేషన్​ పోలో’ చేపట్టింది. ఈ క్రమంలో అదే ఏడాది సెప్టెంబర్​లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీ ఖాన్ 10 లక్షల 7వేల 940 పౌండ్లు (సుమారు రూ. 8 కోట్లు) భద్రపరచాలంటూ బ్రిటన్​లోని పాకిస్తాన్​ హై కమిషనర్​హబీబ్​ ఇబ్రహీం రహిమతుల్లాను కోరారు.

‘‘నిజాం పేరు మీద ఈ డబ్బును సురక్షితంగా ఉంచండి” అంటూ లండన్​లోని నాట్​ వెస్ట్​మిన్​స్టర్​ బ్యాంక్​లోని రహిమతుల్లా ఖాతాలో నిజాం ఆర్థిక మంత్రి నవాజ్‌‌‌‌ జంగ్‌‌‌‌ జమ చేశారు. అటు తర్వాత ఆ సొమ్మును తమకు తిరిగి చెల్లించాలని నిజాం కోరినా రహిమతుల్లా నుంచి స్పందన రాలేదు. దీంతో  1954లో ఏడో నిజాం బ్రిటన్​ కోర్టును ఆశ్రయించారు. కోర్టు పరిధిలోకి వెళ్లడంతో ఆ మొత్తం సొమ్మును బ్యాంకు ఫ్రీజ్​ చేసింది. వడ్డీతో కలిపి ఇప్పుడు అది 35 మిలియన్​ పౌండ్ల(రూ. 306 కోట్ల)కు చేరింది. ఆయుధాలు సరఫరా చేసినందుకు పారితోషికంగా నిజాం తమకు చెల్లించారని, అది తమకే చెందుతుందని పాకిస్తాన్​ వాదిస్తోంది. నిజాం మీర్​ ఉస్మాన్​ అలీ ఖాన్​ మరణం అనంతరం ఆయన మనుమలు ఎనిమిదో నిజాం ముకర్రం జా, ముఫఖం జా న్యాయ పోరాటం చేపట్టారు. ఇండియా కూడా విడిగా న్యాయం పోరాటం చేపట్టింది. అటు తర్వాత ఇండియా, నిజాం వారసులు ఒక్కటయ్యారు. ఇలా ఈ కేసు ఇండియా, పాకిస్తాన్​ వివాదంగా లండన్​ కోర్టులో సుమారు 70 ఏండ్ల నుంచి నడుస్తోంది.

ఇదీ పాక్​ వాదన

ఇండియా, పాక్​ విభజన అనంతరం హైదరాబాద్​ సంస్థానాన్ని చట్టవ్యతిరేకంగా ఇండియాలో కలుపుకున్నారని పాకిస్తాన్​ ఆరోపిస్తోంది.  1948 సెప్టెంబర్​లో ఇండియన్​ యూనియన్​ చేపట్టిన ‘ఆపరేషన్​ పోలో’ నుంచి రక్షణ కోసం ఏడో నిజాం తమ సాయం కోరారని, ఆయన కోరిక మేరకు ఆయుధాలను సరఫరా చేశామని చెబుతోంది. ఆయుధాల సరఫరాకు పారితోషికంగానే అప్పట్లో పది లక్షల పౌండ్లను తమ హైకమిషనర్​ రహిమతుల్లా ఖాతాలో నిజాం వేశారని, దీంతో ఆ సొమ్ము తమకే చెందుతుందని పాకిస్తాన్​ వాదిస్తోంది. హైదరాబాద్​ సంస్థానాన్ని ఇండియా అక్రమంగా కలుపుకుందని, అలా కలుపుకోకముందే ఆ సొమ్మును నిజాం బదిలీ చేశారు కాబట్టి తమకే ఇవ్వాలని ఇన్నాళ్లూ పట్టుబట్టింది.

ఇదీ ఇండియా వాదన

పాక్​ హైకమిషనర్​ ఖాతాలో నిజాం తరఫున జమ చేసిన సొమ్ము ‘సురక్షితంగా నిజాం పేరు మీద భద్రపరచాలి” అని వేసిందే తప్ప దాని వెనుక ఎలాంటి ఒప్పందం లేదని ఇండియా వాదిస్తోంది. చట్టబద్ధంగానే హైదరాబాద్​ సంస్థానం విలీనం జరిగిందని, నిజాంకు చెందిన సొమ్ము ఇండియాకే చెందుతుందని అంటుంది. నిజాం వారుసులు ఇండియా వారేనని కోర్టు దృష్టికి తెచ్చింది. పలు ఆధారాలను బ్రిటన్​ కోర్టు ముందు నిజాం వారసుల తరఫు లాయర్​, ఇండియా తరఫు లాయర్​ ఉంచారు. నిజాం మీర్​ ఉస్మాన్​ అలీ ఖాన్​ 1965లో లండన్​లోని తన డబ్బును భారత రాష్ట్రపతికి చెందేలా చూడాలని కోర్టుకు సాక్ష్యం చెప్పారని ఇండియా తరఫు లాయర్​ గుర్తుచేశారు.

కోర్టు ఏమంది?

వాదనలు విన్న లండన్​లోని  రాయల్​ కోర్టు జడ్జి జస్టిస్​ మార్కస్​ స్మిత్​ బుధవారం 166 పేజీలతో కూడిన తీర్పును వెలువరించారు. పాకిస్తాన్​ వాదనల్లో ఎలాంటి పస లేదని, ఆధారాలు కూడా ఆ దేశం చూపలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. ఆపరేషన్​ పోలోలో భాగంగా హైదరాబాద్​ను ఇండియాలో విలీనం చేశారని, అటు తర్వాత అనేక పరిణామాలు జరిగాయంది. ‘‘పాకిస్తాన్​ నుంచి ఆయుధాలను అందుకున్నందుకు పారితోషికంగానే ఈ సొమ్ము నిజాం పంపినట్లు పాక్​ చెబుతోంది. పారితోషికంగా డబ్బునే ఇవ్వాలని ఏమీ లేదు కదా? ఆయుధాల కోసమే డబ్బును ఇచ్చినట్లు చెప్పే ఆధారాలు పాక్​ దగ్గర ఉన్నాయా? దానికి సంబంధించి ఏదైనా అగ్రిమెంట్​ జరిగిందా?  ఇన్నేళ్లలో పాక్​ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. ఆయుధాల సరఫరాకు, ఈ సొమ్ముకు ఎలాంటి సంబంధం లేదని మేం గుర్తిస్తున్నాం” అని కోర్టు స్పష్టం చేసింది. నిజాం నిధి విషయంలో పాకిస్తాన్​కు ప్రమేయం లేదని, ఆ దేశం వాదనలను  కొట్టిపారేస్తున్నట్లు  పేర్కొంది. 1948లో జమ చేసిన రూ. 8 కోట్ల సొమ్ము వడ్డీతో కలిపి సుమారు రూ. 306 కోట్లకు చేరిందని, అది ఇండియాకు, నిజాం వారసులకే చెందుతుందని తేల్చిచెప్పింది. వాటిని ఇండియన్​ గవర్నమెంట్​, నిజాం వారసులు ఎలా పంచుకుంటారన్నది ఆయా పార్టీలకే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది. నగదు బదిలీకి ఏర్పాట్లు చేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించింది. చట్ట విరుద్ధంగా హైదరాబాద్​ సంస్థానాన్ని ఇండియా కలిపేసుకుందన్న పాక్​ ఆరోపణలను కూడా కోర్టు తప్పుబట్టింది.

ఇండియా హర్షం

70ఏండ్లుగా ఇండియా, పాకిస్తాన్​ మధ్య నలుగుతున్న నిజాం నిధి వివాదానికి బ్రిటన్​ కోర్టు పరిష్కారం చూపడం హర్షణీయమని ఇండియా ప్రకటించింది. ఈ తీర్పు చరిత్రాత్మకమని, స్వాగతిస్తున్నట్లు నిజాం వారసుల తరఫున వాదిస్తున్న అడ్వకేట్​ పాల్​ హెవిట్​ అన్నారు.  ఈ వివాదం మొదలైనప్పుడు తన క్లయింట్​ ముకర్రం జా (నిజాం వారసుడు) చిన్న పిల్లాడని, ఇప్పుడు ఆయన వయసు 80ఏండ్లని తెలిపారు.

పాక్​ మళ్లీ అదే మాట

హైదరాబాద్​ సంస్థానాన్ని అక్రమంగా విలీనం చేసుకున్నారని వాదిస్తున్న పాకిస్తాన్​.. నిజాం నిధిపై తీర్పు తర్వాత కూడా అదే మాట మాట్లాడింది. హైదరాబాద్​ను ఇండియా అక్రమంగా విలీనం చేసుకుందని పాక్​ విదేశాంగ కార్యాలయం బుధవారం ఆరోపించింది. ఇండియా నుంచి రక్షణ కోసమే తమకు నిజాం సొమ్మును అందజేశారని, కోర్టు తీర్పును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. దీనిపై ఏం చేయాలో ఆలోచిస్తున్నామని పేర్కొంది.

తాత పోరాటాన్ని కొనసాగించిన  మనుమలు

పాకిస్తాన్​ హైకమిషనర్​కు బదిలీ చేసిన తన సొమ్మును వెనక్కి ఇవ్వాలంటూ 1954లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీ ఖాన్​ బ్రిటన్​ కోర్టులో కేసు వేశారు. అప్పట్లో పాక్​ అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని ఆయన అప్పీళ్ల కోర్టులో సవాల్​ చేసి విజయం సాధించారు. అయితే, హౌజ్ ఆఫ్ లార్డ్స్‌‌‌‌(యూకే సుప్రీంకోర్టు)కు పాకిస్తాన్​ వెళ్లింది. సొమ్ము న్యాయ వివాదంలో చిక్కుకోవడంతో నాట్​ వెస్ట్​ బ్యాంక్​లోని పాక్​ హైకమిషనర్​ రహమతుల్లా ఖాతాను బ్యాంక్​ ఫ్రీజ్​ చేసింది. ఈ కేసు పరిష్కారానికి రాజీ కోసం ప్రయత్నాలూ జరిగినా ఫలితం కనిపించలేదు. 1967 ఫిబ్రవరి 24న ఏడో నిజాం మరణించారు. దీంతో ఆయన వారసులు ముకర్రం ఝా,  ముఫఖం ఝా కోర్టులో పోరాటం మొదలుపెట్టారు. ఇండియా కూడా విడిగా పోరాటం చేసింది. అటు తర్వాత ఇండియా, నిజాం వారసులు ఒక్కటిగా ముందుకు వెళ్లారు. 2013లో తిరిగి ఈ కేసు విచారణకు రాగా.. నిజాం వారసుల తరఫున అడ్వకేట్​ పాల్​ హెవిట్, ఇండియా తరఫున ప్రముఖ అడ్వకేట్​ హరీశ్​ సాల్వే  వాదించారు. ఇటీవల రెండువారాల పాటు విచారణ సాగించిన రాయల్​ కోర్టు బుధవారం ఇండియాకు, నిజాం వారసులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

పాక్​ బుద్ధి బయటపడింది: సాల్వే

ఇతర దేశాలకు పాకిస్తాన్​ ఆయుధాలను అక్రమంగా సరఫరా చేస్తోందని ఇండియా వాదనకు బ్రిటన్​ కోర్టు వేదికగా రుజువులు దొరికాయి. 1948లోనే నిజాంకు ఆయుధాలను సరఫరా చేశామని, దానికి పారితోషికంగానే ఆయన సొమ్ము వేశారని కోర్టులో పాక్​ ఒప్పుకుంది. ఈ కేసులో ఇండియా తరఫున వాదించిన ప్రముఖ లాయర్​ హరీశ్​ సాల్వే మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్​ బుద్ధి బయటపడిందన్నారు. ఇతర దేశాలకు పాకిస్తాన్​ ఆయుధాలను సరఫరా చేస్తుందనడానికి ఇంతకంటే రుజువులు ఏమి కావాలని ప్రశ్నించారు.

హైదరాబాద్ సంస్థానాన్ని కాపాడుకోవడానికి ఏడో నిజాం ఆయుధాలను కొనుగోలు చేసి ఉంటే ఉండొచ్చు. లండన్ బ్యాంకులో రెండో అకౌంట్ ను ఈ ఆయుధాల కొనుగోలు కోసం ఉపయోగించుకొని ఉండొచ్చు. అయితే ఈ సొమ్మును ట్రాన్స్ ఫర్ చేయడాన్ని మాత్రం ఆయుధాల కొనుగోలు కోసమో, కొనుగోలుకు సంబంధించిన ఏదైనా పరిహారంగానో ఇచ్చినట్లుగా నేను భావించడం లేదు. ఈ ఆదేశాల వల్ల వచ్చే సొమ్మును తీసుకోవడానికి నిజాం వారసులకు, భారత్ కు హక్కుంది. దీన్ని ఎలా తీసుకోవాలన్నది పార్టీలకే (నిజాం కుటుంబం, ఇండియన్ గవర్నమెంట్) వదిలేస్తున్నాను.

– లండన్​రాయల్  కోర్ట్ జడ్జ్ మార్కస్ స్మిత్