
స్వచ్ఛ సర్వేక్షన్ ఫలితాల్లో భారతదేశంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ సిటీ మళ్ళీ మొదటి స్థానంలో నిలిచింది. ఇండోర్ కార్పొరేషన్ కమిషనర్‌గా, ఇండోర్ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన మన తెలంగాణ బిడ్డ, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ వాసి, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి తీసుకువచ్చిన సంస్కరణల మూలంగానే ఈ అవార్డు లభించిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఇటీవల బసంత్‌నగర్‌కు వచ్చిన ఆయన ‘V6 వెలుగు ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ..
స్వచ్ఛ సర్వేక్షన్ ఫలితాల్లో భారతదేశంలోనే మధ్యప్రదేశ్‌రాష్ట్రంలోని ఇండోర్ సిటి మళ్ళీ మొదటి స్థానంలో నిలిచింది. ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడం, ఆ చెత్తను తిరిగి ఉపయోగించేలా చర్యలు తీసుకోవడం వల్లనే 2017, 2018, 2019, 2020 సంవత్సరాలలో వరుసగా ఇండోర్ సిటీకి ఈ అవకాశం దక్కింది.
ఇండోర్ కార్పొరేషన్ కమిషనర్‌గా, ఇండోర్ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన మన తెలంగాణ బిడ్డ, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌వాసి, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి తీసుకువచ్చిన సంస్కరణల మూలంగానే ఇండోర్ సిటీకి అవార్డ్ లభించిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఇటీవల బసంత్‌నగర్‌కు వచ్చిన ఆయన ‘వి6 వెలుగు ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ . వివరాలు ఆయన మాటల్లోనే…
కూల్‌డ్రింక్ షాప్‌లో పనిచేశాను..
మాది పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్‌నగర్. తల్లిదండ్రులు పరికిపండ్ల సత్యనారాయణ, సరోజ. మేం ఐదుగురు అన్నదమ్ములం, ఒక చెల్లెలు. అందులో నేను మూడవ వాడిని. నాన్న దర్జీ (టైలర్)గా పనిచేసేవాడు. బసంత్‌నగ ర్ సిమెంట్‌ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ప్రతి ఏటా కంపెనీ యాజమాన్యం యూనిఫామ్ కోసం క్లాత్ ఇచ్చేవారు. వాటిని డ్రస్ కుట్టే పని నాన్న చేసేవాడు. నాన్న టైలర్‌గా జీవనం సాగిస్తూ కుటుంబంలోని అందరిని పెద్ద చదువులు చదివించారు. మాది మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్ధిక ఇబ్బందులతో ఎనిమిదవ తరగతిలో కూల్‌డ్రింక్‌షాప్‌లో పనిచేశాను. ఎండా కాలం వచ్చిందంటే నాన్నకు బట్టలు కుట్టడంలో సాయపడేవాడిని. అమ్మమ్మ ఊరు వరంగల్‌లోని కాశీబుగ్గకు వెళ్లినప్పుడల్లా బీడీలు చుట్టేవాణ్ని.
ఏడాది పాటు చదువు చెప్పాం
బసంత్‌నగర్‌లోని ఇండియన్ మిషన్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న సమయంలోనే నాలో కలెక్టర్ కావాలన్న తపన పెరిగింది. ఇందుకు ఆనాడు ప్రభుత్వం కరీంనగర్‌జిల్లాలో వయోజనుల కోసం తీసుకువచ్చిన ‘అక్షర ఉజ్వల’ కార్యక్రమం నాంది పలికింది. అప్పటి జిల్లా కలెక్టర్ భన్వర్‌లాల్ మా స్కూల్‌కు సమీపంలోని జీడీ నగర్‌లోని వృద్దులు, మహిళలకు రాత్రి సమయంలో చదువు నేర్పించాలని సూచించారు. దీంతో ఆ నగర్‌ను స్కూల్‌యాజమాన్యం దత్తత తీసుకోగా, పాఠశాల సమయం ముగిసిన తర్వాత ఆ నగర్‌కు వెళ్ళి ఏడాది పాటు చదువు చెప్పాం. ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు జిల్లా కలెక్టర్‌కు లభిస్తున్న ఆదరణ చూసి నేను కూడా కలెక్టర్ అయి సొసైటీకి సేవ చేయాలనే కాంక్ష నాలో బలంగా నాటుకున్నది.
హోం ట్యూషన్లు చెప్పేవాడిని
పదవతరగతిలో స్కూల్టాపర్గా వచ్చాను. తర్వాత కృష్ణా జిల్లా నిమ్మకూర్‌లోని ఏపీఆర్‌జెసీలో ఇంటర్‌పూర్తి చేయగా, అక్కడ కూడా టాపర్‌గా నిలిచాను. ఉస్మానియా యూనివర్సిటీలో బిటెక్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో చేరి, అక్కడి లైబ్రరీలో కలెక్టర్ కావడం కోసం ఏం చదవాలి ? ఎలా చదవాలనే, మెటిరీయల్‌ఎలా సంపాదించాలనే దానిపైనే దృష్టి పెట్టాను. మధ్య తరగతి కుటుంబం కావడంతో డబ్బులకు ఇబ్బంది ఏర్పడగా, బిటెక్ చదువుతూనే హైదరాబాద్‌లో హోం ట్యూషన్లు చెప్పేవాడిని. నాలుగేళ్ళ పాటు ఒక తపస్సులాగా చదివి బిటెక్‌లో గోల్డ్‌మెడల్‌సాధించాను. భార్య శ్రీభగవద్గీత సైకాలజిస్ట్‌గా పనిచేస్తుండగా, కూతురు శ్రీగౌరీ ఆలయ ఇంటర్, కుమారుడు అక్షర్ 9వ తరగతి చదువుతున్నారు.
అవగాహన తీసుకురావడంలో సక్సెస్ అయ్యాను…
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్. 30 లక్షల జనాభా. 85 మంది కార్పొరేటర్లు. 2005లో ఇండోర్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టే నాటికి రోడ్లు, ఇళ్ళ ముందట ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపించేది. అయితే ఇందుకోసం మార్పు తీసుకురావాలని అనుకున్నాను. కానీ ఇక్కడ ఏడాదికాలంపాటే పనిచేయడంవల్ల అది సాధ్యం కాలేదు. తిరిగి 2015లో ఇండోర్ జిల్లాకు కలెక్టర్‌గా వెళ్లాల్సివచ్చింది. ఇక ఇండోర్‌సిటీని పూర్తిస్థాయిలో క్లీన్‌చేయాలని నిర్ణయించుకున్నాను. 2016లో కేంద్ర ప్రభుత్వం పరిశుభ్రతపై ‘స్వచ్ఛ సర్వేక్షన్’ పేరుతోదేశంలోని 100 పట్టణాలను ఎంచుకుని ర్యాంకులు ప్రకటించగా ఇండోర్‌కార్పొరేషన్ 25వ స్థానంలో నిలిచింది. అయితే మొదటి స్థానంలో మాకెందుకు రాకూడదనే ఆలోచన వచ్చింది.
ఇందుకోసం ముందుగా అధికారులు, డివిజన్ కార్పొరేటర్లను పిలిచి వారితో మీటింగ్ నిర్వహించాను. చెత్త వల్ల కలిగే ఇబ్బందుల గురించి వివరించాను. వారి ద్వారా ఆయా డివిజన్లలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించాను. ముఖ్యంగా ప్రజలకు అర్ధమయ్యే విధంగా పాటలు రాస్తూ వాటి ద్వారా ముందుకు సాగుతూ కొంత మార్పు తీసుకురాగలిగాను. ప్రజలను కన్విన్స్‌చేశాము. ప్రజలు కూడా మనకోసమే అధికారులు కష్టపడుతున్నారని భావించారు. ఇందులో ముఖ్యంగా ఎవరు బయట కుండీలలో చెత్తను వేయవద్దని, ఇంటి నుంచే చెత్తను తీసుకెళ్ళేందుకు కార్మికులు వస్తారని చెప్పాం.
తడి, పొడి చెత్త వేర్వేరుగా…
పొడిచెత్త, తడిచెత్తను వేర్వేరుగా వేసేందుకు ప్లాస్టిక్‌డబ్బాలను అందుబాటులోకి తీసుకువచ్చాము. ఇందుకోసం ప్రతి గృహిణికి శిక్షణ ఇచ్చాము. ఇలా ఏడాది పాటు అందరం కష్టపడ్డాము.. . కూరగాయలు అమ్మే మార్కెట్‌లో కూడా చెత్త కోసం డబ్బాలను ఉపయోగించాము. ఎవరైనా చెత్తను రోడ్లపై వేసినట్టు గుర్తిస్తే వారికి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ఫైన్ వేసేవాళ్ళం. ఇల్లు కట్టుకునే వాళ్లు రోడ్డుపై ఇసుక, కంకర, ఇటుక వేసినా ఫైన్ చెల్లించాలని హెచ్చరించాము. దీనికితోడు ఆయా డివిజన్లకు స్వచ్ఛత విషయంలో పోటీ పెట్టడం వల్ల కార్పొరేటర్లు కూడా చెత్త బయట వేయకుండా చూసేవారు. ఒకప్పుడు ఇక్కడి ప్రజలు నిత్యం రోగాలతో ఆసుపత్రుల పాలవుతుండగా, స్వచ్ఛతపై దృష్టి పెట్టిన తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వే చేస్తే 40 శాతం మంది ప్రజలు ఆసుపత్రులకు వెళ్ళడంలేదని తేలింది. దీంతో ఒక కుటుంబానికి ఆసుపత్రులకు పెట్టే ఖర్చు మిగిలినట్టైంది.
ఏడాదిలోనే దేశంలో నెంబర్ 1 స్థాయికి…
ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తీసుకువచ్చిన మార్పులతో ఏడాదిలో నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాము. 2016లో స్వచ్ఛ సర్వేక్షన్‌లో 25వ స్థానంలో ఉండగా 2017లో ప్రకటించిన ఫలితాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాము. ఇక ఆ సంవత్సరం నుంచి ఇండోర్‌లో రోడ్లు, మా ఇంట్లో చెత్తను ఎందుకు తీసుకుపోవడం లేదని కార్పొరేటర్లపై ప్రజలే ఒత్తిడి తీసుకువచ్చేలా పరిస్థితి మారిపోయింది.. స్వచ్ఛతలో బెస్ట్‌డివిజన్లను ఎంపిక చేసి ఆవార్డులను అందజేశాము. ప్రతి రోజు 7వాహనాల ద్వారా 8,500 మంది సఫాయి కార్మికులు 1200 టన్నుల చెత్తను సేకరిస్తే ఆ చెత్తను తడి, పొడిగా వేరు చేసి ప్యాకింగ్‌చేసి వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లను నెలకొల్పి రీ యూజ్‌చేశాం. ఒకప్పుడు చెత్త డంపింగ్ యార్డులుగా ఉన్న ప్రాంతాలను శుభ్రంగా చేసి అక్కడ టీ స్టాళ్ళను నడిపించేలా చర్యలు తీసుకున్నాము. మురుగు నీటిని శుద్ది చేసి పార్కుల కోసం వినియోగించాము. సింగిల్‌యూజ్‌ప్లాస్టిక్‌ను నిషేధించి పక్కాగా అమలు చేశాము. ఇళ్ళల్లో మిగిలిపోయిన తిండిని వృధాగా పడేయ్యకుండా పుడ్‌బ్యాంకులను ఏర్పాటు చేశాము. 2019 ఏప్రిల్‌నుంచి 2020 జులై వరకు మధ్యప్రదేశ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కమిషనర్‌గా పనిచేసి తిరిగి ఇండోర్ కార్పొరేషన్‌లో స్వచ్చత విషయంలో మరిన్ని అవసరమైన మార్పులు తీసుకువచ్చాము. . చాలా చోట్ల మరుగుదొడ్లు, మూత్ర శాలలు నిర్మించాము. ఎక్కడ చూసినా శుభ్రంగా, పచ్చగా కనిపించేలా చూశాం. దీంతో 2018, 2019, తాజాగా 2020లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘స్వచ్ఛ సర్వేక్షన్’ ఫలితాల్లో ఇండోర్‌సిటి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇది ఇండోర్ కమిషనర్‌గా, జిల్లా కలెక్టర్‌గా, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా కష్టపడిన తీరుకు లభించిన ఫలితంతో ఆనందంగా ఉంది.
ఒకే ఏడాదిలో ఏడు గవర్నమెంట్ ఉద్యోగాలు…
1998లో యుపిఎస్‌ఈ ఇంజినీరింగ్‌సర్వీసెస్‌లో సైంటిఫిక్ పోస్టుల కోసం ఎగ్జామ్‌రాస్తే 56వ ర్యాంకు వచ్చింది. అదే ఏడాది సివిల్స్ రాసినా ప్రిలిమ్స్ రాలేదు. దీంతో 1999లో బాలానగర్‌లోని అడ్వాన్స్ రిసెర్చ్ సెంటర్‌లో సైంటిస్ట్‌గా చేరాను. ఇక్కడ జాబ్‌చేస్తూనే ఏపీ స్టడీ సర్కిల్‌లో కోచింగ్ తీసుకుంటూ వివిధ ఉద్యోగాల పరీక్షలు రాసాను. అలా ఒకే ఏడాదిలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాను.
సేవకోసం ‘ఆలయ ఫౌండేషన్’…
మధ్యప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారిగా సేవలందిస్తున్నప్పటికీ పుట్టిన తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఎంతోకొంత సేవలు అందించాలనే తపనతో కూతురు పేరుతో ‘ఆలయ ఫౌండేషన్’ నెలకొల్పాను. ప్రస్తుతం ఈ ఫౌండేషన్ ద్వారా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్‌జిల్లాల్లో నా మిత్రుల ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు వివిధ సంస్థల ద్వారా 1200 మందికి శిక్షణ ఇప్పించి ఉపాధి చూపించాను. వికలాంగులకు కృత్రిమ అవయవాలను అందించాను. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయించి తలసేమియా వ్యాధితో బాధపడే వారికి రక్తం అందేలా చూశాను. చాలామంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన స్టూ డెంట్స్కి సరైన గైడెన్స్ లేక ఎదగలేకపోతున్న పరిస్థితి చూసి వారి కోసం చాలా కాలేజీల్లో కెరీర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చేశాను. అలాగే ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేస్తాయని, అందువల్ల ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు పొందాలని, వాటి ద్వారానే ఎదగాలని సూచిస్తున్నాను. ఎవరైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఎన్ని కష్టాలు ఎదురైనా…ఆ లక్ష్యాన్ని సాధించే వరకు అలుపెరగకుండా ముందుకు సాగాలని భరోసా కల్పిస్తున్నాను.::: గోదావరిఖని, వీ6, వెలుగు