సిద్ధూ ఎలాంటోడో ముందే చెప్పా కదా..

V6 Velugu Posted on Sep 28, 2021

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామాపై మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ స్పందించారు. ఆయన (సిద్ధూ) నిలకడ లేని మనిషి అని, పాకిస్థాన్‌తో సరిహద్దు ఉన్న పంజాబ్‌కు సెట్‌కాడని తాను ముందే చెప్పానని అంటూ కెప్టెన్ ట్వీట్ చేశారు.

పంజాబ్‌ పీసీసీ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ  రాజీనామా చేస్తున్నట్లు ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించారు. అయితే పీసీసీ చీఫ్ పదవి రాజీనామా చేసినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి తన సేవలను కొనసాగిస్తానని చెప్పారు. ఒక వ్యక్తి ఏదైనా విషయంలో రాజీపడితే అతడి వ్యక్తిత్వం కోల్పోయినట్లు భావిస్తామని, పంజాబ్ భవిష్యత్తు, సంక్షేమం విషయంలో తాను ఎప్పటికీ రాజీపడనని సిద్ధూ స్పష్టం చేశారు. అందుకే పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఈ విషయాలను సోనియా గాంధీకి ఆయన పంపిన లేఖలో పేర్కొన్నారు. అమరిందర్ సింగ్ ఈ రోజు బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో సిద్ధూ రాజీనామా ప్రకటన రావడం గమనార్హం. ఇటీవల పంజాబ్ కాంగ్రెస్‌లో నడిచిన సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్‌ అమరిందర్.. ఆ రోజున సిద్ధూపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. సిద్ధూ అసమర్థుడని, ఆయన నిలకడలేని మనిషి అని, ఆయనకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వాలతో సంబంధాలు ఉన్నాయని అన్నారు. పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగి ఉన్న పంజాబ్‌కు సిద్ధూను సీఎంగా చేస్తే ఆయన వల్ల రాష్ట్రానికి, దేశానికి ప్రమాదమని, ఆయన సీఎంను చేస్తే తాను సహించనని కెప్టెన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సిద్ధూ పీసీసీ పదవిలోకి వచ్చిన 72 రోజులకే ఇవాళ రాజీనామా చేయడంతో కెప్టెన్ గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేశారు.

మరిన్ని వార్తల కోసం..

వర్షాలతో నిలిచిపోయిన రాకపోకలు.. డ్రోన్లతో మందుల సరఫరా

షెడ్యూల్ ప్రకారమే బైపోల్.. వాయిదాకు హైకోర్టు నో

పింఛన్ రావాలంటే ఇంటిమీద గులాబీ జెండా పెట్టుకోవాలట

Tagged Congress, punjab, PCC, amarinder singh, Sidhu

Latest Videos

Subscribe Now

More News