పుట్టింట్లోనే భార్యను పాముతో కరిపించి చంపిన భర్త

పుట్టింట్లోనే భార్యను పాముతో కరిపించి చంపిన భర్త

కట్నం కోసం భార్యను పాముతో కరిపించి చంపిన ఘటన కేరళలో జరిగింది. కొల్లం జిల్లాలోని అంచల్ కు చెందిన సూరజ్, ఉత్రా భార్యభర్తలు. వీరికి వివాహమై రెండేళ్లయింది. వీరికి సంవత్సరం వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. సూరజ్ ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నంతలో వీరి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఉన్నట్లుండి సూరజ్ కు కట్నం మీద మనసు మళ్లింది. దాంతో కట్నం కోసం ఉత్రాను కొన్ని నెలలుగా వేధించేవాడు. అయతే ఉత్రా నుంచి కానీ, ఆమె కుటుంబం నుంచి కానీ ఎటువంటి కట్నం వచ్చే అవకాశంలేదని సూరజ్ గ్రహించాడు. దాంతో ఎలాగైనా ఉత్రాను అంతమొందించాలనుకున్నాడు. కానీ, ఆ హత్య కేసు తనపైకి రాకుండా ఉండాలని ఎంతగానో ఆలోచించి ఒక పథకం వేశాడు.

తనకు తెలిసిన సురేష్ అనే పాములు పట్టే వ్యక్తికి పది వేలు చెల్లించి ఒక పామును కొన్నాడు. ఉత్రా, తాను గదిలో నిద్రపోతుండగా.. పామును ఉత్రాపైకి వదిలాడు. పాము కాటు గమనించిన ఉత్రా వెంటనే తేరుకొని బంధువుల సాయంతో ఆస్పత్రికి చేరుకుంది. అక్కడ కొన్ని రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఉత్రా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఇదంతా మార్చిలో జరిగింది.

ఆ తర్వాత మే7న సూరజ్.. ఉత్రా దగ్గరకు వెళ్లాడు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత సూరజ్.. ఒక కోబ్రాను ఉత్రా మీదికి వదిలాడు. అది ఉత్రాను కాటేయడంతో ఆమె నిద్రలోనే చనిపోయింది. మరుసటి రోజు లేచేసరికి ఉత్రా అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే ఆమె తల్లిదండ్రులు ఉత్రాను ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే ఉత్రా పాము కాటు వల్ల చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. కాగా.. సూరజ్ తనకేమీ తెలియదన్నట్లుగా గదిలో ఉన్న పామును కర్రతో కొట్టి చంపాడు.

అయితే ఉత్రాకు రెండోసారి కూడా పాము కరవడంతో ఆమె తల్లిదండ్రులకు వారం తర్వాత అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సూరజ్ విచారించగా అసలు విషయం బయటపడింది. మొదట సూరజ్ నిజాన్ని ఒప్పుకోకుండా.. ఉత్రా సోదరుడే ఆస్తి కోసం ఇలా చేశాడని ఆరోపించాడు. కానీ.. చివరకు పోలీసుల విచారణలో నిజాన్ని ఒప్పుకోకతప్పలేదు.

సూరజ్ కట్నం కోసం ఈ హత్య చేశాడు. ఉత్రాను చంపడానికి ఐదు నెలలుగా ప్రయత్నిస్తున్నాడు. సూరజ్ కు సహకరించిన సురేష్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం అని కొల్లం గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్ ఎస్. హరిశంకర్ తెలిపారు.

For More News..

వరంగల్ మిస్టరీ: తొమ్మిదిమందిని బతికుండగానే బావిలోకి నెట్టేశారు

ఏపీ సీఎం జగన్ కు ట్వీట్ చేసిన మెగాస్టార్

సీఎం మెరుపులెక్క వచ్చి ఏదేదో మాట్లాడిపోతున్నడు