
- రాష్ట్రంలో ఒకప్పుడు వేల ఎకరాల్లో సాగు..
- ఇప్పుడు అన్ని జిల్లాల్లో కలిపి 793 ఎకరాల్లోనే
హైదరాబాద్, వెలుగు: మూడు దశాబ్దాల కిందట హైదరాబాద్ శివార్లలో అంగూర్ తోటలు వేల ఎకరాల్లో విరగకాసేవి. ఈ ప్రాంతం ద్రాక్ష తోటలకు అనువైనది కావడంతో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లో15 వేల ఎకరాల వరకు గ్రేప్ గార్డెన్స్ విస్తరించి ఉండేవి. ద్రాక్ష తోటలు పెంచి, జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్నవారు కూడా ఉన్నారు. అయితే, ఇరవై ఏండ్ల క్రితం నుంచే రియల్ ఎస్టేట్ ప్రభావం, పెట్టుబడి పెరగడం వంటి కారణాలతో ఏటికేడాది ద్రాక్ష తోటలు కనుమరుగు అవుతున్నాయి. ఒకప్పుడు ఎటు చూసినా ద్రాక్షతోటలే కనిపించే ప్రాంతాల్లో ఇప్పుడు అరుదుగా అక్కడొకటి, ఇక్కడొకటి కన్పిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ద్రాక్ష సాగు 793 ఎకరాలకు పడిపోయిందని అధికారుల లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే గతంలో 10 వేల ఎకరాల్లో ద్రాక్ష తోటలు సాగయ్యేవి. ఇప్పుడు జిల్లాలో కేవలం 132 ఎకరాల్లోనే ద్రాక్ష సాగు అవుతోంది. గతంలో రాష్ట్ర అవసరాలకు సరిపోగా, మిగిలిన ద్రాక్షను విదేశాలకు సైతం ఎగుమతి చేసేవారు. కానీ ఇప్పుడు రైతులు నెమ్మదిగా ద్రాక్ష సాగుకు దూరం అవుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇరవై ఏండ్లుగా తగ్గుముఖం
హైదరాబాద్ శివార్లు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ద్రాక్ష సాగు గత ఇరవై ఏండ్లుగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. శంషాబాద్ ప్రాంతంలో రియల్ బూమ్ పెరగడంతో గ్రేప్ గార్డెన్స్ అన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయాయి. అటు యాదాద్రి జిల్లా, ఇటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాతో పాటు, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ పెరిగింది. దీంతో ద్రాక్ష సాగు క్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో సాగుపై ఆసక్తి ఉన్న రైతులు కూడా వెనకాడుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని కీసర, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో 522 ఎకరాలు, రంగారెడ్డి పరిధిలో132 ఎకరాలు, సిద్ధిపేట జిల్లాలో105 ఎకరాలు, నాగర్ కర్నూల్ లో11 ఎకరాలు, మెదక్‌లో 10 ఎకరాలు, గద్వాలలో 5 ఎకరాలు, వనపర్తిలో 3 ఎకరాలు, నారాయణపేట, నల్గొండల్లో 2 ఎకరాల చొప్పున, మహబూబ్‌నగర్ లో ఒక ఎకరంలో సాగువుతోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆదర్శ రైతుల తోటలను చూపించి చిన్న కమతాల్లో ద్రాక్ష తోటలను ప్రోత్సహించే దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
20 వేల టన్నుల లోటు
రాష్ట్రంలో తలసరి ద్రాక్ష వినియోగం ఏడాదికి 1.92 కిలోలు, తలసరి వ్యయం 182.76 శాతంగా ఉంది. రాష్ట్ర జనాభాలో 41.37 శాతం ద్రాక్ష తినేవారు ఉన్నారు. రాష్ట్ర అవసరాలకు ఏడాదికి రూ. 302.4 కోట్ల విలువైన 31,772 టన్నులు ద్రాక్ష అవసరం. కానీ ప్రస్తుతం 49 మంది రైతులు 793 ఎకరాల్లో ద్రాక్ష సాగు చేస్తుండగా.. రూ.44.58 కోట్ల విలువైన11,145 టన్నుల దిగుబడి వస్తోంది. దీంతో రాష్ట్ర అవసరాలకు కావాల్సిన 20,627 టన్నులకు పైగా ద్రాక్ష కొరత ఏర్పడుతోంది. ఇప్పుడు 793 ఎకరాల్లో ద్రాక్ష సాగు అవుతుండగా, అదనంగా మరో4,970 ఎకరాల్లో గ్రేప్ గార్డెన్స్ విస్తరించాలని ప్రభుత్వానికి హార్టికల్చర్ శాఖ నివేదిక అందజేసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో (1,240 ఎకరాలు), వనపర్తి జిల్లాలో (830 ఎకరాలు), నారాయణపేట జిల్లాలో (830 ఎకరాలు), మహబూబ్‌నగర్ జిల్లాలో (830 ఎకరాలు), నల్గొండ జిల్లాలో (1,240 ఎకరాలు) ద్రాక్ష సాగుకు అవకాశాలు ఉన్నాయని నివేదికలో పేర్కొంది.
ఎకరాకు 3 లక్షలు మిగులుతున్నయి
నేను13 ఏళ్లుగా ద్రాక్ష సాగు చేస్తున్నా. ఎకరాకు వెయ్యి ద్రాక్ష మొక్కలు నాటిన. రెండేళ్లకే మంచి దిగుబడి వస్తోంది. ఒకసారి ద్రాక్ష మొక్కలు నాటితే 20 ఏళ్ల పాటు పంట వస్తుంది. ఒక్కో చెట్టుకు 25 కేజీలు పంట వస్తోంది. ఎకరానికి పెట్టుబడి ఖర్చులు పోను రూ.3 లక్షలు మిగులుతున్నయి.
–కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, రైతు, తుక్కుగూడ, రంగారెడ్డి జిల్లా
రైతులను మోటివేట్ చేస్తున్నాం
పంట భూములన్నీ రియల్ ఎస్టేట్ రంగానికి కన్వర్ట్ కావడంతో ద్రాక్ష తోటలపై ప్రభావం పడుతోంది. గతంలో లక్షల్లో ఉన్న భూముల ధరలు ఇప్పుడు కోట్లలోకి పెరిగాయి. దీంతో సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. దీంతో ఎకరం, రెండెకరాలున్న రైతులను ప్రోత్సహించి ఎక్కువ ఆదాయం పొందేలా అవగాహన కల్పిస్తున్నాం. తుక్కుగూడలో 7ఎకరాల్లో అంజిరెడ్డి అనే రైతు సాగు చేసిన ద్రాక్ష తోటపై ఫీల్డ్ ఇంటరాక్షన్ చేయించడం ద్వారా రైతులను మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
–సునందరెడ్డి, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా
నిజాంల కాలం నుంచే..
స్వాతంత్ర్యానికి ముందు నుంచే హైదరాబాద్ సంస్థానంలో గ్రేప్ గార్డెన్స్ సాగయ్యేవి. నిజాం నవాబుల ప్యాలెస్‌ల ఆవరణలోనూ గ్రేప్ గార్డెన్స్ ఉండేవి. హైదరాబాద్ లో ద్రాక్ష తోటల సాగు ముందుగా టోలిచౌకిలో షురూ అయింది. గద్దె రామకోటేశ్వరరావు తొలి సారిగా ద్రాక్ష సాగు చేశారు. హైదరాబాద్ స్టేట్‌లో ప్రధానంగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో సమశీతోష్ణస్థితి ఉండడంతో ద్రాక్ష సాగుకు బాగా అనుకూలంగా ఉంది. సిటీ శివార్లలో భూస్వాములు ఈ పంటను వందల నుంచి వేల ఎకరాల్లో సాగు చేసేవారు. దీంతో హైదరాబాద్‌కు ‘గ్రేప్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా పేరుండేది. హైదరాబాద్ సంస్థానం పరిధిలోని మరఠ్వాడ ప్రాంతాల్లోనూ ద్రాక్ష సాగు జరిగింది. 1991లో హైదరాబాద్ వేదికగా గ్రేప్స్ గార్డెన్స్పై ఇంటర్నేషనల్ సమిట్‌లు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు గ్రేప్స్ క్యాపిటల్ లో ద్రాక్ష సాగే కనుమరుగు అవుతోంది.