షీ నేత్ర టీమ్స్.. వచ్చేశాయ్.. రహస్య కెమెరాలపై ఉక్కుపాదం

షీ నేత్ర టీమ్స్.. వచ్చేశాయ్.. రహస్య కెమెరాలపై ఉక్కుపాదం
  • జోన్​కో బృందం చొప్పున ఏడు టీమ్స్ ఏర్పాటు
  • హోటళ్లు, మాల్స్, స్కూల్స్​, కాలేజీలపై నిఘా
  •  నగరవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేస్తామన్న సీపీ

బషీర్​బాగ్, వెలుగు: మహిళల ఆత్మగౌరవం, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రహస్య కెమెరాలపై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. మహిళా భద్రతను మరింత బలోపేతం చేయడానికి నగర కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం 7 ప్రత్యేక ‘షీ నేత్ర టీమ్స్’ను ఏర్పాటు చేశామని, వీరికి అత్యాధునిక కెమెరా డిటెక్టర్ల వినియోగం,  తనిఖీల సమయంలో పాటించాల్సిన ఎస్​వోపీపై సమగ్ర శిక్షణ అందించామని తెలిపారు.

శుక్రవారం బషీర్​బాగ్​లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ టీమ్​లకు ఆధునిక కెమెరా డిటెక్టర్ పరికరాలను  ఆయన అందజేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. షాపింగ్ మాల్స్​లోని ట్రయల్ రూమ్స్, హాస్పిటళ్లు, హోటళ్లు, హాస్టళ్లు, విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాల్లో రహస్య కెమెరాలు అమర్చి మహిళల గోప్యతకు భంగం కలిగిస్తే ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఈ ప్రత్యేక బృందాల ద్వారా నగరవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. 

యాజమాన్యాలదే బాధ్యత.. 

ప్రైవేటు ప్రదేశాల్లో రహస్య కెమెరాలు లేవని నిర్ధారించుకోవడం ఆయా యాజమాన్యాల బాధ్యత అని, నిబంధనలు అతిక్రమించినా లేదా అజాగ్రత్తగా ఉన్నా కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సంస్థలను బ్లాక్ లిస్ట్ చేస్తామని సీపీ హెచ్చరించారు. ప్రతి సంస్థలో ‘కస్టమర్ సేఫ్టీ ఇన్​చార్జీ’ని నియమించి, వారికి పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడంతో పాటు, యాజమాన్యాలే కెమెరా డిటెక్టర్లను సమకూర్చుకొని ప్రాంగణాల భద్రతను ధ్రువీకరించుకోవాలని సూచించారు.

ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు గమనిస్తే వెంటనే డయల్ 100/112 లేదా షీ టీమ్స్ నంబర్ 9490616555కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ శ్రీనివాసులు, మహిళా భద్రతా విభాగం డీసీపీ డాక్టర్ లావణ్య, షీటీమ్స్ ఏసీపీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.