బ్యూటిఫికేషన్ చేయలే..టూరిస్ట్  ప్లేసు  కాలే !.. హామీలకే పరిమితమైన మూసీ నది ప్రక్షాళన  

బ్యూటిఫికేషన్ చేయలే..టూరిస్ట్  ప్లేసు  కాలే !.. హామీలకే పరిమితమైన మూసీ నది ప్రక్షాళన  
  •  అరకొర పనులతోనే కాలం వెళ్లదీసిన రాష్ట్ర సర్కార్
  •  ప్రత్యేక రివర్ ఫ్రంట్ బోర్డు ఏర్పాటైనా ఫాయిదా లేదు 
  • ఎన్నికల ప్రకటనల్లోనే  నది పరిరక్షణ హామీ
  • ఏండ్లుగా ఒక్క చోట కూడా పనులు పూర్తి చేయలేదు
  • కాలుష్య, కబ్జా కోరల్లోని నదిని మాత్రం బాగుచేయలే
  • ఇప్పటికే 1 అసెంబ్లీ, 2 బల్దియా ఎన్నికలు పూర్తి

హైదరాబాద్, వెలుగు: కాలుష్య, కబ్జా కోరల్లో చిక్కిన మూసీ నది పరిరక్షణకు రాష్ట్ర సర్కార్ ఎన్ని హామీలిచ్చినా, ప్రణాళికలు చేపట్టినా.. కార్యరూపం దాల్చడం లేదు.  నదిని బ్యూటిఫికేషన్ చేసి, టూరిజం ప్లేస్‌‌‌‌గా మారుస్తామని సీఎం నుంచి స్థానిక ఎమ్మెల్యే దాకా చెప్పిన మాటలన్నీ ఎన్నికలకే పరిమితమయ్యాయి. వికారాబాద్‌‌‌‌లోని అనంతగిరి కొండల్లో పుట్టి కృష్ణానదిలో కలిసే ఒకప్పటి జీవనది మూసీ. ఇది హైదరాబాద్ లో 33 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆక్రమణలకు గురైన మూసీని పరిరక్షిస్తామంటూ  సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు.  అందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. మూసీ బ్యూటిఫికేషన్ కు యాక్షన్  ప్లాన్ రూపొందించి ఏండ్లు గడిచింది. అయినా నాగోల్ మినహా నది పొడవునా ఎక్కడ పనులు జరగలేదు. 

2001లోనే పడిన తొలి అడుగు..

నది పరివాహక, చారిత్రక ఆనవాళ్లు ఉన్న నదుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ రివర్‌‌‌‌‌‌‌‌ వాటర్ కన్జర్వేషన్  స్కీంలో భాగంగా మూసీ ప్రక్షాళనకు 2001లో తొలి అడుగు పడింది. ఇందుకు సిటీలో 33 కిలోమీటర్ల మేర పారే మూసీ నదిని పరిరక్షించడమే ప్రధాన లక్ష్యం. దీంతో నది పరివాహక ప్రాంతాల అభివృద్ధి, కాలుష్య కారకాల నియంత్రణ, మురుగు నీరు కలవకుండా ఇంటర్వేషన్ అండ్ డైవర్షన్ నిర్మాణాలు, ల్యాండ్ స్కేప్, పార్కులను అభివృద్ధి చేసేలా కేంద్రం నిధులు కేటాయించింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్రప్రభుత్వం ఇచ్చే 75 శాతం నిధుల్లో రూ. 400 కోట్లను విడుదల చేసింది.  నేటికీ అనేక చర్యలు తీసుకుంటున్నామని ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రయోజనం లేదు. మూసీ ప్రక్షాళనకు రూ. 4 వేల కోట్లతో ప్రపోజల్స్​ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. 

వంతెనలు, బోటింగ్ అని చెప్పి.. 

మూసీపై వంతెనల నిర్మాణంతో పాటు బోటింగ్ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2014, 2018 అసెంబ్లీతో పాటు గ్రేటర్ ఎన్నికల ప్రచారాల్లోనూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో పాటు అధికార పార్టీకి చెందిన నగర లీడర్లు హామీలు ఇచ్చారు. పనులు మాత్రం చేపట్టలేదు. నేటికీ నది కంపు కొడుతూనే ఉంది. మూసీలోకి వచ్చే వాటర్ చానళ్లను ఆక్రమించడంతో పాటు, యథేచ్ఛగా పారిశ్రామిక, మానవ వ్యర్థాలను కలిపేస్తున్నారు.  

సిటీలో ప్రతిరోజు ఉత్పత్తయ్యే 1,300 ఎంఎల్టీల మురుగునీటిలో 600 ఎంఎల్డీల నీటిని మాత్రమే శుద్ధిచేసి నదిలోకి వదులుతున్నామని అధికారికంగా చెబుతున్నప్పటికీ  అంతకు మించిన మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.  నదిలో కలిసే మురుగు, వ్యర్థాలతో పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. మూసీ వెంట సీవరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేసి మురుగునీటిని శుద్ధి చేయాలంటూ రూపొందించిన ప్రణాళికలు కూడా కార్యరూపంలోకి రాకపోగా మేధావులు, పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నట్లు చెబుతున్నప్పటికీ వాటితో ఎంతమేర ఉపయోగమనేది తెలియడంలేదు.

ఎన్నికలప్పుడే  ప్రస్తావన.. 

గుజరాత్‌‌‌‌లోని సబర్మతి నది తరహాలో మూసీని డెవలప్ చేస్తామని గతంలో మంత్రి కేటీఆర్ పలుమార్లు చెప్పారు. 2016లో బల్దియా ఎన్నికలప్పుడు మూసీ అభివృద్ధిపై ప్రకటన చేసి, ఎన్నికల్లో  గెలిచిన తర్వాత 2017 జులైలో అప్పటి మేయర్, అధికారులతో కలిసి గుజరాత్​ సబర్మతి నదిని పరిశీలించారు. ఆ పర్యటన తర్వాత అదే ఏడాది ఆగస్టులోనే మూసీ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నేటికీ  పనులైతే చేయలేదు.  మరోసారి 2020లో జరిగిన ఎన్నికల్లోనూ మూసీ బ్యూటిఫికేషన్ , పరిరక్షణపై ఎన్నో హామీలు ఇచ్చారు. మూడునెలల కిందట మరోసారి కేటీఆర్ .. మూసీపై ఎక్స్​ప్రెస్​వేలు నిర్మించనున్నట్టు చెప్పారు.  అయితే ఇప్పటికే ఇరువైపులా ఎక్స్ ప్రెస్​ వే  వేయాలని ప్లాన్ ఉండగా నిధులు లేక ముందుకు సాగడం లేదు. 

 మళ్లీ జీవనదిలా మారేనా..?

మూసీకి  ఒకప్పటి కళ వస్తుందా..! అనే దానిపై  క్లారిటీ లేదు. నదిలోని వ్యర్థాల్లో అధిక శాతం విషపూరిత రసాయనాలు ఉండటంతో నీటిని శుద్ధి చేయడం ఎంత వరకు సాధ్యమవుతుందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం  ప్రకటనలతోనే సరిపెట్టకుండా చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. టెక్నాలజీతో కూడా సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీల) ఏర్పాటు అంశంపై దృష్టి పెట్టాలని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పుడు నిర్మిస్తున్నవి కాకుండా మరిన్ని నిర్మించాలని కోరుతున్నారు. విదేశాల తరహాలో టెక్నాలజీని వినియోగించాలని సూచిస్తున్నారు.