
ఖైరతాబాద్ గణేష్.. వినాయక చవితి వేడుకలు వచ్చాయంటే ఈ విగ్రహం గురించి మాట్లాడుకోకుండా ఎవరూ ఉండరు. దాదాపు హైదరాబాదీలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ భారీ లంబోధరుడిని దర్శించుకుంటారు భక్తులు. అలా చూస్తే ఆకాశం అంత ఎత్తులో కనిపించే భారీ గణేష్ విగ్రహం.. ఇవాళ్టికి (సెప్టెంబర్ 04) తొమ్మిది రోజులుగా పూజలందుకుంటోంది. తొమ్మిదో రోజు నగరంలో ఉన్న దాదాపు అన్ని విగ్రహాలు నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ తో పాటు ఇతర చెరువులకు క్యూ కట్టాయి.
నిమజ్జనం సంబరాలు మొదలైన వేళ అందరి చూపు ఖరతాబాద్ గణనాథుడిపైనే ఉంది. చిన్ని విగ్రహాల తరలింపుకే పెద్ద పెద్ద వాహనాలు, ట్రక్కులు, క్రేన్ లు వినియోగిస్తుంటారు. మరి అలాంటిది.. భారీ విగ్రహం.. 40 నుంచి 50 టన్నుల బరువు, 69 అడుగుల ఎత్తు ఉన్న లంబోధరుడిని ఎలా తరలిస్తారో తెలుసుకోవాలని చాలా మంది భక్తుల్లో ఉంటుంది. అయితే ఈ భారీ గణేష్ నిమజ్జనం కోసం ట్రక్కులను మించిన బాహుబలి ట్రక్కును తెప్పించారు నిర్వాహకులు. దాని వివరాలేంటో తెలుసుకుందాం.
విజయవాడ నుంచి భారీ టస్కర్:
ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దగ్గర నిమజ్జన ఏర్పట్లు మొదలయ్యాయి. ఇవాళ (సెప్టెంబర్ 04) చివరి రోజు అర్థరాత్రి వరకు భక్తులకు దర్శనం ఇచ్చిన తర్వాత విగ్రహ తరలింపు ప్రారంభం అవుతుంది. నిమజ్జనం కోసం కోసం విజయవాడ నుండి భారీ టస్కర్ తెప్పించారు నిర్వాహకులు. బుధవారం రాత్రి భారీ ట్రాలీ ఖైరతాబాద్ చేరుకుంది. మహాగణపతి విగ్రహం సుమారు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుంది. ఇంత భారీ విగ్రహాన్ని సాధారణ ట్రక్కులపైన తీసుకెళ్లేందుకు వీలు కాదు. అందుకే ప్రత్యేకంగా రూపొందించిన వాహనాన్ని ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఏపీ నుంచి తెప్పించారు.
►ALSO READ | సెప్టెంబర్ 7 ఆదివారం సంపూర్ణ చంద్ర గ్రహణం హైదరాబాద్ లో కనిపిస్తుందా.. లేదా..?
విజయవాడ నుంచి వచ్చిన భారీ టస్కర్ పై వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు 69 అడుగులు, వెడల్పు 28 అడుగులు కాగా.. విగ్రహాన్ని టస్కర్ పై సక్రమంగా అమర్చేందుకు వీలుగా దానిపై వెల్డింగ్ పనులు జరగనున్నాయి. వెల్డర్ నాగబాబు ఆధ్వర్యంలో 20 మంది వర్కర్స్ తో పనులు జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ బడా గణేషుడు శనివారం (సెప్టెంబర్ 06) నిమజ్జనం కానున్నాడు. హుస్సేన్ సాగర్‌లో ఈ భారీ గణపతి నిమజ్జనం జరగనుంది.
టస్కర్ ప్రత్యేకతలు:
విజయవాడ నుంచి తెప్పించిన ఈ భారీ టస్కర్ కు 26 చక్రాలు ఉంటాయి. 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ టస్కర్ కు 100 టన్నుల బరువును మోసే సామర్థ్యం ఉంటుంది. విగ్రహం కదలకుండా ఉండేలా ఐరన్ స్తంభాలతో బేస్ ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 05) అర్ధరాత్రి టైంలో బడా గణపతిని టస్కర్ పైకి ఎక్కిస్తారని.. ఆ వెంటనే సపోర్టింగ్ వెల్డింగ్ చేస్తారని నిర్వహకులు తెలిపారు.
శుక్రవారం నుంచే గణపతి మండపం చుట్టూ ఉన్న షెడ్డు తొలగించేస్తారు. రాత్రి 12 గంటలకు కలశ పూజ చేయించి.. విగ్రహాన్ని శోభాయాత్రకు రెడీ చేస్తారు. అనంతరం వివిధ రకాల పూలతో టస్కర్ ను అలంకరిస్తారు. శుక్రవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో టస్కర్ పైకి భారీ గణపతి ని చేర్చుతారు. ఆ తురువాత 3 గంటల పాటు సపోర్టింగ్ వర్క్స్ ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
ఆ తర్వాత శనివారం ఉదయాన్నే నిమజ్జన ఊరేగింపు మొదలవుతుంది. దాదాపు 2 నుంచి 3 కిలో మీటర్లు శోభా యాత్ర కి 6 నుంచి 7 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సూర్యాపేట నుంచి డ్రైవింగ్ ఎక్స్పర్ట్ డ్రైవర్ వెంకట రెడ్డిని రప్పించారు. బడా గణేశుడి చెంతన ప్రతిష్ఠించిన కన్యకా పరమేశ్వరి, జగన్నాధ స్వామి, లక్ష్మి సమేత హరిగ్రియ స్వామీ, గజ్జలమ్మ దేవి కోసం హైదరాబాద్ కు చెందిన మరో ట్రక్ ను వినియోగిస్తున్నారు.