పెద్దాఫీసర్లకు ఇది తగునా!

పెద్దాఫీసర్లకు ఇది తగునా!

పొలిటికల్​ లీడర్​షిప్ అనేది ప్రజల నుంచి నేరుగా అధికారంలోకి వస్తుంది కాబట్టి, తమ పార్టీ ఐడియాలజీకి అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటుంది. వాటిని అమలు చేయడం,​  జనాలకు చేరవేయడం వంటివి ప్రభుత్వాధికారుల ప్రధాన బాధ్యత. ఈ టీమ్​ని నడిపించే బాధ్యత యూనియన్​ పబ్లిక్ సర్వీస్​ కమిషన్​ (యూపీఎస్సీ) ద్వారా ఎంపికయ్యే సివిల్​ సర్వెంట్లపై ఉంటుంది.  స్థూలంగా ఇదీ సెటప్​.

దేశంలో చాలామంది సివిల్​ సర్వీసెస్​ అధికారులు రకరకాల కారణాలతో రాజీనామాలిచ్చేయడాన్ని మోడీ సర్కారు సీరియస్​గా పరిశీలిస్తోంది. దీనిపై పర్సనల్​ అండ్​ ట్రైనింగ్​ డిపార్టుమెంట్​ (డీఓపీటీ) కూడా రూల్స్​ కఠినం చేయాలనుకుంటోంది. సివిల్​ సర్వీసెస్​కి సంబంధించిన నియామకాలు, బదిలీలు, వాళ్ల సర్వీసు బుక్​ను డీఓపీటీయే చూస్తుంది. వచ్చే వారంలో సమావేశమై ఈ రాజీనామాల బెడదపై చర్చించబోతోంది. ప్రస్తుతమున్న రూల్స్​ ప్రకారం ఎవరైనా అధికారి అర్థంతరంగా రాజీనామా చేస్తే… అతను ఏమైనా బకాయిలున్నా, ప్రభుత్వం అతనికి విదేశాల్లో ట్రైనింగ్​ ఇప్పించినా ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి. అలాగే, ప్రొబేషనరీ టైమ్​లో గనుక ఉద్యోగాన్ని వదులుకోవాలనుకుంటే అతనిపై ట్రైనింగ్​కోసం  పెట్టిన ఖర్చు కూడా వాపసు చేయాలి. కొన్నేళ్ల క్రితం వరకు ఖర్చు రాబట్టడమనేది చాలా కచ్చితంగా అమలయ్యేది.

పోయిన నెలలో ముగ్గురు ఐఏఎస్​ ఆఫీసర్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అరుణాచల్​, గోవా, మిజోరాం, యూనియన్​ టెరిటరీ (ఏజీఎంయూటీ) క్యాడర్​ అధికారులు కణ్ణన్​ గోపీనాథన్​ (2012 బ్యాచ్​), కషీష్​ మిట్టల్​ (2011), కర్ణాటక క్యాడర్​కి చెందిన శశికాంత్​ సెంథిల్​ (2009) వేర్వేరు కారణాలతో రిజైన్​ చేశారు. వీరిలో కణ్ణన్, సెంథిల్​లు ‘దేశంలో రాజకీయ పరిస్థితి బాగోలేదు.  స్వేచ్ఛకు అవకాశం లేకుండా పోయింది’ అని తమ రాజీనామాలకు కారణం చెప్పారు. కషీష్​ మిట్టల్​ మాత్రం తనను నీతి ఆయోగ్​ నుంచి తప్పించి అరుణాచల్​ ప్రదేశ్​లో పోస్టింగ్​ ఇవ్వడాన్ని కారణంగా చూపెట్టారు. వీళ్లు కాకుండా సీనియర్​మోస్ట్​ ఐఏఎస్​ ఆఫీసర్, ఫైనాన్స్​ సెక్రటరీగా పనిచేస్తున్న సుభాష్​ గర్గ్​ వాలంటరీ రిటైర్మెంట్​ స్కీమ్​(వీఆర్​ఎస్​)కి అప్లయి చేశారు. తనను ఫైనాన్స్​ నుంచి విద్యుత్​ శాఖకు ట్రాన్స్​ఫర్​ చేయడం చిన్నతనంగా గర్గ్​ భావించారు.

ఈ రాజీనామాలపై ఇప్పటికే అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఫ్రీడమ్​ లేదంటున్నవాళ్లు లెఫ్ట్​ పార్టీలతో సంబంధాలున్నవాళ్లేనని బీజేపీ ఆరోపిస్తుంటే… సివిల్​ సర్వెంట్లపై మోడీ సర్కారు వత్తిడి పెంచిందని కాంగ్రెస్​ ఆరోపిస్తోంది.

పొలిటికల్ కామెంట్లు ఎలా ఉన్నా… ఈ రాజీనామాలపై సివిల్​ సర్వీస్​ అధికారుల్లోనూ ఏకాభిప్రాయం లేదు. రిజైన్​ చేసినవాళ్లను వెనక్కి పిలవడమనేది మోడీ సర్కారు ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని కొందరు అంటున్నారు. మరికొందరుమాత్రం ఇష్టం లేనివాళ్లతో పనిచేయించలేమని అంటున్నారు. ‘రూల్స్​ని కఠినం చేస్తే ఏమవుతుంది? వెళ్లిపోవాలనుకున్నవాళ్లతో పనులు చేయించగలరా? దీనివల్ల ప్రయోజనమేమిటి?’ అంటున్నారు.  సర్వీసు రూల్స్​కూడా ఇదే చెబుతున్నాయి. ‘ఎవరైనా ఆఫీసర్​ సర్వీసు నుంచి తప్పుకోవాలని రాజీనామా చేస్తే ఆమోదించాల్సిందే. అలాంటివాళ్లను వెనక్కి తీసుకున్నా ప్రయోజనముండదు’ అని స్పష్టంగా రూల్​ ఉన్నట్లు సీనియర్​ ఐఏఎస్​ అధికారులు చెబుతున్నారు. ‘ఈ ఇష్యూని లైట్​గా తీసుకోకూడదు. రాజీనామాల్ని ఆపడం సరికాదు. మొత్తం మీద సివిల్​ సర్వెంట్ల మొరాలిటీని పెంచడం ముఖ్యం. రూల్స్​ స్ట్రిక్ట్​ చేస్తే ఏం లాభం?’ అన్నారు రఘునందన్​ అనే రిటైర్డ్​ ఆఫీసర్​. ఈ సమస్యపై వచ్చే వారంలో ఒక గట్టి నిర్ణయానికి డీఓపీటీ రానుంది.