హుజూరాబాద్ లో మరోసారి రసవత్తరంగా రాజకీయాలు

హుజూరాబాద్ లో మరోసారి రసవత్తరంగా రాజకీయాలు
 

హుజూరాబాద్ పాలిటిక్స్ మరోసారి రసవత్తరంగా మారాయి. ఓ వైపు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తుంటే.. మరోవైపు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ మధ్య నియోజకవర్గంలో ఆధిపత్య పోరు తీవ్రంగా నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉండాలని ఈ ఇద్దరు నేతలు ఇప్పటి నుంచే తమ వంతు ప్రయత్నాలను జోరుగా చేస్తున్నారు. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి బరిలో నిలిచిన ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ ఒడిపోయారు. ఈటల బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో ఉప ఎన్నికను టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసింది. అయినా.. ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఓడిపోయారు. 

చర్చనీయాంశంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు

ఇదిలా ఉంటే.. ఇప్పుడు హుజూరాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులు చర్చనీయాంశంగా మారాయి. హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈనెల 5వ తేదీన చర్చకు రావాలంటూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి కౌంటర్ గా బీజేపీ నేతలు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసిన పాడి కౌశిక్ రెడ్డితో ఈటల రాజేందర్ చర్చలకు రాడని, తామే వస్తామంటూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తామే సిద్ధమంటూ బీజేపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రాజకీయంగా మరింత వేడి రాజుకుంది. 

గెల్లు శ్రీనివాస్, పాడి కౌశిక్ మధ్య అధిపత్య పోరు 

మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ లో సవాల్ విసిరారు. ఈ నెల 5వ తేదీన హుజూరాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు కూర్చుంటా.. మీరు కూడా రండి అంటూ ఈటలకు సవాల్ విసిరారు. అంతేకాదు.. తన వెనక సీఎం కేసీఆర్ ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి దమ్ముంటే తనపై గెలవాలని ఈటలకు కౌశిక్ సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే.. కౌశిక్ రెడ్డి కామెంట్స్ తో  హుజూరాబాద్ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అలర్ట్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ కాదు.. తానేనంటూ ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటించారు. దీంతో ప్రస్తుతం హుజూరాబాద్ రాజకీయాలు ఆసక్తికరంగా, చర్చనీయాశంగా మారాయి. మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉంటాడో లేక పాడి కౌశిక్ రెడ్డి ఉంటారో అనేది అధిష్టానం చేతిలోనే ఉంది.