నిన్నటిదాకా సామాన్లు అమ్ముకుని..ఇప్పుడు

నిన్నటిదాకా సామాన్లు అమ్ముకుని..ఇప్పుడు
  • ఇప్పుడు ఆడపిల్లలను అమ్ముకుంటున్రు
  • ఆఫ్గాన్ లో ఆకలి కేకలు
  • ఒక్కపూట తిండికీ అలమటిస్తున్న 95 శాతం మంది
  • తాలిబన్ల తిరుగుబాటుతో విదేశాల సహాయం అందట్లే
  • ప్రపంచ దేశాలు ఆదుకోవాలని యాక్టివిస్టుల డిమాండ్

కాబూల్: అసలే కరువు.. ఆపై తాలిబాన్ల తిరుగుబాటు. అఫ్గాన్ ప్రజల పాలిట శాపంగా మారిపోయాయి. అఫ్గానిస్తాన్ లోని పేద ప్రజలు తిండి కోసం ఇంట్లో ఆడపిల్లలను అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నరు. ఒకవైపు చలికాలం ముంచుకొస్తోంది. మరోవైపు ఇప్పటికే కరువు తాండవిస్తోంది. చేద్దామంటే పని ఉండదు. సర్కారు నుంచి సాయం అందదు. చివరకు ఆకలికి అలమటించి చనిపోక తప్పదేమోనన్న భయంతో అఫ్గాన్ లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నరు. తాలిబాన్ల తిరుగుబాటు తర్వాత అఫ్గాన్ లో కనీవినీ ఎరుగని రీతిలో ఆహార సంక్షోభం వస్తుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరించారు. మొదట్లో ఇంట్లో సామాన్లను రోడ్లపై పెట్టి అమ్ముకుంటూ వచ్చిన పేద ప్రజలు.. ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలను ధనవంతులకు అమ్ముకుని కడుపు నింపుకోవాల్సిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. చాలా మంది పేదలు ఆకలిచావులు తప్ప వేరే దిక్కులేక ఆందోళనతో కుంగిపోతున్నారు.   
డబ్ల్యూఎఫ్​పీ ఫుడ్ అందకుంటే కష్టం..   
సెంట్రల్ అఫ్గానిస్తాన్​లో తాలిబాన్లు 2001లో బమియన్ బుద్ధ విగ్రహాన్ని కూల్చేసిన ప్రాంతంలోని ఓ గుహలో ఏడుగురు పిల్లలతో ఉంటోంది ఫాతిమా. కొన్నాళ్ల క్రితమే ఆమె భర్త చనిపోయాడు. పొరుగునే ఉన్న పొలాల్లో పని చేసుకుని, కుటుంబాన్ని పోషించుకునేది. కానీ ఇప్పుడు కరువు కారణంగా పని దొరికే పరిస్థితి లేదు. తాలిబాన్ ల కారణంగా ప్రభుత్వం నుంచి ఫుడ్, సరుకులు అందే అవకాశం లేదు. ప్రభుత్వం నుంచి సరుకులు అందకపోతే తాను, తన పిల్లలు అడుక్కుతినడం లేదా ఆకలితో చావడం తప్ప వేరే మార్గం లేదంటూ ఆమె కన్నీళ్లపర్యంతం అవుతోంది. అఫ్గాన్​లోని చాలా ప్రాంతాల్లో పేదల పరిస్థితి దాదాపు ఇలాగే ఉందని చెప్తున్నారు.  కాబూల్ కు 50 మైళ్ల దూరంలోని వార్దక్ మైదానంలో డబ్ల్యూఎఫ్​పీ ద్వారా అందిన రొట్టె పిండి, నూనె, ఇతర సరుకులను పంపిణీ చేస్తుండగా.. ఇటీవల వందలాది మంది సరుకుల కోసం తరలివచ్చారు. గన్స్ పట్టుకుని నిల్చున్న తాలిబాన్లను చూసి భయంభయంగా లైన్లలో నిల్చున్నారు. కానీ సరుకుల పంపిణీ కూడా తాలిబాన్లు ఇష్టారాజ్యంగా చేస్తుండటంతో తమకు సరుకులు అందుతాయో, లేదోనని చాలా మంది దిగులు చెందుతున్నారు. ‘‘చలికాలం దగ్గరికొస్తోంది. ఇక్కడ సరుకులు దొరకకపోతే నేను రొట్టెలు ఎలా చేసుకుని తినాలి? ఎలా బతకాలో తెలియడంలేదు” అని ఇదే క్యాంపు వద్ద ఓ వృద్ధుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు ఇప్పటికే చాలా మంది పేదలు ఆకలి బాధలు తట్టుకోలేక తమ ఇంటి ఆడపిల్లలను ధనవంతులకు అమ్ముకుంటున్నారని, ఆ వచ్చే డబ్బుతో కుటుంబాలను పోషించుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. 
దేశాలు, సంపన్నులు ఆదుకోవాలె 
‘‘ఆగస్టులో అష్రఫ్​ఘని ప్రభుత్వాన్ని కూల్చేయకముందు ఆహార సంక్షోభాన్ని నివారించవచ్చన్న ఆశలు ఉండేవి. విదేశాల నుంచి సాయం పొంది, ప్రభుత్వం పేదలకు సరుకులను పంచేందుకు అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వం కూలిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ అఫ్గాన్ తో సంబంధాలను తెంచుకున్నాయి. దీంతో అక్కడి ప్రజలకు కూడా అన్ని రకాలుగా సాయం ఆగిపోయింది” అని సోషల్ యాక్టివిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాలిబాన్ల కారణంగా అఫ్గాన్ ప్రజలను ఆకలిచావులకు వదిలేయొద్దని, వారిని మానవతా దృక్ఫథంతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచ దేశాల నేతలు, బిలియనీర్లు తమ వంతుగా సాయంచేసి అమాయక పిల్లలు, పేద ప్రజల కడుపు నింపి కాపాడాలని కోరుతున్నారు.
అన్నిరకాల సాయం బంద్​.. 
ఇప్పటివరకూ ప్రపంచ దేశాల నుంచి ఆహారాన్ని సేకరించి, అఫ్గాన్​లోని పేదలకు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(డబ్ల్యూఎఫ్​పీ) ద్వారా ప్రభుత్వం అందజేసేది. కానీ ప్రెసిడెంట్ అష్రఫ్​ఘని ప్రభుత్వం కూలడం.. తాలిబాన్ ల అరాచకాలు షురూ కావడంతో ఇప్పుడు డబ్ల్యూఎఫ్​పీ నుంచి సాయం అందే పరిస్థితులూ సన్నగిల్లాయి. దీంతో అఫ్గానిస్తాన్ లోని మొత్తం జనాభాలో దాదాపు 95 శాతం మంది ఆకలితో అలమటించిపోయే పరిస్థితులు వచ్చాయని చెప్తున్నారు. అఫ్గాన్ నుంచి అమెరికన్ సేనలు వెళ్లిపోవడం షురూ కాగానే.. మెరుపుదాడులతో అష్రఫ్​ఘని ప్రభుత్వాన్ని కూల్చేసిన తాలిబాన్ లు ఆ తర్వాత షరియా చట్టాల పేరుతో వరుసగా అరాచకాలకు పాల్పడ్డారు. దీంతో మానవతా దృక్ఫథంతో సహాయం చేస్తూ వచ్చిన ప్రపంచదేశాలన్నీ అఫ్గాన్‌‌‌‌కు అన్నిరకాలుగా సాయం బంద్ చేశాయి.